మొక్కవోని సంకల్ప దీక్షకు అవిరళ త్యాగాలు జతపడి తెలుగువాడి హక్కుగా విశాఖ ఉక్కుకు శంకుస్థాపన జరిగి అయిదు దశాబ్దాలైంది. అనేక అవరోధాల్ని అధిగమించి ఉత్పత్తి ప్రారంభించిన ఉక్కు కర్మాగారాన్ని 1992లో ప్రధానిగా పీవీ జాతికి అంకితం చేయగా- దాన్ని నేడు నూరుశాతం ప్రైవేటీకరించాలన్న నిర్ణయమే ఏమాత్రం మింగుడు పడనిది. 'నవరత్న' సంస్థగా రాజిల్లుతూ 2002-15 నడుమ లాభాల బాటలో నడిచి ఇప్పటిదాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ రూపాల్లో రూ.42 వేల కోట్లు సముపార్జించి పెట్టిన ఘనత విశాఖ ఉక్కుది.
రెండు మూడేళ్లుగా వస్తున్న నష్టాలకు కారణాలేమిటన్నది ముంజేతి కంకణమే అయినా, ఆ వంకన సాగించే ప్రైవేటీకరణ విశాల జాతి హితానికే శరాఘాతమవుతుంది. ఆనాడు 'ప్రజాప్రయోజనం' పేరిట భూసేకరణ చట్టం కింద వివిధ దశల్లో రైతులకు తృణమో పణమో చెల్లించి (చివరి దశలో గరిష్ఠ చెల్లింపు ఎకరా రూ.20 వేలు) సేకరించిన మొత్తం 22 వేల ఎకరా పైచిలుకు. నేడు ఏకరా రూ. 5 కోట్లు దాటిన నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం విలువ దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఉంటుందంటున్నారు! ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికిపైగా ఉపాధి కల్పిస్తున్న మహా సంస్థ- మూడు తరాలు దాటినా తొలినాటి నిర్వాసితులకు ఇచ్చిన హామీల్ని నేటికీ పూర్తిగా నెరవేర్చనే లేదు! ఏ ఉక్కు పరిశ్రమ అయినా స్వయంసమృద్ధం కావాలంటే ఖనిజ క్షేత్రాన్ని కలిగి ఉండటం తప్పనిసరి. ఖమ్మం జిల్లా బయ్యారం గనుల్ని విశాఖ కర్మాగారానికి ఇచ్చేందుకు సుముఖమంటూ 2013లోనే ఉక్కుశాఖ సంసిద్ధత వ్యక్తం చేసినా- ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.
టన్నుకు రూ.5200పైగా వెచ్చించి ఇనుప ఖనిజాన్ని మార్కెట్ ధరకు కొనడం వల్ల వస్తున్న నష్టాలకు కేంద్ర ప్రభుత్వమే జవాబుదారీ! రాయితీలతో ఖనిజ క్షేత్రాలను రాసివ్వకపోతే రేపు వచ్చే ఏ ప్రైవేటు సంస్థదైనా ఇదే నష్టజాతకం. 2017 నాటి జాతీయ ఉక్కు విధాన లక్ష్యాలు సాధించాలంటే, ప్రైవేటీకరణ కట్టిపెట్టి విశాఖ ఉక్కుకు వెన్నుదన్నుగా నిలవడమే శ్రేయస్కరం!