వచ్చే పాతికేళ్లూ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యాక యువతకు (Quality education in india) భారత్ నెలవు కానుందని విశ్లేషణలు, గణాంకాలు ఉద్ఘోషిస్తున్నాయి. ఆ కలిమిని బలిమిగా మలచుకోవడానికి విద్య, ఉపాధి రంగాల్లో దేశం ఏపాటి సన్నద్ధంగా ఉంది? అపార మానవ సంపదను మేలిమి వనరులుగా తీర్చిదిద్దుకోవడానికి, వారి సుస్థిర ఎదుగుదలకు భరోసా (education standards in india) ఇవ్వగలిగేది ప్రధానంగా విద్యారంగమే. 'నాణ్యమైన చదువు విద్యార్థి హక్కు' అని నూతన విద్యావిధానం చెబుతోంది. అందుకు తగిన వాతావరణ పరికల్పన, విప్పారుతున్న అవకాశాలను ఒడుపుగా అందిపుచ్చుకొనే వ్యూహచతురతలు- ఎండమావుల్ని తలపిస్తున్నాయి.
వృత్తివిద్యాసంస్థల్లో సైతం అత్యాధునిక ఆవిష్కరణల ఊసెత్తని మూస పాఠ్యాంశాల బోధన తీరుతెన్నులు నిశ్చేష్టపరుస్తున్నాయి. 'నేషనల్ సైన్స్ ఫౌండేషన్' అంచనా ప్రకారం- రానున్న దశాబ్ద కాలంలో 80 శాతందాకా కొలువులకు గణితం, సైన్స్ అంశాలపై పట్టుతోపాటు సంబంధిత మెలకువలు అత్యవసరం. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమాటిక్స్) సబ్జెక్టులతో ఆర్ట్స్ అంశాలను సమ్మిళితం చేస్తే యువతకు ఉపాధి పరంగా ఎంతో మేలు చేకూరుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
నాలుగు వందలకు పైగా నగరాల్లో..
దేశవ్యాప్తంగా నాలుగు వందలకు పైగా నగరాలు, పట్టణాల్లో స్టెమ్ విద్యపై 'నాస్కామ్' (సాఫ్ట్‌వేర్, సర్వీస్ కంపెనీల జాతీయ సంఘం) నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో కొత్తగా నిగ్గుతేలిన యథార్థమదే. పాఠశాల, ఇంటర్‌స్థాయి బోధనలో ప్రయోగాలు విధిగా అంతర్భాగం కావాలన్నది తాజా అధ్యయన సారాంశం. పాఠ్యప్రణాళికల్ని ఎప్పటికప్పుడు నవీకరించాలని, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయాలన్న నాస్కామ్- పారిశ్రామిక అవసరాల మేరకు విద్యారంగ సంస్కరణలు పట్టాలకు ఎక్కాలని పిలుపిచ్చింది. విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించడమెంత ముఖ్యమో, బోధన సిబ్బందిని నిరంతరం శిక్షణతో రాటు తేల్చడమూ అంతే కీలకమన్న సిఫార్సు శిరోధార్యమైనది.
ప్రాథమిక విద్యకు పట్టం
మౌలిక ప్రగతి వ్యూహాల్లో ప్రాథమిక విద్యకు విశేష ప్రాధాన్యం కల్పించిన దేశాలు (youth in india 2021) సమర్థ మానవ వనరుల దన్నుతో ధీమాగా పురోగమించడం చూస్తున్నాం. నాణ్యమైన విద్యకు, నైపుణ్య శిక్షణకు నార్వే, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, జర్మనీ ప్రభృత దేశాలిస్తున్న ప్రాముఖ్యమే సృజనశక్తుల రూపకల్పనలో వాటిని అంతెత్తున నిలబెడుతోంది. ఆ తరహా వ్యూహరచన, సమర్థ కార్యాచరణ కొరవడిన పర్యవసానంగానే- ప్రాథమిక విద్యారంగాన ఇండియా యాభై సంవత్సరాలు వెనకబడి ఉందని ఆమధ్య యునెస్కో అధ్యయన పత్రం విశ్లేషించింది. నిధుల కొరతతోపాటు దేశాన్ని అంతగా దిగలాగుతున్న అంశమేమిటో బహిరంగ రహస్యం.
ప్రతి ఆరుగురు ప్రాథమిక ఉపాధ్యాయుల్లో..
దేశవ్యాప్తంగా సగటున ప్రతి ఆరుగురు ప్రాథమిక ఉపాధ్యాయుల్లో ఒకరు వృత్తిగత శిక్షణ పొందనివారే. కొవిడ్ సంక్షోభవేళ ఆన్‌లైన్ తరగతుల బోధనలో పాతికశాతం గురువులకు ఎటువంటి శిక్షణా లేదని వెల్లడైంది. ఖాళీలూ లక్షల సంఖ్యలో పేరుకుపోయాయి. దుర్బల పునాదులపై తదుపరి అంచెల్లో విద్యార్జన సాగించినవాళ్లు- పొందిన పట్టాలు నిరర్థకమై ఉపాధి వేటలో ఘోరంగా విఫలమవుతున్నారంటే, తప్పెవరిది? ఉపాధ్యాయ విద్య శిక్షణ కోర్సుల్లో 'స్టెమ్' పాఠ్యప్రణాళికను సమ్మిళితం చేయాలని, బోధన సిబ్బందికి నైపుణ్యశిక్షణ అందించాలంటున్న 'నాస్కామ్' సిఫార్సుల అమలు- ప్రస్తుత అస్తవ్యస్త పరిస్థితుల్ని చక్కదిద్దడానికి దోహదపడుతుంది. పాఠశాల స్థాయినుంచీ విద్యార్థుల్ని శ్రద్ధగా సానపట్టి, వారి ఆసక్తికి అనుగుణమైన రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దే ఇజ్రాయెల్, యూకే, జర్మనీ తదితర దేశాల అనుభవాల్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లోతుగా పరిశీలించాలి. ఉత్తమ ఇంజినీర్లు, అపర ధన్వంతరుల్లాంటి వైద్యులు, చురుకైన న్యాయవాదులే కాదు- కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ తదితర కోర్సుల్లో నిపుణుల సృష్టికీ.. దక్షులైన బోధన సిబ్బందే ప్రాణాధారం. విద్యారంగానికి సమధిక కేటాయింపులు, ఏ పురోగామి దేశానికీ తీసిపోని స్థాయిలో గురువుల తయారీ- పాలకుల చిత్తశుద్ధిని పరీక్షించే జంట లక్ష్యాలు. అవి సాకారమైననాడే, మానవ వనరుల సద్వినియోగంలో భారత్ సగర్వంగా తలెత్తుకోగలిగేది!
ఇదీ చదవండి:కేంద్రం బాటలో పలు రాష్ట్రాలు- పెట్రో ధరలపై వ్యాట్ తగ్గింపు
9లక్షల దీపాలతో అయోధ్య 'దీపోత్సవ్' గిన్నిస్ రికార్డు