నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టగానే పంజాబ్‌లో వాతావరణం చల్లబడిందని అంతా అనుకున్నారు. తన ప్రమాణస్వీకారం సభకు వచ్చిన ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పాదాలకు సిద్ధూ నమస్కరించడంతో ఇక ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందనే భావించారు. పంజాబీ సంస్కృతిలో ఝప్పీ (కౌగిలింత) లేదా పాయ్‌లాగూ (పాదాలకు నమస్కరించడం) ఈ రెండింటిలో ఏ ఒక్కటి జరిగినా అక్కడ అన్నీ సర్దుకుపోయాయనే అనుకుంటారు. సరిగ్గా ఇక్కడే అందరూ బోల్తాకొట్టారు. తనను పీసీసీ అధ్యక్షుడిగా చేయకముందు వరకు ఘాటుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టిన సిద్ధూ- ఆ తరవాతా అదే తీరు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించాలంటూ నేరుగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పదవులు తనకు కొత్త కాదని, గతంలో చాలా పదవులను వదిలేశానని అన్నారు. రైతులు నిరసన వ్యక్తంచేస్తూ రోడ్ల మీద కూర్చున్నారని, వాళ్ల బాధలు తీర్చాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి పదవి కోసం..!
సిద్ధూ మాటల వెనక అసలు ఆంతర్యం వేరు. ఆ రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. అందులో తన వర్గం ఎమ్మెల్యేలకు మంచి పదవులు ఇప్పించుకోవడం, వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన అనుయాయులకు పెద్దయెత్తున టికెట్లు ఇప్పించుకోవడం, తద్వారా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం 'పాజీ' ముందున్న లక్ష్యాలు. నిజానికి పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రస్థాయి వ్యతిరేకత ఉంది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, రైతుల సమస్యలు, నిరుద్యోగం... ఇలా అనేక అంశాల్లో పార్టీ మీద ప్రజలు గుర్రుగా ఉన్నారు. తప్పు మొత్తాన్ని ముఖ్యమంత్రి మీదకు నెట్టేయడం, తాను వస్తే వీటన్నింటినీ పరిష్కరిస్తానని చెప్పడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలని సిద్ధూ భావిస్తున్నారు. ఆయనతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమితులైనవారు సైతం సిద్ధూనే వెనకేసుకొస్తూ, ఆయన్ను ‘బబ్బర్‌షేర్’గా అభివర్ణిస్తున్నారు.
అనేక యుద్ధాల్లో పాల్గొని, రాజకీయ రణరంగంలోనూ ఇప్పటివరకు ఎదురీదుతూ వస్తున్న కెప్టెన్ అమరీందర్ సింగ్- ఇంకా తనను తాను పాటియాలా మహారాజుగానే భావించడం ఆయనకున్న అతిపెద్ద లోపం. ఇటీవల కాంగ్రెస్‌పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి మంత్రివర్గ కూర్పులో సమతూకం ఉంటే బాగుంటుందని చెప్పుకొచ్చారు. అంటే, సహజంగానే తన వర్గానికి పెద్దపీట వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ముందరికాళ్లకు బందం వేయడం. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ రాజకీయాల్లో తనకున్న పట్టు ఏమిటో సిద్ధూ ఇప్పటికే నిరూపించుకున్నారు. తనకు బహిరంగంగా క్షమాపణలు చెబితే తప్ప, అసలు పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూను అంగీకరించేది లేదని బీరాలు పలికిన కెప్టెన్... చివరకు అదేమీ లేకుండానే ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సి వచ్చింది.