కొవిడ్ సృష్టించిన విధ్వంసం విద్యావ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. విద్యాసంస్థలు మూతపడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా 186 దేశాల్లో 120 కోట్ల మంది విద్యార్థులు తరగతి గదులకు దూరమయ్యారు. ఈ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగే సూచనలు ఉండటంతో ఆన్‌లైన్ విద్యకు ప్రాధాన్యం పెరిగింది. 'యూడెమి, కోర్సెరా, లింకిడిన్ లెర్నింగ్, స్కిల్ షేర్, లార్క్, బైజూస్..' వంటి డిజిటల్ వేదికల ద్వారా భారీ సంఖ్యలో విద్యార్థులు సేవలను పొందుతున్నారు. స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ వంటి విశ్వవిఖ్యాత విద్యాలయాలు సైతం ఆన్‌లైన్ కోర్సులు ప్రారంభించాయి. భారత్‌లో వంద ఉత్తమ విశ్వవిద్యాలయాలకు, ఉన్నత విద్యాసంస్థలకు ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులను ప్రారంభించే అవకాశం కల్పిస్తామని నూతన విద్యావిధానం ప్రకటించింది. ఈ మధ్యనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 37 విశ్వవిద్యాలయాల ఆన్‌లైన్ విద్యకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మరోవైపు ఉన్నత విద్యారంగంలో స్థూల నమోదు నిష్పత్తిని గణనీయంగా పెంచే ఉద్దేశంతో వర్చువల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృతస్థాయిలో సంప్రతింపులు జరుపుతోంది. సంప్రదాయ, సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు అదనంగా వర్చువల్ విశ్వవిద్యాలయాలను స్థాపించి ఉన్నత విద్యను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
పెరగనున్న పోటీతత్వం
ఇవాన్ ఇల్లిచ్ అనే అమెరికా రచయిత 'డెస్కూలింగ్ సొసైటీ' అనే పుస్తకంలో వర్చువల్ యూనివర్సిటీ ఆలోచనను 1971లో ప్రతిపాదించారు. ఈ ఆలోచన 80వ దశకంలో ఆచరణకు నోచుకొని- జర్మనీలో 'గ్లోబల్ వర్చువల్ యూనివర్సిటీ' రూపుదిద్దుకుంది. ఉన్నత విద్యాకోర్సులను ఆన్‌లైన్ ద్వారా అందించే ప్రత్యేక విశ్వవిద్యాలయమే వర్చువల్ యూనివర్సిటీ. ఈ విశ్వవిద్యాలయానికి నిర్దిష్ట పరిధి, స్పష్టమైన వ్యవస్థ ఉండవు. వర్చువల్ విశ్వవిద్యాలయాలు మూడు రకాలు. ఒకటి- విశ్వవిద్యాలయాలు, విభాగాలు, ఉన్నత విద్యాసంస్థలు కలిసి ఇంటర్నెట్, టెలివిజన్ మాధ్యమాలద్వారా కోర్సులను అందించేవి. రెండు- చట్టబద్ధమైన వ్యవస్థతో ఇంటర్నెట్‌లో మాత్రమే కనిపించేవి. మూడు- భౌతిక ప్రాంగణం ఉన్నా లేకున్నా ఇతర ప్రదేశంలో ప్రొఫెసర్లు చెప్పే పాఠాలను ప్రసారం చేసేవి. ఉన్నత విద్యారంగంలో పెరుగుతున్న గిరాకీని, అవసరాలను తీర్చడానికి ఇది మెరుగైన వ్యూహం. నూతన సాంకేతిక సమాచార ప్రసార పద్ధతులైన ఈ-మెయిల్, వెబ్ పేజీలవంటి అనుసంధాన మార్గాల ద్వారా విద్యార్థులకు బోధనను అందిస్తారు. వర్చువల్ విశ్వవిద్యాలయాల్లో కోర్సులన్నీ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే ఉంటాయి. విద్యార్థులు తమకు నచ్చిన విధానంలో పరీక్షలకు హాజరయ్యే వెసులుబాటు ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉన్నతవిద్యను మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఫీజుతో అందించడమే ఈ విశ్వవిద్యాలయాల లక్ష్యం. ఉన్నత విద్యకోసం ఏటా లక్షల మంది విదేశాలకు వెళుతున్నారు. విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య 10.9 లక్షలకు పైనే ఉన్నట్లు విదేశాంగ శాఖ పార్లమెంటుకు తెలిపింది. రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థులు 2017-18 నాటికి విద్యకోసం రూ.20,801 కోట్లు వెచ్చించారు. విద్యార్థులు ఒక విషయాన్ని ఆన్‌లైన్ అభ్యాసం ద్వారా 25శాతం నుంచి 60శాతం వరకు గుర్తు పెట్టుకోగలరని ఆన్‌లైన్ విద్యపై నిర్వహించిన పరిశోధనలు పేర్కొంటున్నాయి. తరగతి గదిలో కంటే 40 నుంచి 60 శాతం తక్కువ సమయంలో ఆన్‌లైన్ పాఠాలు నేర్చుకోగలరని వెల్లడించాయి.