దేశవ్యాప్తంగా గాలిలో సూక్ష్మ ధూళి కణాలు పెద్దయెత్తున పేరుకుపోవడంవల్ల దాపురిస్తున్న అనర్థాల తీవ్రత చెప్పనలవి కానిది. ఈ గడ్డమీద ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకదానికి కలుషిత వాయువే కారణమని, సగటున సుమారు అయిదేళ్లదాకా పౌరుల ఆయుర్దాయాన్నీ అది కబళిస్తోందని అధ్యయనాలు చాటుతున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిధికి 10, 11 రెట్ల మేర సూక్ష్మ ధూళి కణాలు గాలిని కలుషితం చేస్తున్న దురవస్థ, లాక్‌డౌన్ల కారణంగా కొంత ఉపశమించిన మాట వాస్తవం. ఆ తగ్గుదల పరిమిత కాలానికేనని, 2020 అక్టోబరు నుంచి మొన్న జనవరి చివరి వరకు సూక్ష్మ ధూళి కణాలు అంతకు సంవత్సరం క్రితంతో పోలిస్తే మరింత పెచ్చరిల్లాయని సీఎస్‌ఈ (వైజ్ఞానిక పర్యావరణ కేంద్రం) తాజా విశ్లేషణ స్పష్టీకరిస్తోంది.
43చోట్ల పరిస్థితి దారుణం
కేంద్ర కాలుష్య మండలి (సీపీసీబీ) అధికారిక ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదైన సమాచారం ఆధారంగా పరిశీలించిన 99 నగరాల్లో 43చోట్ల పరిస్థితి దిగజారిందన్న నిర్ధారణ, పెనుప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆ జాబితాలో గురుగ్రామ్, లఖ్‌నవూ, జైపూర్, ఆగ్రా, నవీ ముంబయి, జోధ్‌పూర్, కోల్‌కతాలతోపాటు విశాఖపట్నం పేరూ చోటుచేసుకుంది. ఔరంగాబాద్, ఇండోర్, భోపాల్, కొచ్చి, కోజికోడ్ తదితరాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు కాలుష్య స్థాయి ముమ్మరిస్తున్నట్లు గణాంక వివరాలు నిగ్గుతేలుస్తున్నాయి.
తగ్గిన నిధుల కేటాయింపు
దిల్లీలో వాయుకాలుష్యం పెరిగేకొద్దీ అయిదేళ్లలోపు పిల్లల్లో రక్తహీనత ముప్పు కోర చాస్తున్నదని అక్కడి ఐఐటీతో హార్వర్డ్ విశ్వవిద్యాలయం కలిసి చేపట్టిన ఉమ్మడి అధ్యయనం హెచ్చరిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వాయుకాలుష్యానికి కోరలు మొలుస్తున్న తరుణంలోనే, గాలి నాణ్యత మెరుగుదల కోసం నిధుల కేటాయింపులు ఇటీవలి కేంద్ర బడ్జెట్లో తెగ్గోసుకుపోయాయి. సీఎస్‌ఈ సరికొత్త విశ్లేషణ వెలుగులోనైనా తక్షణ దిద్దుబాటు చర్యలకు కేంద్రం నడుం కట్టాలి.
ప్రణాళిక అమలులో నిర్లక్ష్యం
దీర్ఘకాలం వాయుకశ్మలానికి గురైనవారి మెదడు పనితీరు దెబ్బతిని, మూత్రపిండాల సామర్థ్యమూ హరాయించుకుపోతోంది. వాయునాణ్యత క్షీణించి శ్వాసకోశ వ్యాధులూ పెరుగుతున్నాయి. ఈ దుస్థితిని చెదరగొట్టేందుకంటూ తలపెట్టిన జాతీయ కార్యాచరణ ప్రణాళిక అమలులో ఎక్కడికక్కడ అలసత్వం ప్రస్ఫుటమవుతోంది. పాతబడిన థర్మల్ విద్యుత్ కేంద్రాల్ని మూసేయాలని, వ్యర్థాల నియంత్రణ మెరుగుపడాలని 'నీతి ఆయోగ్' చేసిన సూచనలకు సరైన మన్నన దక్కడంలేదు. ఉన్న చట్టాలూ ఆచరణలో చట్టుబండలవుతున్నాయి.
చైనా పక్కా ప్రణాళిక
పౌర సమాజంలో పర్యావరణ స్పృహ రగిలిస్తున్న దేశాలెన్నో జల, వాయు నాణ్యతలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నాయి. ఇండొనేసియా లాంటిచోట్ల విరివిగా మొక్కల పెంపకానికి, వ్యర్థాలనుంచి మీథేన్ ఉత్పత్తికి విశేష ప్రాధాన్యమిస్తున్నారు. అత్యుత్తమ ప్రజారవాణా వ్యవస్థ కలిగిన నగరాలుగా వెలుగొందుతున్న బెర్లిన్, షాంఘై, లండన్, మాడ్రిడ్, సియోల్ వంటివి అసంఖ్యాక జీవితాలు పొగచూరిపోకుండా జాగ్రత్తపడుతున్నాయి. 1998నుంచి పదిహేనేళ్లపాటు ఇంధన మౌలిక వసతుల ఉన్నతీకరణ అజెండాకు కట్టబాటు చాటిన చైనా, ఏటికేడాది నిర్దిష్ట లక్ష్యాలు నిర్దేశించుకుంటోంది. గత సంవత్సరం బీజింగ్‌లో ఘనపు మీటరుకు 38 మైక్రోగ్రాముల మేర సూక్ష్మ ధూళికణాలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆ రాశిని 34.5కు కట్టడి చేస్తామంటున్న చైనా, వచ్చే అయిదేళ్లలో బొగ్గు స్థానే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని విధిగా వినియోగిస్తామంటోంది. అక్కడ ఇప్పటికే బొగ్గుతో నడిచే నూతన కర్మాగారాల నిర్మాణాన్ని నిషేధించారు. అటవీ ప్రాంతాల సంరక్షణకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించి, కలుషిత పరిశ్రమల కట్టడికి పకడ్బందీ ప్రణాళికను అమలుపరుస్తున్నారు.
వాయునాణ్యత పరిరక్షణ కోసం ఇక్కడా చట్టాలు, నిబంధనావళిని కొలువుతీర్చినా- అటు అధికార శ్రేణుల్లో, ఇటు పౌరసమాజంలో పర్యావరణ స్పృహ పాదుగొనకపోవడమే సంక్షోభాన్ని ప్రజ్వరిల్లజేస్తోంది. ఏటా 12 లక్షలకుపైగా నిండుప్రాణాల్ని కబళిస్తున్న నిర్లక్ష్య ధోరణుల్ని పరిమార్చడమే, దేశంలో వాయునాణ్యతను పరిరక్షించి మెరుగుపరచడంలో తొలి అడుగవుతుంది!
ఇదీ చూడండి:'మాట్లాడే స్వేచ్ఛను హరించేందుకే ఈ నియమాలు'