తెలంగాణ

telangana

ETV Bharat / opinion

తెలుగు జాతి అనర్ఘరత్నం పీవీ నరసింహారావు

తెలుగు జాతి అనర్ఘరత్నం పీవీ నరసింహారావు మొక్కవోని దీక్షాదక్షతకు పెట్టింది పేరు. ఆయన రాజకీయ దురంధరుడే కాదు గొప్ప పండితుడు కూడా. భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి, ఆర్థిక పునరుజ్జీవనం దిశగా పరుగులు తీయించిన ధీశాలి. ఈ మహా మనీషికి భారతరత్న పురస్కారం అందించి సత్కరించుకోవాల్సిన తరుణమిదే.

PV Narasimha Rao is the diamond of the Telugu race
తెలుగు జాతి అనర్ఘరత్నం పీవీ నరసింహారావు

By

Published : Jun 27, 2020, 4:56 AM IST

భారతదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు రాజకీయ దురంధరుడే కాదు, గొప్ప పండితుడు కూడా. తన మైనారిటీ ప్రభుత్వాన్ని నిండు అయిదేళ్లూ అధికారంలో కొనసాగించి అందరి చేతా ఔరా అనిపించుకున్న ఆధునిక చాణక్యుడాయన. ఇది అసాధారణమైన విషయం. భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి, దివాలా అంచుకు చేరిన దేశాన్ని ఆర్థిక పునరుజ్జీవనం దిశగా పరుగులు తీయించారు. ఆయన లైసెన్స్‌-పర్మిట్‌ రాజ్‌ బంధనాలనుంచి ఆర్థికవ్యవస్థను విముక్తం చేసి అంతర్జాతీయ పోటీకి భారత్‌ను సిద్ధం చేసిన విషయం జగద్విదితమే. అయిదు దశాబ్దాలుగా ఎదుగూబొదుగూ లేకుండా, మందకొడి హిందూ అభివృద్ధి రేటులో దిగబడిపోయిన భారత ఆర్థిక రథాన్ని ప్రగతి పథంలో దౌడు తీయించారు. ఆర్థిక సరళీకరణలో తన ఆర్థికమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చి సమర్థ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.

ప్రతిభకే పట్టం

పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా పనిచేశాను. ఇది ప్రభుత్వంలో అత్యంత కీలకమైన, సున్నితమైన పదవి. సాధారణంగా ప్రధానమంత్రి తనకు ఎంతో నమ్మకస్తుడైన ఐఏఎస్‌ అధికారిని, అందులోనూ తనతో కలిసి గతంలో పనిచేసిన, తన రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఈ పదవిలో నియమించుకుంటారు. నేను మహారాష్ట్ర క్యాడర్‌కు చెందినవాడిని. పైగా, నేను కేంద్రంలో ఎక్కువ కాలం పనిచేయలేదు. అయినప్పటికీ, నేను నిజాయతీగా పనిచేసే సమర్థుడైన అధికారినని మహారాష్ట్ర నాయకుడు శంకరరావు బి.చవాన్‌ కితాబు ఇవ్వడం వల్లనో ఏమో, ప్రధాని పీవీ నన్ను హోం కార్యదర్శిగా నియమించుకున్నారు. ఆయన ఆశ్రిత పక్షపాతానికి తావు ఇవ్వరని, ప్రతిభకే పట్టం కడతారని చెప్పడానికి ఇదొక తార్కాణం. ఇంకా నిదర్శనాలు కావాలంటే- ప్రతిపక్షానికి చెందిన సుబ్రహ్మణ్య స్వామికి క్యాబినెట్‌ హోదా ఇవ్వడం, మరో ప్రతిపక్ష నాయకుడు, గొప్ప వక్త అయిన అటల్‌ బిహారీ వాజ్‌పేయీని ఐక్యరాజ్య సమితిలో కీలక సమావేశానికి భారత ప్రతినిధిగా పంపడాన్ని ఉటంకించవచ్చు. రాజకీయేతరుడు, ఆర్థిక నిపుణుడైన డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించడం అన్నింటికన్నా గొప్ప దృష్టాంతం. పీవీలో నేను గమనించిన మొదటి లక్షణం- ఎప్పుడూ స్థిమితంగా, ప్రశాంతంగా ఉండటం. రాజకీయ శత్రువులు, ముఖ్యంగా సొంత పార్టీ కాంగ్రెస్‌ లోనివారే అనేక సమస్యలు సృష్టిస్తున్నా తన పాలనా విధులు, బాధ్యతలను సమర్థంగా నెరవేర్చిన నిశ్చలచిత్తం ఆయనది. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ ముందుగానే ఆపలేకపోయారని, విధ్వంసానంతర అల్లర్లను నియంత్రించలేకపోయారని విమర్శలున్నాయి. రాజకీయంగా, పాలనాపరంగా ఎదురైన ఇలాంటి సమస్యలెన్నింటినో ఆయన నిభాయించారు. కనుకనే బాబ్రీ మసీదు సమస్యపై పీవీ వ్యవహరించిన తీరులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదని లిబర్హాన్‌ కమిషన్‌ తేల్చిచెప్పింది. స్థితప్రజ్ఞతకు ఆయన గొప్ప ఉదాహరణ. రాజ్యాంగానికి సంపూర్ణ నిబద్ధుడై పాలన సాగించడం పీవీ నరసింహారావులోని విశిష్టత. విధానపరంగా ఎటువంటి కొత్త ప్రతిపాదనను ఆయనకు సమర్పించినా, ఆయన అడిగే మొదటి ప్రశ్న- ‘ఇది రాజ్యాంగబద్ధమేనా?’ అని. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైన దేన్నీ ఆయన ఎన్నడూ అంగీకరించలేదు.

