తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఇంటి వద్దకే వైద్యం- కొవిడ్‌ వేళ ఆపన్నహస్తం

కరోనా విపత్కర పరిస్థితుల్లో టెలీమెడిసిన్​కి ప్రాధాన్యం పెరిగింది. ఇది పట్టణాల నుంచి మారుమూల ప్రాంతాల ప్రజలకూ అందుబాటులోకి వచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. టెలీమెడిసిన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సా విధానం తదితర అంశాలపై విధానపరంగా మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

By

Published : Jul 5, 2021, 7:21 AM IST

telemedicine
టెలీమెడిసిన్

కొవిడ్‌ విజృంభించిన వేళ- వైద్యులు సైతం నేరుగా వైరస్‌ సోకిన వారిని పరీక్షించి, ఔషధాలు ఇవ్వలేని గడ్డు పరిస్థితుల్లో టెలీమెడిసిన్‌ అపర సంజీవనిలా మారింది. ఇప్పుడు వైద్యరంగంలో టెలీవైద్యం ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎలాంటి వైద్య సౌకర్యాలూ అందుబాటులో లేని మారుమూల ప్రజలకు అడపాదడపా ఉపకరించే ఈ విధానం- కరోనా సంక్షోభంతో పల్లెలు పట్టణాలనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రాణాలు కాపాడే బృహత్తరమైన మార్గమయింది. వైద్యులను టెలిఫోన్‌, ఈ-మెయిల్‌, వీడియోకాల్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదించడమే టెలీవైద్య విధానం. నిరుడు మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాక- కరోనా వైరస్‌ గొలుసును తెంచాలనే లక్ష్యంతో భారతీయ వైద్య మండలి టెలీ వైద్యంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామాల్లో అట్టడుగు స్థాయిలో పనిచేసే రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌(ఆర్‌ఎంపీ)లు సైతం టెలీమెడిసిన్‌ విధానంలో రోగులను పరీక్షించి ఔషధాలు ఇచ్చేందుకు వెసులుబాటును కల్పించిన దరిమిలా టెలీవైద్యం ప్రజలకు మరింత చేరువైంది.

బీజం వేసిన ఇస్రో

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2019లో 'ఇ-సంజీవని' పేరుతో టెలీమెడిసిన్‌ను ప్రవేశపెట్టి లక్షా 55 వేల ఆరోగ్య, శ్రేయస్సు కేంద్రాల ద్వారా ప్రజల ముంగిటికి వైద్యాన్ని తెచ్చే ప్రయత్నం చేసింది. ఇది ప్రవేశపెట్టాక కొద్ది నెలలకే కొవిడ్‌ వ్యాప్తి వేగవంతం కావడంతో ఏకాంతవాసంలో ఉన్న వైరస్‌ బాధితులే కాకుండా, ఇతరత్రా అనారోగ్య లక్షణాలున్నవారు సైతం వైద్యులను మొబైల్‌ ఫోన్ల ద్వారా సంప్రదించి తగిన ఔషధాలను తీసుకొని స్వస్థత పొందారు. దేశంలో ఇప్పటివరకు సింహ భాగం రోగులకు టెలీవైద్యమే పెద్ద దిక్కయింది. ఈ విపత్కర పరిస్థితుల్లో టెలీ మెడిసిన్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం దృష్ట్యా ఇది పట్టణాల నుంచి మారుమూల ప్రాంతాల ప్రజలకూ అందుబాటులోకి వచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. టెలీమెడిసిన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స విధానం తదితర అంశాలపై విధానపరంగా మార్గదర్శకాలను రూపొందించాలి. ప్రభుత్వ ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల నుంచి మొదలుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు ఈ తరహా వైద్యాన్ని మరింత అందుబాటులోకి తేవడం ఎంతో ముఖ్యం. పాశ్చాత్య దేశాల్లో టెలీవైద్యానికి 20వ శతాబ్దం మధ్య నుంచే ఆదరణ పెరిగింది. దేశీయంగా ఈ విధానానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాంకేతిక సొబగులు అద్దింది. 130 కోట్లకుపైగా జనాభాగల భారతదేశంలో 75శాతం వైద్యులు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుంటే, 68శాతానికిపైగా ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న క్రమంలో గ్రామీణ భారతావనికి వైద్యం అందని ద్రాక్షగానే మారుతోందన్నది నిష్ఠుర సత్యం. అందుకే 'ఇస్రో' మన దేశంలో 2001లో టెలీ వైద్యానికి బీజం వేసింది. ఉపగ్రహ సాంకేతికతను వినియోగించి రెండు దశాబ్దాల క్రితం చెన్నైలోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రి వైద్య సేవలను ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని మారుమూల గ్రామ ప్రజలకు చేరువ చేసింది. 15 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులతో గ్రామీణ ప్రాంతాల్లోని 45 ఆసుపత్రులను అనుసంధానించడం టెలీవైద్యంలో గొప్ప ముందడుగు. దరిమిలా దేశవ్యాప్తంగా అనేక మారుమూల ప్రాంతాలకు టెలీవైద్యాన్ని అందించే బృహత్తర యజ్ఞాన్ని భుజానికెత్తుకొని ముందుకు సాగుతోంది ఇస్రో.

జాగ్రత్తలు అవసరం

భారత్‌లో 1,511 మంది ప్రజలకు ఒక వైద్యుడు మాత్రమే అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో కొవిడ్‌ విజృంభణ తరవాత వైద్యుల అవసరం మరింతగా పెరిగింది. ఈ తరుణంలో టెలీవైద్యం వల్ల రోగులకు వ్యయ ప్రయాసలు తగ్గడం, వైద్యుల సమయం ఆదా కావడం లాంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే టెలీవైద్యం గతంలో వికటించిన దాఖలాలూ లేకపోలేదు. 2018లో బాంబే ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పే ఇందుకు తార్కాణం. ఓ బాలింత ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఆసుపత్రికి వచ్చినప్పుడు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు- ఫోన్లో డాక్టర్లను సంప్రదించి చికిత్స చేశారు. అనంతరం వైద్యం వికటించి మహిళ మృతి చెందారు. ఆ కేసులో కోర్టు వైద్యులను తప్పుపట్టింది. రోగ నిర్ధారణ సరిగ్గా చేయకుండా నిర్లక్ష్యంగా టెలిఫోన్‌ ద్వారా మందులు సూచించడంవల్లే నిండు ప్రాణం బలైందని వైద్యులకు ముందస్తు జామీనునూ నిరాకరించింది. టెలీవైద్యంలో ఇలాంటి దుర్ఘటనలు అడపాదడపా జరుగుతున్న దృష్ట్యా మార్గదర్శకాలు మరింత పకడ్బందీగా ఉండాలి. రోగ నిర్ధారణ సరిగ్గా జరిగిన తరవాతే వైద్యులు ఔషధాలు ఇవ్వాలి. ఇందులో రికార్డుల నిర్వహణ, ఆసుపత్రుల్లో సరైన శిక్షణ లాంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే టెలీవైద్యంపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. సరైన ఫలితాలూ సమకూరతాయి.

- గుండు పాండురంగశర్మ

ఇవీ చదవండి:'వ్యాక్సిన్​ తీసుకుంటే వారికి మరింత రక్షణ'

'బ్లాక్​ఫంగస్​తో అంత మందిలో అంధత్వం'

ABOUT THE AUTHOR

...view details