సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పంజాబ్, హరియాణాల్లో వరి పంట వ్యర్థాల దహనం (Stubble Burning) పెద్దయెత్తున సాగుతోంది. ఫలితంగా వాయు కాలుష్యం తీవ్రమై దేశ రాజధాని దిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయడం సహా పంట వ్యర్థాలను (Stubble Burning in Punjab) ఇటు రైతులకు, అటు పరిశ్రమలకు ఆర్థిక వనరులుగా మలచేందుకు పంజాబ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పంట వ్యర్థాలను ఇంధనంగా వాడుకునేలా బాయిలర్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీలకు అనుమతులు ఇవ్వడం సహా, అందుకోసం ఆర్థిక ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది.
పంచదార, కాగితపు పరిశ్రమలతో పాటు గంటకు 25 టన్నులకు పైగా దహన సామర్థ్యం కలిగిన బాయిలర్లను ఏర్పాటు చేయగల కంపెనీలకు ఇందులో స్థానం కల్పించింది. నూతన, ఇప్పటికే పనిచేస్తున్న డిస్టిలరీలు, బ్రూవరీలు పాత బాయిలర్ల స్థానంలో కొత్త వాటిని నిర్మించుకోవాలని, లేదా కొత్త వాటిని విస్తరించి పంట వ్యర్థాలను ఇంధనంగా ఉపయోగించాలని ప్రతిపాదించింది. బాయిలర్ల ఏర్పాటుకు తొలుత ముందుకొచ్చే 50 కంపెనీలకు రూ.25 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. పంట వ్యర్థాలను నిల్వ చేసుకునేందుకు 33 ఏళ్ల ఒప్పందంతో భూములు అద్దెకివ్వాలని తీర్మానించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సైతం వాటి వినియోగాన్ని పెంచేలా కేంద్రాన్ని అభ్యర్థించాలని భావిస్తోంది.
అదే మేలని భావించి..
పంజాబ్‌లో దాదాపు 76 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. వరికోత యంత్రాలతో వడ్లను సేకరించిన తరవాత పంట వ్యర్థాలు అలాగే పొలంలో మిగిలిపోతాయి. అవి రాష్ట్రం మొత్తం మీద దాదాపు రెండు కోట్ల టన్నుల వరకు పోగుపడవచ్చని అంచనా. రబీ పంటకు భూమిని సిద్ధం చేసేందుకు రైతులు ఈ వ్యర్థాలను (Stubble Burning in Punjab) పొలాల్లోనే తగలబెడుతుండటం వల్ల వాయు కాలుష్యం అధికమవుతోంది. సాధారణంగా పంజాబ్, హరియాణాల్లో వరి కోతలు సెప్టెంబరు ద్వితీయార్ధం నుంచి అక్టోబరు మాసాంతం వరకు కొనసాగుతాయి. ఆ తరవాత నవంబరు మొదటి వారం నుంచి నెలన్నర పాటు గోధుమను విత్తుతారు. దీనికి మూడు వారాల సమయమే ఉండటం వల్ల వరి పంట వ్యర్థాలను కాల్చేయడమే చవకైన, మేలైన మార్గంగా అన్నదాతలు భావిస్తున్నారు.
పదివేల మంది అధికారులు గస్తీ..
కాలుష్య నిరోధ, నియంత్రణ చట్టం-1981 ప్రకారం పంట వ్యర్థాలను తగలబెట్టకూడదు. 2013లో జాతీయ హరిత ట్రైబ్యునల్ సైతం దీన్ని నిషేధించింది. కాదని ఎవరైనా దహనానికి దిగితే పర్యావరణ నష్టపరిహారం కింద రూ.2,500 నుంచి రూ.15,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయినా రైతులు గుట్టుచప్పుడు కాకుండా వ్యర్థాలను తగలబెడుతూనే ఉన్నారు. 2019లో పంజాబ్‌లో ఇలాంటివి 52,991 ఘటనలు చోటుచేసుకోగా, 2020 నాటికి అవి 76,599కు చేరాయి. 2018లో 51,766 ఘటనలు వెలుగుచూశాయి. వీటిని నిరోధించేందుకు పదివేల మంది అధికారులు గస్తీ కాస్తుంటారు.