Population control bill pros and cons:జనాభా నియంత్రణపై ప్రముఖ నటుడు, భాజపా ఎంపీ రవి కిషన్ చేసిన వ్యాఖ్యలు దేశంలో చర్చనీయాంశంగా మారాయి. జనాభాను కట్టడి చేసేందుకు బిల్లును తీసుకొస్తున్నట్లు ఆయన చేసిన ప్రకటనపై.. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన రవి కిషన్.. ఏ నైతిక బాధ్యతతో ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విపక్షాలు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చర్చల సంగతి పక్కనబెడితే.. నిజంగా ఏం జరుగుతోందో తెలుసుకోవడం ముఖ్యం. జనాభా నియంత్రణ బిల్లు నిజంగానే తీసుకొస్తున్నారా? దీని వల్ల లాభమా? నష్టమా? దీనికి ఎంపీల నైతిక విలువలకు సంబంధం ఉందా? అనే విషయాలపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
జనాభా నియంత్రణ బిల్లు గురించి పరిశీలిస్తే...
జనాభా నియంత్రణ బిల్లును 2019లో భాజపా ఎంపీ రాకేశ్ సిన్హా ప్రతిపాదించారు. ప్రైవేటు బిల్లు రూపంలో దీన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దంపతులు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలను కనకుండా నిరోధించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులకు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించడం, సబ్సిడీలను తొలగించడం, ప్రభుత్వం అందించే సర్వీసులు, సౌకర్యాలకు దూరం చేయడం వంటివి ఇందులో కీలక అంశాలు. ఇలాంటి బిల్లునే తాను ప్రవేశపెట్టనున్నట్లు తాజాగా రవి కిషన్ ప్రకటించారు.
ప్రభుత్వ వైఖరి ఏంటి?
జనాభా నియంత్రణ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. ఇలాంటి బిల్లును తీసుకొచ్చే యోచన ఏదీ తమ వద్ద లేదని పార్లమెంట్ సాక్షిగా గతంలోనే వెల్లడించింది. జాతీయ కుటుంబ సర్వే-5 ప్రకారం 2019-21 మధ్య దేశంలో సంతానోత్పత్తి రేటు 2.0కు పడిపోయిందని కేంద్ర వైద్యశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఐదు రోజుల క్రితమే పార్లమెంట్లో స్పష్టం చేశారు. ఇది జనాభా భర్తీ స్థాయి కంటే తక్కువేనని చెప్పారు. ప్రభుత్వ వైఖరి నేపథ్యంలోనే 2019లో తన బిల్లును ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని ఎంపీ రాకేశ్ సిన్హా 'ఈటీవీ భారత్'తో వెల్లడించారు.
ఎంపీలకు వర్తించదా?
అయితే, ఎంపీ రవి కిషన్ చేసిన తాజా ప్రకటనతో జనాభా నియంత్రణ వివాదం మరోసారి తెరపైకి వచ్చినట్లైంది. ఆయనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ను పక్కనబెడితే.. రాజకీయ నేతల నైతికతపై నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చట్టాన్ని రూపొందించే సభ్యులు.. ఇద్దరు పిల్లల నిబంధనకు కట్టుబడే ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి:జనాభా నియంత్రణపై బిల్లు.. నటుడు రవికిషన్‌పై నెటిజన్లు ఫైర్.. నలుగురు పిల్లలున్నారంటూ..!
ఎంపీల సంతానం ఇలా..
ఈ విషయంపై దృష్టిసారించిన ఈటీవీ భారత్.. ఎంపీల కుటుంబ సభ్యుల వివరాలను సేకరించింది. లోక్‌సభ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం మొత్తం 543 ఎంపీలు ఉండగా.. అందులో 303 మంది భాజపా, 53 మంది కాంగ్రెస్, 24 మంది డీఎంకే, 23 మంది తృణమూల్ కాంగ్రెస్‌కు చెందినవారు ఉన్నారు. మొత్తం 543 మంది ఎంపీలలో 171 మంది ఎంపీలకు ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నట్లు స్పష్టమైంది. ఇందులో భాజపా వాటా 107. కాంగ్రెస్ ఎంపీల్లో 10 మందికి ఇద్దరికి మించి సంతానం ఉన్నారు.