పాల ప్రగతి పొంగుపై కరోనా నీళ్లు చిమ్మింది. దేశవ్యాప్తంగా పాడి పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. పాల విక్రయ ధరలు పతనమై పాడి రైతులు నష్టాలపాలవుతున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లో సైతం పాల సరఫరాకు ఇబ్బందులెదురైనా ఇండియాలో రైతుల సహకారంతో సహకార పాల సంఘాలు నిర్విఘ్నంగా 130 కోట్లమందికి నిత్యం పాలను విక్రయించాయి. కానీ, కనీస ఖర్చులైనా తిరిగి రాకపోతే పశువులను పోషించేదెలా అని మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో రోడ్లపై పాలు పారబోస్తూ రైతులు నిరసనలు తెలుపుతున్నారు. నాలుగు నెలలుగా దేశంలో పర్యాటక, హోటళ్లు, వాణిజ్యం మూతపడి కుదేలవడంతో పాడిపరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. పాల అమ్మకాల్లో 40శాతం వరకు వాణిజ్య కొనుగోళ్లే ఉంటాయి.
సహకారం శూన్యం
పాడి పరిశ్రమపై ప్రభుత్వ నియంత్రణలేమీ లేవు. ఎవరైనా స్వేచ్ఛగా డెయిరీలు పెట్టుకుని రైతుల నుంచి పాలు కొని ప్రజలకు విక్రయించవచ్ఛు దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో 1.90 లక్షల గ్రామాల సహకార సంఘాలకు చెందిన 1.69 కోట్ల మంది రైతులున్నారని ‘జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి మండలి’(ఎన్డీడీబీ) తాజా నివేదికలో స్పష్టీకరించింది. సహకార డెయిరీలకు నిత్యం విక్రయించే 5.10కోట్ల లీటర్ల పాలు పరిశ్రమకు ఆయువుపట్టు. గుజరాత్‌లోని అమూల్, కర్ణాటకలోని నందిని పాల సహకార సంఘాల సమాఖ్య(డెయిరీ)లు వరసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఎన్డీడీబీ లెక్కల ప్రకారం ఏడేళ్ల(2012-19) వ్యవధిలో పాల టోకుధర 107.60 నుంచి 143.10 పాయింట్లకు(33 శాతం) పెరిగింది. ఇదే కాలవ్యవధిలో పాడి రైతుల ఆదాయంలో అంతే వృద్ధిలేదు. వర్షాకాలం, శీతకాలంలో పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు పాల కొనుగోలు ధరను ప్రైవేటు డెయిరీలు ఇష్టారీతిగా తగ్గించేస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో నెలరోజుల్లో కొనుగోలు ధరను 40శాతం వరకూ తగ్గించారని రైతులు భగ్గుమంటున్నారు.
వాటా ఉన్నా... ప్రోత్సాహమేదీ?
స్థూల జాతీయోత్పత్తి విలువ(జీవీఏ)లో వ్యవసాయం దాని అనుబంధ రంగాల విలువ రూ.26.70 లక్షల కోట్లుంటే, పాడిపరిశ్రమ వాటా 28.38 శాతం. కానీ పంటల సాగుకు ఇస్తున్నంత ప్రోత్సాహం, రాయితీలు పాడి రైతులకు ప్రభుత్వం నుంచి దక్కడం లేదు. పూర్తిగా డెయిరీల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి వీరు బతకాల్సిన దుస్థితి నెలకొంది. పశుగ్రాసం, దాణా ధరలు పెరుగుతున్నా రైతులకిచ్చే పాలధర పెంచడం లేదని ఎన్డీడీబీ పరిశీలనలో తేలింది. ఉదాహరణకు 2017-18తో పోలిస్తే 2018-19లో తవుడు, దాణాధర జాతీయ సగటులో ఏడుశాతం పెరిగినా డెయిరీలు పెంచలేదని తేలింది. ప్రపంచవ్యాప్తంగా 2018లో 84.32 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తవగా అందులో భారతదేశం వాటాయే 18.72 కోట్లు. ప్రపంచంలోనే పాలు ఇచ్చే ఆవులు అత్యధికంగా 6.06 కోట్లు ఇండియాలో ఉన్నాయి. ఐరోపా దేశాల్లో 2.29 కోట్ల ఆవులే ఉన్నా ఇండియాకన్నా రెట్టింపుస్థాయిలో పాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇండియాతో పోలిస్తే కేవలం 15 శాతం(93.30 లక్షలే) ఆవులున్న అమెరికా పాల ఉత్పత్తిలో ఇండియాకన్నా ముందుంది. ప్రపంచంలోని గేదెల్లో 56, ఆవుల్లో 12.5 శాతమిక్కడే ఉన్నాయి. కానీ ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ వాటా 10 శాతానికి మించి లేదు. అధిక పాలనిచ్చే పశువులు మనదగ్గర లేకపోవడం ప్రధాన సమస్య. పశుపోషణ వ్యయం దేశంలో నానాటికీ పెరుగుతోంది.
పేరుకుపోతున్న పాలపొడి
లాక్‌డౌన్‌లో మిగిలిపోతున్న పాలను డెయిరీలన్నీ పొడిగా మార్చేసి నిల్వలు పేర్చేయడంతో దాని ధర రూ.300 నుంచి రూ.160కి పతనమైంది. కిలో పాలపొడి తయారీకి సగటున రూ.240 దాకా ఖర్చవుతున్నందున నష్టాలు వస్తున్నాయని, వాటిని రైతులపైకి డెయిరీలు నెట్టేస్తున్నాయి. ఇప్పుడు దేశవాప్తంగా రెండు లక్షల టన్నులకు పైగా పాలపొడి నిల్వలు పేరుకుపోయాయి. వర్షాకాలంలో ఉత్పత్తి పెరిగినా వాణిజ్య కొనుగోళ్లు లేకపోవడంతో డిమాండు మరింత పతనమైంది. మార్చికి ముందు పలు రాష్ట్రాల్లో లీటరు ఆవు పాలధర రూ.30 నుంచి రూ.35 ఉండగా ఇప్పుడు రూ.17కే కొంటున్నారని మహారాష్ట్ర రైతులు నిరసనలకు దిగుతున్నారు.