దేశంలో నదీ పరీవాహక ప్రాంతాలు, సముద్ర తీరాల్లో అడ్డగోలుగా సాగుతున్న ఇసుక తవ్వకాలు- పర్యావరణ వ్యవస్థకు, జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్న తవ్వకాలను నియంత్రించడం, విపరీతంగా పెరుగుతున్న డిమాండుకు తగినట్లుగా ఇసుకను సమకూర్చడం ప్రభుత్వ వ్యవస్థలకు కత్తిమీద సాములా మారింది.
ఏపీ ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో ఇసుక తవ్వకాలు, తరలింపు, విక్రయాల కోసం ఒక ప్రత్యేక విధానాన్ని అమలులోకి తెచ్చింది. అది ప్రభుత్వ వర్గాలకు, కొనుగోలుదారులకు సంతృప్తి కలిగించకపోవడం వల్ల మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇసుక రేవుల్లో తవ్వకాల ప్రక్రియ చేపట్టేందుకు జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థతోపాటు పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాయడం గమనార్హం.
మరోపక్క వివిధ రాష్ట్రాల్లో సాగుతున్న ఇసుక తవ్వకాలను తరచూ న్యాయస్థానాలు ఆక్షేపించడం చర్చనీయాంశంగా మారింది. ప్రైవేటు లీజుదార్ల అజమాయిషీలో తవ్వకాలు జరిగే రాష్ట్రాల్లో మార్గదర్శకాలు అమలు కావడం లేదని, ఇసుక మాఫియా రాజ్యమేలుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
ఎన్నో వ్యవస్థలకు హాని
దేశంలో గత ఏడు దశాబ్దాలలో కాంక్రీటు నిర్మాణాల కారణంగా ఇసుక వినియోగం పెరిగింది. నదులు, జలాశయాలు, సముద్ర తీర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. నదులు, జలాశయాల ప్రాంతాల్లో లభించే ఇసుకను భవన నిర్మాణాల్లో వినియోగిస్తుండగా- సముద్ర తీరాల్లో వెలికితీసే ఇసుకలో జిర్కోనియం, టైటానియం, థోరియం వంటి పరిశ్రమల్లో వినియోగించే విలువైన ఖనిజ వనరులు ఉంటాయి.
ఇసుకలో లభించే సిలికాను గ్లాసు తయారీలో వాడతారు. పెరుగుతున్న అవసరాలకు తగినట్లుగా ప్రత్యామ్నాయ పర్యావరణ హితకరమైన నిర్మాణాలపై అవగాహన పెరగడంలేదు. ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా ఇసుకకు ప్రత్యామ్నాయ వనరుల వినియోగంపై ప్రభుత్వ వ్యవస్థలు ఆశించిన స్థాయిలో దృష్టి సారించడం లేదు. దీంతో ఇసుక వనరులపై విపరీతంగా ఒత్తిడి పెరుగుతోంది.
దశాబ్దాల తరబడి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చిన్న, మధ్య స్థాయి నదీ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా సాగాయి. మితిమీరి సాగించే ప్రకృతి వనరుల వెలికితీత పర్యావరణ వ్యవస్థలకు, జీవవైవిధ్యానికి అంతులేని నష్టం చేకూరుస్తుంది. ఇసుక వంటి సహజ వనరుల తవ్వకాల్లో సుస్థిర పద్ధతిలో పొదుపు పాటించకపోతే దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది- పశ్చిమ, తూర్పు కనుమల్లో కొన్నేళ్లుగా తలెత్తిన వరదలు కలిగించిన నష్టంతో తెలుసుకోవచ్చు.
వరదల వేళ జనావాసాలపై జలం విరుచుకుపడటానికి ప్రధాన కారణం- ఇసుక విచ్చలవిడి తవ్వకాల మూలంగా నదుల ప్రవాహ స్థితిగతులు మారిపోవడమేనని అనేక అధ్యయనాలు తేల్చి చెప్పాయి. కొన్ని ప్రాంతాల్లో అడుగడుగునా పాతుకుపోయిన అవినీతి, అక్రమాలు, రాజకీయ ప్రాబల్యం... ఇసుక విచ్చలవిడి తవ్వకాలకు ఊతమిస్తున్నాయి. సముద్ర ప్రాంతాల్లో సాగే ఇసుక తవ్వకాల వల్ల ఆలివ్ రిడ్లె తాబేళ్లు వంటి అరుదైన జీవులు, పగడపు దిబ్బలు, సున్నితమైన తీర వ్యవస్థల మనుగడ ప్రమాదంలో పడింది. సుందరమైన పర్యాటక ప్రాంతాల రూపురేఖలు మారిపోయి ఆదాయం కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి.
హరిత మార్గదర్శకాలతో నష్టం భర్తీ