కరోనా మహమ్మారివల్ల ఏర్పడిన అసాధారణ పరిస్థితులు అందర్నీ వేధిస్తున్నాయి. నలుగురిలో మెసలే అవకాశం లేకపోవడం, భౌతిక దూరం పాటించడం, స్వీయ నిర్బంధం వంటి నిబంధనలు పౌరుల్లో మానసికంగా ఒత్తిడి పెంచుతున్నాయి. సమాజంలో అందరిలోనూ ఆందోళన పెరుగుతోంది. వ్యాక్సిన్ వంటివి వచ్చేసినా.. మన దేశ జనాభా అధికంగా ఉన్న కారణంగా అవి అందరికీ అందడంలో జాప్యం జరుగుతోంది. ఈలోగా ఆందోళనలకు గురికాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. జీవన శైలిని మార్చుకోవాలి. మహమ్మారి సృష్టిస్తున్న వ్యాకులతకు అడ్డుకట్ట వేసే దిశగా ఆహారం, ఆరోగ్యాలపట్ల శ్రద్ధ తీసుకోవాలి. ప్రమాదం కన్నా, ఏదో జరుగుతుందన్న భయమే మానసికంగా మనిషికి ఎక్కువ కీడు చేస్తుంది. మానసికంగా, శారీరకంగా ప్రభావం చూపుతుంది.
మానసిక దృఢత్వమే మందు..
కొందరిలో మానసిక దౌర్బల్యం ఎక్కువ కావడంతో- విచక్షణ కోల్పోయి, ఆత్మహత్యవంటి విపరీత నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఈ అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ మానసిక సన్నద్ధతను పెంపొందించుకోవాలి. మానసిక ఆందోళనకు ప్రధాన కారణం అభద్రత. మన సమాజంలో ఎక్కువగా ఇంటి పెద్ద మాత్రమే ఆర్థిక వ్యవహారాలను చక్కబెడుతూ ఉంటాడు. కొవిడ్ కాలంలో పెరుగుతున్న వైద్య వ్యయాలను భరించలేక పోవడం, కుటుంబ సభ్యుల పట్ల ఆందోళన, తనకు ఏదైనా జరిగితే వారు ఏమైపోతారో అన్న వ్యాకులత ఇంటి పెద్ద ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది.
ఖర్చుకు బడ్జెట్తో చెక్..
ఇక గృహిణి కుటుంబ సభ్యుల ఆహార, ఆరోగ్య అవసరాలు తీర్చడంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. మరోవైపు కొవిడ్ సృష్టించిన సంక్షోభంవల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతోంది. పేద, మధ్యతరగతి వర్గాల ఆదాయం తగ్గడంతో పాటు వ్యయాలు పెరిగాయి. శానిటైజర్, ముఖ మాస్కులు వంటి వాటికి పెట్టే ఖర్చు అనివార్యమయింది. సామాన్యుడికి ఇది పెను భారమే. ఈ పరిస్థితులను తట్టుకునేందుకు- కుటుంబ సభ్యులందరూ ఆర్ధిక పరిస్థితులను గురించి విపులంగా చర్చించుకుని, ఖర్చులను అదుపులో పెట్టుకునే విధంగా ప్రణాళికలను రూపొందించుకోవాలి. తద్వారా పెద్దలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా పిల్లలు సైతం తమ గృహ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని తదనుగుణంగా వ్యవహరించడం అలవరచుకుంటారు. మరోవైపు ఇలాంటి చర్యలవల్ల 'మన కుటుంబం' అన్న భావన ద్వారా వారు మానసికంగా బలవంతులుగా అవుతారు.
ఒత్తిడి దరిచేరకుండా..
మన పూర్వీకులు జీవనం చక్కగా సాగడానికి కొన్ని సంప్రదాయాలు, కట్టుబాట్లు నిర్దేశించారు. ధ్యానం, సూర్యనమస్కారాలు తదితరాలు చేయడంవల్ల నేటి తరానికి మంచి అలవాట్లు నేర్పినట్లవుతుంది. నిత్యావసరాల కొనుగోలుకై అవసరం అయినప్పుడు అందరూ బైటకు వెళ్లడం కాకుండా కదలికలను నిరోధించుకోవాలి. గృహంలో పనులను అందరూ పంచుకుని చేయడంవల్ల గృహిణులపై ఒత్తిడి పెరగకుండా నిరోధించవచ్చు. ఉద్యోగ, వ్యాపార కారణాలతో బయటకు వెళ్లి వచ్చేవారు- ఇంటికి రాగానే తలస్నానం చేయడం వంటి అలవాట్లను పాటించాలి. కరోనా వైరస్ వ్యాప్తికి తావివ్వని ఇలాంటి జీవన విధానాన్ని అవలంబించడం ఇప్పటి పరిస్థితుల్లో ఎంతో అవసరం. రెండోసారి కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఈ మహమ్మారి విస్తృతివల్ల విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. ఈ సమయంలో విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాలను కనుగొని వెలికితీసి ప్రోత్సహించాలి.
అనుబంధాల లోగిళ్లతో ఒత్తిడి దూరం..