రోజుకూలీతో పొట్టపోసుకునే నిరుపేదల ఉపాధి ఏర్పాట్లపై మరింత కసరత్తు చేసి, పేదలను కాపాడేందుకు అవసరమైన సమగ్ర ప్రణాళికతో ‘లాక్‌డౌన్’ అమలుచేసి ఉంటే బాగుండేది. కర్మాగారాల మూసివేతలో ముందుచూపు కొరవడిన ఫలితంగా, కరోనా వైరస్‌పై పోరాటానికి అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుతూ, ఉత్పత్తిని మరింత పెంచాల్సిన సమయంలో వైద్య ఉపకరణాల్ని తయారు చేసే పరిశ్రమలు పనులు నిలిపివేయాల్సి వచ్చింది.
‘లాక్‌డౌన్’ అనేది సామాజిక దూరం ప్రక్రియకు అత్యంత తీవ్రమైన రూపం. అయితే, సామాజిక దూరాన్ని సమర్థంగా పాటించడం ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తిని నెమ్మదింపజేయడంలో ఇతర దేశాలు విజయవంతమైనట్లు ఆధారాలున్నాయి. ‘లాక్‌డౌన్’ను అమలు చేయడం వల్ల సమస్యలున్నా, భారత్‌లో ఇది వైరస్ వ్యాప్తిని నెమ్మదింపజేస్తుంది. అయితే, మూడు వారాల ‘లాక్‌డౌన్’తోనే వైరస్‌ను పారదోలవచ్చని భావించడం మాత్రం సరికాదు. ‘లాక్‌డౌన్’ అందించే అదనపు సమయాన్ని పరీక్షలు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవడం, బాధితులు ఎవరెవరిని కలిశారనేది గుర్తించడం, ఐసోలేషన్‌లో ఉంచడం, వెంటిలేటర్ల సేకరణ, మరిన్ని ఐసీయూ పడకల్ని ఏర్పాటు చేయడం, పరిస్థితి అంతగా విషమించని రోగుల కోసం ఐసీయూయేతర పడకల్ని మరిన్ని ఏర్పాటుచేయడం వంటి వైద్య సంరక్షణ చర్యల కోసం ఉపయోగించుకోవాలి.
భారత్‌లో ప్రస్తుతం అమలు చేస్తున్న, భవిష్యత్తులో ప్రకటించబోయే ‘లాక్‌డౌన్’ల ఫలితంగా ఆర్థిక భారం భారీగా ఉండబోతోంది. ఇందులో పేదలే ఎక్కువ స్థాయిలో భారాన్ని మోయనున్నారు. దేశంలో పేదలు చాలా దగ్గరిదగ్గరిగా, అపరిశుభ్ర వాతావరణంలో నివసిస్తుంటారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటూ, మరణాల రేటు అధికంగా ఉంటుంది. ఇలాంటి పేదలకు కరోనా వైరస్ పరీక్షల్నిగానీ, చికిత్సలను గానీ భరించే స్థోమత ఉండదు. సర్కారు, ప్రైవేటు ఆస్పత్రుల్లో పేదలకు ప్రభుత్వమే రోగనిర్ధరణ పరీక్షలు, చికిత్సల్ని అందజేయాలి. అప్పుడే వారిలో ఏవైనా లక్షణాలుంటే పరీక్ష చేయించుకునేలా ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. పేదలు నివసించే స్థితిగతులను బట్టి చూస్తే, ఇళ్లవద్ద ‘ఐసోలేషన్’లో ఉండటం అనేది సాధ్యంకాదు. అందుకని ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం మంచిది.
ఒకవేళ కొవిడ్ తీవ్రత అధిక స్థాయిలో ఉంటే ఆసుపత్రుల్ని పెద్ద సంఖ్యలో కేసులు ముంచెత్తుతాయి. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా ముఖ్యంగా న్యూయార్క్‌లలో ఇలాంటి పరిస్థితే తలెత్తింది. ఫలితంగా ఆరోగ్య సేవల్లోనూ పరిమితుల్ని విధించాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. ఇటలీలో చాలామంది రోగులు పరిమితంగా ఉన్న ఆస్పత్రి సౌకర్యాల కోసం ఎగబడటంతో ఎవరిని కాపాడాలి, ఎవరిని వదిలేయాలనే విషయంలో వైద్యులు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆరోగ్యకరంగా, తక్కువ వయసులో ఉన్న రోగులకే ప్రాధాన్యమిస్తూ, వారినే కాపాడాలనే నిర్ణయానికి వచ్చారు.