'రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడేలా చూడటమే గాని, ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించడం గవర్నర్ల బాధ్యత కాదని' సర్కారియా కమిషన్ స్పష్టీకరించి మూడు దశాబ్దాలవుతోంది. రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధ పాలనకు దన్నుగా నిలవాల్సిన రాజ్‌భవన్లు సంకుచిత రాజకీయ క్రీడాంగణాలుగా భ్రష్టుపడుతున్న వైనం ఇప్పటికీ పలుచోట్ల కళ్లకు కడుతూనే ఉంది. మొన్న మార్చిలో జ్యోతిరాదిత్య సింధియా పార్టీ ఫిరాయింపు మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కారు పుట్టి ముంచే క్రమంలో- అక్కడి గవర్నర్ సత్వర బలపరీక్షకు తొందర పెట్టడం తెలిసిందే. కరోనా కారణంగా శాసనసభను సత్వరం కొలువు తీర్చడం సాధ్యపడదన్న కుంటిసాకులు ఫలించక కమల్‌నాథ్ ప్రభుత్వం తట్టాబుట్టా సర్దుకోవడం ఇటీవలి ముచ్చటే! అందుకు పూర్తి భిన్నంగా భారత రాజకీయ చరిత్రలోనే విడ్డూరమనదగ్గ రీతిగా రాజకీయ డ్రామా రాజస్థాన్‌లో రక్తికడుతోంది. 18మంది అనుచరులతో ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ రాజేసిన అసమ్మతి కుంపటి- అశోక్ గెహ్లోత్ ప్రభుతను బొటాబొటీ మెజారిటీకి దిగలాగింది. మధ్యప్రదేశ్ అంత సాఫీగా ప్రభుత్వం చేతులు మారే వాతావరణం లేకపోవడంతో- కోర్టుల్లో పడ్డ కేసులు సరికొత్త న్యాయ సమీక్షకు అంటుకట్టాయి. అవి ఎప్పటికి తెమిలేదీ తెలియదు కాబట్టి, విధానసభలో మెజారిటీ నిరూపణకు అశోక్ గెహ్లోత్ చేస్తున్న యత్నాలకు గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా గండికొడుతున్న తీరు నిశ్చేష్టపరుస్తోంది. విశ్వాస పరీక్షకు కాని పక్షంలో శాసనసభను కొలువు తీర్చడానికి 21రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలన్న గవర్నర్- కొవిడ్ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, సిబ్బంది భద్రత రీత్యా భౌతిక దూర నిబంధనల్ని ఎలా పాటిస్తారో వెల్లడించాలంటున్నారు. సభలో మాన్య సభ్యుల భద్రత గౌరవ సభాపతి పరిధిలోని అంశం. మంత్రిమండలి సలహా మేరకే నడుచుకోవాల్సిన విధివిహిత బాధ్యత గల గవర్నర్- బలపరీక్షకు సైంధవుడిలా అడ్డుపడుతున్న తీరు ప్రజాస్వామ్యానికే కళంకం!
తాబేదురు వ్యవస్థ!