భారత్, చైనా మధ్య అత్యున్నత స్థాయి సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిగిన తర్వాత సరిహద్దులో సైనిక బలగాల ఉపసంహరణ జరిగింది. ఎదురెదురుగా ఉన్న ఇరుదేశాల సైనికులు స్వల్పంగా వెనక్కి తగ్గారు. ఘర్షణాత్మక ప్రాంతాలైన గల్వాన్ లోయ(పెట్రోల్ పాయింట్-14), పాంగొంగ్ సరస్సు(ఫింగర్ 4), హాట్ స్ప్రింగ్స్(పెట్రోల్ పాయింట్-15) గోగ్రా(పీపీ 17)ల నుంచి సైన్యాన్ని ఇరుదేశాలు రెండు కిలోమీటర్లు వెనక్కి తరలించాయి.
అయితే దీని అర్థం ఉద్రిక్తతలు సమసిపోయినట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. వీటిని 'టోకెన్ మూమెంట్లు'గా పరిగణిస్తారని తెలిపారు. సైన్యాల మధ్య దూరం పెంచేందుకు ఇలా చేస్తారని వివరించారు.
"ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గించడానికి చాలా సమయం పడుతుంది. రెండు వైపులా సైనికులు ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి హింసాత్మక ఘటనలను నివారించడానికి పరస్పర అంగీకారం ప్రకారం ఉపసంహరణలు జరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్-చైనా సైన్యాలు తమ బలగాలను వెనక్కి తీసుకోవాలి. ఇరుపక్షాలు నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. ఇదే ఇప్పుడు ప్రధాన ఉద్దేశం."
-సంబంధిత వర్గాలు
రెండు దేశాలకు చెందిన లక్ష మందికిపైగా సైన్యం వాస్తవాధీన రేఖ సమీపంలో మోహరించి ఉన్నాయి. వెనువెంటనే సరిహద్దుకు చేరుకునే విధంగా భారీ ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో సిద్ధంగా ఉన్నాయి. సైన్యం, వాయుసేన అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్ నాటి యథాతథ స్థితిని పునరుద్ధరించడం సాధ్యం కాదని ఇరుదేశ సైన్యాలకు తెలుసు.
దీంతోపాటు భారీగా సైన్యాన్ని సమీకరించుకోవడానికి ఇరుదేశాలు చాలా ప్రయత్నాలు చేశాయి. పరిస్థితులకు అలవాటుపడి, పెద్ద ఎత్తున బలగాలను- ఆయుధాలను తరలించి, సులభంగా నాశనం చేసే వీలులేని రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి.