కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. లోక్‌సభ ఎంపీ పదవికి రాహుల్ దూరం కావాల్సిందేనా? మరో 8 ఏళ్ల వరకు ఆయన ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయరాదా? అనర్హత వేటుపై లోక్‌సభ సచివాలయం నిర్ణయాన్ని మార్చేందుకు ఏదైనా మార్గముందా? పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలుశిక్ష విధించడాన్ని రాహుల్ ఇప్పుడు పైకోర్టులో సవాలు చేసి, తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుంటే ఏం జరుగుతుందనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ.. కొన్ని నెలల క్రితం నాటి లక్షద్వీప్ ఎంపీ కేసును గుర్తుకు తెస్తున్నాయి. హత్యాయత్నం కేసులో ఏకంగా పదేళ్ల జైలుశిక్ష పడి, వెంటనే అనర్హతకు గురైన మహ్మద్ ఫైజల్‌కు.. కేరళ హైకోర్టులో అనుకూలంగా తీర్పు రావడం గమనార్హం.
ఫైజల్ కేసులో ఏం జరిగింది?
పీపీ మహ్మద్ ఫైజల్.. లక్షద్వీప్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించేవారు. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర మాజీ మంత్రి అల్లుడు, కాంగ్రెస్ నాయకుడు అయిన మహ్మద్ సలీహ్‌పై ఫైజల్‌తోపాటు మరికొందరు దాడి చేశారన్నది ప్రధాన అభియోగం. ఫలితంగా హత్యాయత్నం కేసులో నిందితుడిగా సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్నారు మహ్మద్ ఫైజల్.
2023 జనవరి 10న మహ్మద్ ఫైజల్ కేసులో తీర్పు వెలువరించింది కవరట్టి సెషన్స్ కోర్టు. హత్యాయత్నం కేసులో ఆయన్ను దోషిగా తేల్చింది. 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఫలితంగా.. ఫైజల్‌పై అనర్హత వేటు వేస్తున్నట్లు జనవరి 13న లోక్‌సభ సచివాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. దోషిగా తేలిన రోజు(జనవరి 10) నుంచే ఆయనపై చర్యలు అమల్లోకి వచ్చాయని స్పష్టం చేసింది. అనర్హత వేటుతో ఖాళీ అయిన లక్షద్వీప్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికకు.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అయితే.. హత్యాయత్నం కేసులో దోషిగా తేల్చడాన్ని, శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు మహ్మద్ ఫైజల్. ఈ కేసులో జనవరి 25న అసాధారణ నిర్ణయం తీసుకుంది కేరళ హైకోర్టు. ఫైజల్ కోరినట్టుగా హత్యాయత్నం కేసులో ఆయన్ను దోషిగా తేల్చడాన్ని, శిక్ష విధించడాన్ని నిలుపుదల చేసింది. ఫలితంగా ఆయనపై పడిన అనర్హత వేటు చెల్లకుండా పోయింది.
ఫైజల్‌కు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది కేరళ హైకోర్టు. ఫైజల్‌పై అనర్హత వేటుతో తలెత్తే అసాధారణ, మార్చలేని పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. దేశ ఖజానాకు భారమయ్యే ఉపఎన్నికను నివారించేందుకు ఇలా చేయడం అవసరమని చెప్పింది. ఉపఎన్నికల వల్ల లక్షద్వీప్‌లో అభివృద్ధి పనులు కొన్ని వారాలపాటు ఆగిపోతాయని వ్యాఖ్యానించింది. కొత్త సభ్యుడు ఎన్నికైనా.. వారు పని చేసేందుకు 15 నెలలు మాత్రమే సమయం(ప్రస్తుతం లోక్‌సభ కాలం గడువు తీరే వరకు) ఉంటుందని అభిప్రాయపడింది. అయితే.. ఓ ప్రజాప్రతినిధి దోషిగా తేలిన వెంటనే ఆటోమెటిక్‌గా అనర్హులు అవుతారని, పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించలేమని అప్పుడు కేంద్రం వాదించినా.. హైకోర్టు అంగీకరించలేదు. 2018లో లోక్ ప్రహారీ వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గుర్తు చేసింది. నాటి నిర్ణయం ప్రకారం.. ప్రజాప్రతినిధిని దోషిగా తేల్చడంపై స్టే విధిస్తే.. అనర్హత వేటు వర్తించదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
మరోవైపు.. లక్షద్వీప్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలపై సుప్రీంకోర్టులో సవాలు చేశారు ఫైజల్. ఫలితంగా ఉపఎన్నికను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.