ప్రధానమంత్రి జనారోగ్య యోజన లేదా ఆయుష్మాన్ భారత్ పథకం 10.74 కోట్ల పేద కుటుంబాలకు ఆస్పత్రి ఖర్చులు భరించడానికి ఉద్దేశించినది. వారికి ఈ పథకం కింద అయిదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా లభిస్తుంది. మొత్తం 1,393 రకాల చికిత్సలూ అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రాలు పథకం కిందకు అదనపు చికిత్సలను తీసుకురాదలిస్తే నిరభ్యంతరంగా ఆ పని చేయవచ్చు. ఆయుష్మాన్ భారత్ కింద కొవిడ్ చికిత్సనూ పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం మార్చిలో ప్రకటించి, ఈ ప్యాకేజీని అమలు చేసే అధికారాన్ని రాష్ట్రాలకు వదలివేసింది. కానీ, రాష్ట్రాలు ఈ విషయంలో స్పష్టమైన విధానాన్ని రూపొందించకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్ రోగులను చేర్చుకోవడానికి, చికిత్స చేయడానికి సుముఖత చూపడం లేదు. గ్రామాల్లో 72శాతం, పట్టణాల్లో 79శాతం ప్రజలు చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రుల మీదే ఆధారపడుతున్నా కొవిడ్ విషయంలో స్పష్టత లోపించడం సరి కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్మాన్ భారత్ పథకం కింద కొవిడ్ చికిత్స మార్గదర్శకాలను లేదా ప్యాకేజీని రూపొందిస్తే, ప్రైవేటు ఆస్పత్రులు చికిత్స చేయడానికి ముందుకొస్తాయి. కొవిడ్ చికిత్స ఖర్చుకు రాష్ట్రాలు పరిమితి ఏదైనా నిర్ణయిస్తే ప్రైవేటు రంగానికి స్పష్టత వస్తుంది. అసలు ఈ చికిత్స ఖర్చును ఏ ప్యాకేజీ కింద క్లెయిమ్ చేయాలో ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలకు అర్థం కావడం లేదు. అందుకే కొన్ని ఆస్పత్రులు కొవిడ్ రోగులను శ్వాసకోశ సమస్యలు లేదా వైఫల్యం కింద వర్గీకరించి చికిత్స చేస్తున్నాయి.
ఖర్చు ఎంతో?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స ఉచితంగా చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు ఉచిత చికిత్స అందించవు కాబట్టి, ఖర్చును ఎలా రాబట్టుకోవాలో తెలియక కొవిడ్ చికిత్సకు ఆసక్తి చూపడం లేదు. రోగులకూ చికిత్స ఖర్చు ఎంతో సరైన అంచనా లేదు. ఆయుష్మాన్ భారత్ కింద ఎంత క్లెయిమ్ చేయవచ్చో రోగులకూ తెలియదు, ఆస్పత్రులకూ తెలియదు. ఆయుష్మాన్ భారత్ లో ఇప్పటికైనా కొవిడ్ చికిత్స ప్యాకేజీని నిర్ధారిస్తే పేద రోగులకు వెసులుబాటుగా ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ లేదా ప్రధానమంత్రి జనారోగ్య యోజన కింద వెంటిలేటర్ చికిత్స ఖర్చును రూ.4,500గా నిర్ణయించారు. కొవిడ్ చికిత్స చేసేటపుడు వ్యక్తిగత రక్షణ సూట్లు, మాస్కులు ధరించడంతోపాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి చివరకు ఖర్చు రూ.7,000 నుంచి రూ.8,000 వరకు అవుతుంది.
కరోనా సంక్షోభం వల్ల విధించిన రెండు నెలల లాక్‌డౌన్ కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ ప్యాకేజీకి తుదిరూపమివ్వలేదు. జాతీయ ఆరోగ్య సంరక్షణ సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) నుంచి ప్యాకేజీలకు అనుమతి తీసుకొనే ప్రక్రియను ఇంకా పూర్తిచేయలేదు. కొవిడ్‌కు నాణ్యమైన చికిత్స సరసమైన ధరకే లభించేట్లు చూడాలని ఎన్‌హెచ్‌ఏ ప్రయత్నిస్తోంది. కొవిడ్‌ను కనిపెట్టే ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష ఖర్చును రూ.4,500గా భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నిర్ణయించగా, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అంతకన్నా తక్కువ ధరకే ఎన్‌హెచ్‌ఏ సమ్మతి పొందాయి. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు బాధ్యత ఎన్‌హెచ్‌ఏదే. కొవిడ్ చికిత్స ఖర్చుల నిర్ధారణకు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చలు జరపాలని రాష్ట్రాలకు సూచించామని ఆయుష్మాన్ భారత్ పథకం ప్రధాన కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఇందు భూషణ్ చెప్పారు.