భారత నౌకాదళంలోని అణుశక్తి జలాంతర్గామి(Submarine) ఐఎన్‌ఎస్ చక్ర-2 లీజు గడువు ఈ ఏడాదితో ముగియనుంది. దానితో అది ఇండియాకు వీడ్కోలు పలికి రష్యాకు తిరుగుముఖం పట్టింది. ఆ చిత్రాలు ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కొన్ని గంటల్లోనే భారత నౌకా దళానికి ఒక తీపి కబురు అందింది. రెండు దశాబ్దాల కిందటే భద్రతా వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఎస్) అనుమతులు లభించిన 'ప్రాజెక్ట్ 75 ఇండియా'కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. దీనికింద ఆరు డీజిల్ విద్యుత్తు జలాంతర్గాములను(Submarine) విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా నిర్మించనున్నారు. ఇవి 'ప్రాజెక్టు 75' కింద నిర్మిస్తున్న స్కార్పియన్ శ్రేణి జలాంతర్గాముల కంటే 50 శాతం పెద్దవిగా ఉండనున్నాయి.
ఈ ప్రాజెక్టు కోసం మాజేగావ్ డాక్‌యార్డ్ లిమిటెడ్, ఎల్‌అండ్‌టీతో పాటు 'వ్యూహాత్మక భాగస్వామి' గా మరో విదేశీ సంస్థ సైతం జత కలవనుంది. అయిదు దేశాల సంస్థలు దీనిపై ఆసక్తి చూపిస్తున్నా- నేవల్ గ్రూప్ (ఫ్రాన్స్), రూబిన్ డిజైన్ బ్యూరో (రష్యా), టీకేఎంఎస్ (జర్మనీ)ల్లో ఒక దానికి కాంట్రాక్టు దక్కవచ్చు. ఈ భారీ ప్రాజెక్టుతో దేశీయంగా జలాంతర్గాముల నిర్మాణానికి అవసరమైన విడిభాగాల తయారీ పరిశ్రమలు పుట్టుకొస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
పదిహేనేళ్లలో రెండే..
భారత్ విమాన వాహక నౌకల సంఖ్యను పెంచుకోవాలనే వాదనలు ఉన్నా- ప్రభుత్వం తొలుత జలాంతర్గాములను(Submarine) సమకూర్చుకోవడానికే మొగ్గు చూపింది. ఆధునిక యుద్ధవ్యూహాల్లో ఆయుధాలను వీలైనంత రహస్యంగా ఉంచడం కీలకం. 'సముద్ర ఉపరితలంపై ఉండే వాటిని శత్రువులు ఉపగ్రహాలతో గుర్తించి క్షిపణులతో ధ్వంసం చేస్తారు. నౌకాదళానికి విమాన వాహక నౌకల కంటే జలాంతర్గాములే అవసరం అనుకుంటున్నా'నని సీడీఎస్ బిపిన్ రావత్ నిరుడు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి విమాన వాహక నౌకలు అత్యంత ఖరీదైనవి. వీటి వెంట సహాయక నౌకల బృందమూ కదలాల్సిందే. వీటిలో పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు, రాడార్లు, క్షిపణులు ఉంటాయి. శత్రువులు వీటిపై దాడి చేస్తే వేల కోట్ల రూపాయల నష్టంతో పాటు దేశ నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. డీఎఫ్21ఏ వంటి నౌకా విధ్వంసక బాలిస్టిక్ క్షిపణులను చైనా భారీగా సమకూర్చుకొంది. వీటితో భారత నౌకలకు ముప్పు పొంచి ఉంది.
మరోవైపు, విశాల సంద్రంలో నీటి అడుగున నిశ్శబ్దంగా ప్రయాణించే జలాంతర్గాములను గుర్తించడం చాలా కష్టం. ఆధునిక పరిజ్ఞానం ఉన్న అమెరికా సైతం వీటి జాడను పసిగట్టడంలో కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటుంది. 2005లో జరిగిన యుద్ధ విన్యాసాల్లో స్వీడిష్ డీజిల్ జలాంతర్గామి గాట్‌లాండ్ పలుమార్లు అమెరికా విమాన వాహక నౌక రోనాల్డ్ రీగన్‌పై గురిపెట్టగలిగింది!