మొక్కవోని దీక్షాదక్షతలు

మొదటి నుంచీ పాశ్చాత్య దేశాలకు, గల్ఫ్‌ ప్రాంతానికి ప్రాముఖ్యమిస్తూవచ్చిన భారత విదేశాంగ విధానానికి ‘తూర్పు వైపు చూపు‘ అంటూ కొత్త దశ, దిశలను అందించిన దార్శనికుడు పీవీ. బంగ్లాదేశ్‌, మియన్మార్‌, థాయ్‌లాండ్‌ వంటి ఇరుగుపొరుగు దేశాలతో, ఆగ్నేయాసియా దేశాల సంఘ(ఏసియాన్‌) సభ్యదేశాలతో సంబంధాలు మెరుగుపరచుకోవడం ద్వారా ఆసియాలో ప్రబల శక్తిగా భారత్‌ నిలదొక్కుకోగలదని ఆయన భావించారు. ఆసియా అంటే చైనా, జపాన్‌లు మాత్రమే కావని ప్రపంచానికి తెలియజెప్పిన ఘనత ఆయనదే. 1992లో దిల్లీలో ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం తెరవడానికి అనుమతించి ఆ దేశంతో స్నేహసహకారాలు బలపడటానికి బాట వేసిన రాజనీతిజ్ఞుడు పీవీ. అదే సమయంలో ఇరాన్‌తోనూ భారత్‌ సన్నిహిత సంబంధాలు పెంపొందడానికి ఆయనే కారణం. అణు, క్షిపణి రంగాల్లో భారతదేశం అగ్ర శక్తిగా బలోపేతం కావాలని ఆశించిన నరసింహారావు, 1996 మే లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అణు పరీక్షకు సిద్ధం కావాలని డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌ను ఆదేశించారు. తీరా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా రావడంతో అది వాయిదా పడింది. 1998లో వాజ్‌పేయీ ప్రభుత్వం అణు బాంబును విజయవంతంగా పరీక్షించడంతో, పీవీ కల నెరవేరింది. 1993-97 మధ్య కాలంలో కశ్మీర్‌లో తిరుగుబాటు ఉద్ధృతంగా ఉన్నప్పటికీ ఆ సమస్యను పరిష్కరించాలని పీవీ గట్టిగా సంకల్పించారు. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమనే వాస్తవాన్ని శిరసా వహించినట్లయితే, సమస్య పరిష్కారానికి తాను అన్ని విధాలుగా కలిసివస్తానని ఫరూక్‌ అబ్దుల్లాతోపాటు కశ్మీర్‌ నాయకులందరికీ ఆయన స్పష్టంచేశారు. ఈ సమస్యపై అడుగు ముందుకు పడకముందే లోక్‌సభ ఎన్నికలు జరిగి కాంగ్రెస్‌ గద్దె దిగాల్సి వచ్చింది. వేర్పాటు వాదానికి ఎన్నికలే విరుగుడు మందు అని భావించబట్టి అంతకుముందు అసోం, పంజాబ్‌లలో ఎన్నికలు జరపడానికి ఆయన చర్యలు తీసుకున్నారు. ఆ రాష్ట్రాల్లో వేర్పాటువాదం సద్దుమణిగి సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి ఇదే ప్రధాన కారణమైంది. నాగా తిరుగుబాటు సంస్థలతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టినదీ పీవీయేననే సంగతి చాలామందికి తెలియదు. 1995 జూన్‌లో పారిస్‌లో ముయివా, ఐజాక్‌ స్వూ వంటి అజ్ఞాత నాగా నాయకులతో భేటీ వేశారు. మొదట కాల్పులు విరమిస్తే సంప్రదింపులతో సమస్య పరిష్కారానికి ముందడుగు వేయవచ్చని వారికి నచ్చజెప్పారు. పూర్వ ప్రభుత్వాలు నాగా సమస్యను కేవలం శాంతిభద్రతల సమస్యగా పరిగణిస్తే, పీవీ దాన్ని రాజకీయ సమస్యగా అంగీకరించడం నాగా నాయకుల మన్ననలు పొంది, వారిని చర్చలకు ముందుకొచ్చేట్లు చేసింది. 1997 ఆగస్టులో కాల్పుల విరమణ జరిగి క్రమంగా నాగాలాండ్‌లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి.

గిట్టనివాళ్ల కుట్రలు

అధికారంలో ఉన్నప్పుడు, ఆ తరవాత కూడా క్రిమినల్‌ కేసుల పరంపరను ఎదుర్కోవలసి వచ్చిన ఏకైక ప్రధానమంత్రి బహుశా నరసింహారావేనేమో. కేసు దర్యాప్తులు, విచారణలు దీర్ఘకాలం సాగి నరసింహారావును తీవ్ర మనోవ్యధకు గురిచేశాయి. 1996-2002 మధ్య కాలంలో జేఎంఎం ముడుపుల కేసు, సెయింట్‌ కీట్స్‌, లఖూభాయ్‌ కేసులు పీవీని చుట్టుముట్టి వేధించినా, వాటన్నింటి నుంచీ చెక్కుచెదరకుండా దోషవిముక్తుడయ్యారు. ఈ కేసులన్నీ రాజకీయ కక్షతో పెట్టినవే. జైన్‌ హవాలా డైరీల ఆధారంగా తమపై పీవీ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినందుకు ప్రతిపక్ష నేతలే కాదు, కాంగ్రెస్‌ నాయకులూ కుతకుతలాడారు. పీవీపై కక్ష తీర్చుకోవడానికి ఆయన్ను కేసుల్లో ఇరికించారు. అయితే, జైన్‌ డైరీల కేసులో దర్యాప్తునకు ఆదేశించినది పీవీ కాదు, సాక్షాత్తు సుప్రీం కోర్టే. దర్యాప్తు పురోగతిని అది వారంవారం సమీక్షించేది. అయినా దీనికి పీవీయే కారణమని సొంత పార్టీవారు, ప్రతిపక్షాలవారు ఆయన పట్ల నిర్దయగా వ్యవహరించడం దురదృష్టకరం. 1996 మే నెలలో ప్రధాని పదవి నుంచి వైదొలగిన పీవీ పుస్తకాలు, రచనలే లోకంగా ఏకాంత జీవితం గడిపేవారు. ‘నరసింహారావుజీ మూలాలు భారతదేశపు ఆధ్యాత్మిక, ధార్మిక ఆత్మలో ఉన్నాయి. డిస్కవర్‌ ఇండియా అంటూ ఆయన పనిగట్టుకుని భారతీయాత్మను కనుగొనాల్సిన అవసరం లే’దని మాజీ విదేశాంగ మంత్రి నట్వర్‌ సింగ్‌ అన్న మాటలు అక్షరసత్యాలు. మహా మనీషి పీవీకి సత్వరం భారతరత్న అవార్డునిచ్చి సత్కరించాల్సిందే.

- కె.పద్మనాభయ్య

(రచయిత- కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌)

ABOUT THE AUTHOR

...view details