Quit India day : మహాత్మాగాంధీ 1942 ఆగస్టు 8న ప్రారంభించిన చరిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమం... 1947 ఆగస్టు 15న వలస పాలన నుంచి భారతదేశం విముక్తం కావడానికి దారితీసింది. బొంబాయి గోవాలియా టాంక్ మైదానంలో ‘విజయమో, వీరస్వర్గమో...’ అని గాంధీజీ ఇచ్చిన పిలుపు- దేశమంతా ఒక్కటై బ్రిటిష్ పాలనకు చరమాంకం పలకడానికి ప్రేరణగా నిలిచింది. తమను తామే పాలించుకుంటూ తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలనే దృఢ సంకల్పం సమష్టిగా భారతీయుల్లో పాదుకుంది. అదే వారికి కొండంత ఆత్మస్థైర్యం, ఉత్సాహాలను ఇచ్చి ముందుకు నడిపింది. వలస పాలకులను దేశం నుంచి తరిమేయడానికి చోదక శక్తిగా పనిచేసింది. గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించిన 80 ఏళ్లకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్నాం. దీన్నిబట్టి క్విట్ ఇండియా ఉద్యమ విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. ఈ సుదీర్ఘయానంలో స్వతంత్ర భారతం సాధించిన విజయాలను గుర్తుచేసుకుందాం. మనం దాటిన మైలురాళ్లను చూసి గర్వపడదాం. మన ముందున్న సవాళ్లను గుర్తించి వాటిని అధిగమించడానికి కలిసికట్టుగా కృషి చేద్దాం.
అహింసే ఆయుధంగా...
బ్రిటిష్ నిరంకుశత్వంపై పోరాటానికి కత్తులు, తుపాకులను కాకుండా అహింసను ఆయుధంగా ప్రయోగించడం గాంధీజీకే చెల్లింది. సహాయ నిరాకరణోద్యమంతోపాటు, స్వాతంత్య్ర పోరాటంలో పలు దశల్లోనూ భారతీయులు అహింసనే అస్త్రంగా ప్రయోగించి ఆశించిన లక్ష్యం సాధించారు. అహింసా మంత్రంతోనే భారతీయులను గాంధీజీ ఏకతాటిపై నడిపించారు. అహింస అనేది భారతదేశ సంస్కృతి, నాగరికతల్లో మొదటినుంచీ అంతర్భాగంగా ఉన్నదే. ఆదర్శంగా ఉన్న అహింసను స్వాతంత్య్ర సమరానికి ఆయుధంగా మలచిన ఘనత గాంధీ మహాత్ముడిదే. స్వాతంత్య్రోద్యమానికి- వందేమాతరం, జై హింద్, ఇంక్విలాబ్ జిందాబాద్ వంటి నినాదాలు; చర్ఖా, రాఖీ, ఉప్పు, ఖద్దరు వంటి శక్తిమంతమైన ప్రతీకలు అదనపు అస్త్రాలుగా తోడయ్యాయి. జనబాహుళ్యాన్ని స్వాతంత్య్రోద్యమంలో ఉత్సాహంగా ఉద్ధృతంగా పాల్గొనేలా పురిగొల్పాయి.
అప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏ పోరాటంలోనైనా అహింసే వ్యూహంగా, ఆయుధంగా విజయం సాధించిన సందర్భం చరిత్రలో మరొకటి లేదు. ఇప్పటికీ గాంధీజీ స్ఫూర్తితోనే ప్రపంచంలో పలు ఉద్యమాలు అహింసాయుతంగా సాగుతున్నాయి. అహింసతో అనుకున్నది సాధించవచ్చునని రాజకీయ కార్యకర్తలు విశ్వసిస్తున్నారు. భారతదేశం మొదటి నుంచీ విదేశీ దండయాత్రలు, దోపిడి, లూటీలను, విధ్వంసాన్ని ఎదుర్కొంటూనే వచ్చింది. ‘విభజించి పాలించు’ సూత్రంతో వలస పాలకులు భారతీయులను విడదీసి బానిసత్వంలోకి నెట్టారు. మధ్య యుగాల నుంచి ఆధునిక కాలం వరకు విదేశీ ముష్కరులపై పృథ్వీరాజ్ చౌహాన్, ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, వీర పాండ్య కట్టబ్రహ్మన, లచిత్ బోర్ఫుకన్, రాణీ అబ్బక్క వంటివారు సాయుధ పోరాటం జరిపి జాతికి చిరస్మరణీయులయ్యారు. అయితే వీరి వీరోచిత పోరాటాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం. అహింసాయుత స్వాతంత్య్రోద్యమంలా దేశమంతటా ఒకేసారి ప్రజ్వరిల్లినవి కావు.