బాలలు భవిష్యత్ మానవ వనరులు. వారి శ్రేయస్సే దేశాభివృద్ధికి మూలం. అందుకే నేటి బాలలే రేపటి పౌరులన్నారు పెద్దలు. వీరిపై పెట్టుబడి దేశాభివృద్ధికి సూచిక. బాల్యాన్ని ఆనందంగా అనుభవించడం ప్రతి బిడ్డ జన్మ హక్కు. సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలంటే చిరు ప్రాయమే కీలకమైనది. పిల్లల మనసులు సున్నితమైనవి. ఈ వయసులో ఎదుర్కొనే ఇక్కట్లు వాళ్ల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు పెరగడానికి కావలసిన వనరులను సమకూర్చి అభివృద్ధికి దోహదపడటం మన బాధ్యత. కానీ, ప్రస్తుతం కరోనా విపత్తు కారణంగా మూతబడిన పాఠశాలలు, ఊడిన ఉద్యోగాలు, స్తంభించిన జీవనం, తగ్గిన ఆదాయం పెద్దలతో పాటు పిల్లల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దిగువ, మధ్యతరగతి బాలలు ప్రాథమిక అవసరాలకు నోచుకోక పేదరికంలోకి కూరుకుపోయారని ఇటీవల యునిసెఫ్ వెలువరించిన అధ్యయనం పేర్కొంది.
ఈ అధ్యయనం ప్రకారం ఇప్పటికే కొవిడ్ కారణంగా విద్య, ఆరోగ్యం, గృహవసతి, పోషకాహారం, పారిశుద్ధ్యం, నీరు అందుబాటులో లేని పిల్లల సంఖ్య 120 కోట్లు ఉండగా, వీరికి అదనంగా మరో 15 కోట్ల మంది చేరారని, దీనివల్ల పేదరికం మరింత పెరిగిందని వెల్లడించింది. దీని ప్రభావం పేద, మధ్య తరగతి దేశాలపై అధికంగా ఉందని విశ్లేషించింది.
రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారి వాళ్ల పాలిట శాపంగా మారే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ప్రపంచ దేశాలతో పాటు బాలల జనాభా అత్యధికంగా గల వర్ధమాన భారతదేశం కూడా బాలల సంరక్షణ పట్ల మరింత కృషి చేయాల్సిన అవసరాన్ని ఈ నివేదిక నొక్కి చెబుతోంది.
కరోనాతో మరింతగా...
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో బాలల జీవనం ఇబ్బందుల పాలవుతోంది. ముఖ్యంగా కుటుంబ ఆదాయం పడిపోవడం వల్ల సామాజిక జీవనం దెబ్బతిన్నది. దీని ప్రభావం పిల్లలపై పడింది. ఫలితంగా విద్య, వైద్యం వంటి ప్రాథమిక సౌకర్యాలకు నోచుకోని, వారి శారీరక, మానసిక వికాసాభివృద్ధి కుంటుపడింది. కుటుంబ ఆర్థిక పరిస్థితికి, బాలల జీవనానికి అవినాభావ సంబంధం ఉంది.
కరోనా తెచ్చిన మార్పులతో బాలల్లో లింగపరమైన అసమానతలతో పాటు విద్యాపరమైన అంతరాలు పెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 'బాలల జీవనంపై మహమ్మారి ప్రభావం'పై ఇటీవల 'సేవ్ ది చిల్డ్రన్' అనే సంస్థ ప్రత్యేక అధ్యయనాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.