కరోనా కల్లోలంతో ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతులు తారుమారవుతున్నాయి. పేదరిక నిర్మూలన పథకాలతో సాధించిన ప్రగతి అంతా ఒక్కసారిగా బూడిదలో పోసిన పన్నీరవుతోంది. 130 కోట్లకు పైబడిన జనాభాతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ మీద ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. కొవిడ్ కారణంగా ఒక్క 2020లోనే 7.5 కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి జారిపోయారని అమెరికాకు చెందిన ప్యూ పరిశోధన కేంద్రం ప్రకటించింది. అలాగే, రోజుకు రూ.700-1,500 ఆదాయం పొందే మధ్యతరగతి ప్రజల్లో 3.2 కోట్ల మంది అల్పాదాయ వర్గశ్రేణిలోకి పడిపోయారు. రోజుకు రూ.150-700 ఆర్జించే అల్పాదాయ వర్గంలోని 3.5 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువకు వెళ్ళిపోయారు. కరోనా సంక్షోభంతో దేశంలో పేదరికం గణనీయంగా పెరిగిందన్న 'ప్యూ' నివేదిక ఆందోళన రేపుతోంది.
అధికమైన అంతరాలు
దేశంలోని ధనవంతులు, పేదల ఆదాయ వ్యత్యాసాలను కొవిడ్ భారీగా పెంచిందని ఆక్స్‌ఫామ్ నివేదిక స్పష్టంచేసింది. భారత్‌లోని మొదటి వంద మంది సంపన్నుల సంపద నిరుడు మార్చి నుంచి 35 శాతం అంటే రూ.13 లక్షల కోట్ల మేరకు పెరిగింది. దీనికి సమాంతరంగా ఒక్క ఏప్రిల్ 2020లోనే గంటకు 1.70 లక్షల మంది సామాన్యులు తమ ఉపాధిని కోల్పోయారు. మొత్తమ్మీద లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన తరవాత 12.2 కోట్ల మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను పోగొట్టుకున్నారు. దీంతో ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నవారు ఉన్నపళంగా పేదరికంలోకి జారిపోయారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం (సీఎంఐఈ) గణాంకాల మేరకు ఏప్రిల్ 2020లో 23.52 శాతంగా నమోదైన నిరుద్యోగిత రేటు డిసెంబరు నాటికి 9.06 శాతానికి తగ్గింది.
లాక్‌డౌన్‌కు సడలింపులు ఇచ్చాక ఉపాధి అవకాశాలు కొద్దిమేరకు పెరిగినా ప్రైవేటు సంస్థల్లో వేతనాల్లో కోత, పెరిగిన ధరల నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాల్లో తరుగుదలే కనిపిస్తోంది. కరోనాతో దేశంలో పెరిగిన పేదరికం స్థాయుల్ని మదింపు వేసి, తదనుగుణంగా చర్యలు తీసుకోవడానికి వ్యవస్థాగతమైన ప్రయత్నమేదీ జరగడం లేదు. 'కొవిడ్ వ్యాప్తి ప్రారంభమయ్యాక దేశంలో ఎంతమంది పేదరికంలోకి కూరుకుపోయారో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏదైనా అధ్యయనం చేసిందా?' అని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంపీ కేశినేని నాని లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి 'లేదు' అంటూ ఒక్క మాటలో జవాబు ఇచ్చింది కేంద్రం. కరోనాపై పోరాటంలో భాగంగా పేదలకు సాయం చేయడానికి రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినట్లు మాత్రం చెప్పింది. ఎంత మందికి ఎలాంటి లబ్ధి చేకూరిందన్న వివరాలేమీ అందుబాటులో లేవు.