తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బర్డ్​ ఫ్లూ విసిరిన ఆ రెండు సవాళ్లు - భారత్ లో బర్డ్​ ఫ్లూ నష్టం

దేశంలో కరోనా మహమ్మారిని పారదోలే సన్నాహాలు జరుగుతున్న వేళ.. బర్డ్​ ఫ్లూ వ్యాప్తి సరికోత్త సవాళ్లకు తెరలేపింది. ఈ వైరస్​ను అరికట్టే చర్యల్లో భాగంగా కోళ్లను కడతేర్చడానికి పలు రాష్ట్రాలు యుద్ధ ప్రాతిపదికన కదులుతున్నాయి. విస్తృత జన జాగృతి కార్యక్రమాలతో జనారోగ్యంతో పాటు పౌల్ట్రీరంగం నష్టాలు కనిష్ఠ స్థాయికి పరిమితమయ్యే చొరవ కనబరచాల్సిన అవసరం ఉంది.

Public health and poultry sector should be protected from bird flu with awareness programs
బర్డ్​ విసిరిన ఆ రెండు సవాళ్లు

By

Published : Jan 13, 2021, 7:10 AM IST

పులిమీద పుట్ర అంటే- ఇదే. ప్రాణాంతక కొవిడ్‌ మహమ్మారిపై నిర్ణయాత్మక పోరుకు శక్తియుక్తులు కూడదీసుకొంటున్న దశలో, దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ రెక్క విచ్చుకోవడం తీవ్రాందోళనకరమే! వలస పక్షులు మోసుకొచ్చే బర్డ్‌ఫ్లూ వైరస్‌ కారణంగా తొలుత రాజస్థాన్‌లో కాకులు, గద్దలు మృత్యువాతపడగా- వాటి కళేబరాల్లో ఎవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా ఆనవాళ్లను భోపాల్‌లోని జంతు వ్యాధుల జాతీయ సంస్థ డిసెంబరు 31న ధ్రువీకరించింది. దరిమిలా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌, గుజరాత్‌లోని జునాగఢ్‌లాంటి చోట్ల పొడగట్టిన బర్డ్‌ఫ్లూ అచిరకాలంలోనే దిలీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్‌ ప్రదేశ్‌, హరియాణాల్నీ చుట్టబెట్టేసింది.

ఎక్కడైనా వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే కిలోమీటరు విస్తీర్ణంలో కోళ్లు, బాతుల వంటివాటిని కడతేర్చి శాస్త్రీయంగా పూడ్చిపెట్టడం ద్వారా వైరస్‌ విస్తరణను అడ్డుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ యుద్ధ ప్రాతిపదికన కదులుతున్నాయి. బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లు లేని రాష్ట్రాలు కూడా సదా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీయే ముఖ్యమంత్రులందరికీ నొక్కిచెప్పారు. 2006-’18 మధ్యకాలంలో ఎవియన్‌ ఫ్లూ కారణంగా దాదాపు 83 లక్షల కోళ్లను వధించాల్సి వచ్చిన సంగతి విస్మరించకూడదు. ఇదే వ్యూహాన్ని పటిష్ఠంగా అమలుపరుస్తున్న యంత్రాంగాలు విస్తృత జన జాగృతి కార్యక్రమాలతో పౌల్ట్రీరంగం నష్టాలు కనిష్ఠస్థాయికి పరిమితమయ్యే చొరవ కనబరచాలిప్పుడు! కొవిడ్‌ దెబ్బకు ఉత్పాదక సేవా రంగాలు రెండూ పడకేసినా, వ్యవసాయమే ధీమాగా పురోగమించింది. అన్నదాతకు ఆర్థికదన్నుగా నిలిచే కోళ్లు, బాతుల వంటివి దేశవ్యాప్తంగా దాదాపు 73 కోట్లు ఉంటాయని వ్యవసాయ మంత్రిత్వశాఖ అంచనా వేసింది. మహమ్మారి వైరస్‌నుంచి వాటిని, పౌల్ట్రీ పరిశ్రమను కాపాడుకోవడం గ్రామీణ ఆర్థికానికి ప్రాణావసరమని గుర్తించాలి.

దాదాపు 128 వర్గీకరణలతో చెలరేగుతున్న బర్డ్‌ఫ్లూ వైరస్‌ లోగడ పలు దేశాల్ని వణికించింది. మొన్న డిసెంబరు 4-24వ తేదీల మధ్య ఆసియా ఐరోపాల్లోని 14 దేశాల్లో 74 చోట్ల ఎవియన్‌ ఫ్లూ పంజా విసరిందని ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ ఇటీవలే వెల్లడించింది. సాధారణంగా బర్డ్‌ ఫ్లూ వైరస్‌ మనుషులకు వ్యాపించకపోయినా హెచ్‌5ఎన్‌1 రకం ఉత్పరివర్తనం చెంది అంటువ్యాధిగా వెంటాడే ప్రమాదం లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. చనిపోయిన కోళ్లు, పక్షులను చేతి తొడుగుల్లేకుండా ముట్టుకోరాదన్న ముందస్తు జాగ్రత్తలు, అకారణంగా అవి నేల రాలిపోయినప్పుడు వెంటనే అధికార యంత్రాంగానికి తెలియజేయాలన్న సూచనలు అందరికీ అందేలా చూడాలి. ఎవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా నిరోధం, అదుపు లక్ష్యంగా రూపొందిన జాతీయ కార్యాచరణ ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం కోరుతోంది.

2003 లగాయతు ఇప్పటిదాకా 17 దేశాల్లో మొత్తం 862మందికి సోకిన బర్డ్‌ఫ్లూ 455 మందిని బలిగొందని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. కొవిడ్‌ నిరోధక చర్యల మాదిరిగానే బర్డ్‌ ఫ్లూ పైనా ప్రజానీకంలో సదవగాహన పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు రెండు లక్ష్యాల్ని సాధించగల వీలుంది. ఉత్పరివర్తన వైరస్‌లనుంచి జనారోగ్యాన్ని కాచుకోవడం మొదటిది కాగా, రూ.80వేల కోట్ల పైబడిన పౌల్ట్రీ రంగాన్ని కాపాడుకోవడం రెండోది. నిరుడు కొవిడ్‌ వ్యాప్తికి చికెన్‌ కారణమవుతుందన్న అపోహలు ప్రబలడంతో పౌల్ట్రీ రంగం ఏకంగా రూ.7500 కోట్లు నష్టపోయింది. తాము తేరుకోవడానికి మరికొన్ని నెలలు పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్న సమయంలోనే బర్డ్‌ఫ్లూ విరుచుకుపడ్డ నేపథ్యంలో, 70 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పైగా ఉష్ణోగ్రతలో చేసే భారతీయ వంటకాల్లో వైరస్‌ ఉండే ఆస్కారమే లేదన్న స్పృహ వినియోగదారుల్లో పాదుకోవాలి. సురక్షిత మాంసాహారంతో రోగనిరోధక శక్తి పెంచుకొంటూ, సకల జాగ్రత్తలతో బర్డ్‌ఫ్లూను తరిమికొట్టే కార్యాచరణలో జనభాగస్వామ్యమూ కీలకం కానుంది!

ఇదీ చదవండి:ఆ రాష్ట్రంలో అంతుచిక్కని వ్యాధితో చేపలు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details