స్వచ్ఛమైన ఆహార పదార్థాలను, నీటిని వినియోగించడం, పరిశుభ్రతను పాటించడం స్వస్థతకు సోపానాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. పరిశుభ్రతపై అందరిలో చైతన్యం ఉంటే సమాజంలో చక్కటి పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యమవుతుంది. వ్యక్తిగత పరిశుభ్రత అనేది పారిశుద్ధ్య నిర్వహణలో ప్రాథమిక అంశం. వ్యక్తిగత పరిశుభ్రతను వ్యాధి నిరోధక టీకాతో సరిపోల్చవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు. రక్షిత మంచినీరు, నాణ్యతాప్రమాణాలతో కూడిన పారిశుద్ధ్య విధానాలు ప్రజల ప్రాథమిక హక్కులుగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2010 జులై 28న తీర్మానించింది. భౌతిక దూరం పాటిస్తూ- వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ రక్షణ విధానాల ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని, వీటిని అంకితభావంతో ఆచరించి జపాన్, న్యూజిలాండ్, తైవాన్ దేశాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో విజయం సాధించాయని నేడు ప్రపంచమంతా ప్రశంసిస్తోంది.
సంప్రదాయ విధానాలే మేలు
అతి పురాతనమైన భారతీయ సంప్రదాయ వైద్యవిధానంగా ఆచరణలో ఉన్న ఆయుర్వేదంలోనూ వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకతను వివరించారు. పరిశుభ్రత దైవత్వంతో సమానమని ఆంగ్ల సామెత. వ్యక్తిగత పరిశుభ్రత మనిషికి ఆరోగ్యంతో పాటు మనసుకు ఉల్లాసాన్ని, ప్రశాంతతను చేకూరుస్తుంది. సానుకూల దృక్పథాన్ని (పాజిటివ్ థింకింగ్) అలవరుస్తుంది. వ్యక్తిత్వానికి వన్నె తెచ్చి, సమాజంలో గౌరవాన్ని, ప్రత్యేక గుర్తింపును ఇస్తుందని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారు. కలరా, నీళ్ల విరేచనాలు, హెపటైటిస్-ఎ (కామెర్లు), టైఫాయిడ్, పోలియోలాంటి వ్యాధుల వ్యాప్తికి పారిశుద్ధ్యలోపంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన లేకపోవడమూ కారణమే. మనిషి చేతులు, చేతల ద్వారానే అంటువ్యాధుల కారకాలైన బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశిస్తాయి కాబట్టి- చేతులను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం వ్యక్తిగత పరిశుభ్రతలో ప్రధానాంశం. చేతులను 20 సెకన్ల పాటు సబ్బుతో రుద్ది మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. సబ్బును కూడా కొనలేని పేదలు ఇసుక, బూడిదలాంటి పదార్థాలను ప్రత్యామ్నాయంగా వాడవచ్చని ఈ సంస్థ తెలియజేస్తోంది. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని పాటిస్తున్నారు. తెలిసినవారు ఎదురైతే మర్యాదపూర్వకంగా నమస్కారం చేసే జీవన శైలి భారతదేశానికి సొంతం. పాశ్చాత్యీకరణ ప్రభావంతో అది కాస్తా గతితప్పి- కరచాలనాలు, కౌగిలించుకోవడా(హగ్)లకు దారితీయడమూ అంటువ్యాధుల జోరుకు మరో కారణం. బహిరంగ మల విసర్జన పేదరికానికి చిహ్నం. అది ఎన్నో జబ్బులకు కీలక హేతువు. 2025 సంవత్సరాంతానికి ప్రపంచవ్యాప్తంగా బహిరంగ మల విసర్జనను నిర్మూలించే దిశగా చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి పిలుపిచ్చింది. ప్రపంచ ప్రజారోగ్య సాధికార సంస్థ అయిన డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల మేరకు పేద దేశాల్లో అయిదుశాతం మరణాలు పారిశుద్ధ్యలోపం వల్లనే సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 15శాతం ప్రజలు ఇంకా మల విసర్జనకు పొలాలు, కాలువ గట్లను ఎంచుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారు. 40శాతం ప్రజానీకానికి మరుగుదొడ్ల సౌకర్యం లేదు. మరో 40శాతానికి చేతులు శుభ్రపరచుకోవడానికి కనీస నీటివసతి లేదు. పారిశుద్ధ్యంపై ఒక రూపాయి పెట్టుబడి పెడితే అంతకు నాలుగింతలు విలువను ఆరోగ్యం రూపంలో ఆదా చేయవచ్చని యునిసెఫ్ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.