ప్రజలు పెద్దసంఖ్యలో తమ అసమ్మతిని నోటా ద్వారా వెల్లడించినప్పుడు ఒక వ్యవస్థాగత మార్పు వచ్చిందని భావించాలి. ఈ వ్యవస్థ వల్ల తగిన నిబద్ధత కలిగిన నాయకులను మాత్రమే అభ్యర్థులుగా నిలబెట్టేలా రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెరుగుతుంది...ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎమ్‌ల)లో ' పైన ఉన్నవారెవరూ కాదు' (నన్ ఆఫ్ ద ఎబో - నోటా) అనే మీటను పెట్టాలని 2013లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయమిది. ఆ తీర్పు ఫలితంగానే 2014 లోక్‌సభ ఎన్నికలలో తొలిసారిగా అన్ని ఈవీఎంలలోనూ 'నోటా' మీటను భారత ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది.
అసంతృప్తిని వెల్లడించే ఆయుధం
సరిగ్గా అయిదేళ్ల తరవాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో బుద్ధుడు నడయాడిన బిహార్‌లో నోటా మీట మోతెక్కింది. ఆ ఎన్నికల్లో రిజర్వుడు నియోజకవర్గమైన గోపాల్‌గంజ్‌లో ఏకంగా 51,600 ఓట్లు నోటాకు పడ్డాయి! ఆ ఎన్నికల్లో నోటా మూడోస్థానంలో నిలిచింది. అక్కడే కాదు- పశ్చిమ చంపారన్‌లోనూ 45,699 ఓట్లు నోటాకే పడటం బిహారీల చైతన్యాన్ని స్పష్టంగా సూచించింది. ఆ ఎన్నికల్లో బిహార్‌లోని 13 లోక్‌సభ నియోజకవర్గాల్లో నోటా మూడో స్థానంలో నిలిచింది. దాన్ని బట్టి అభ్యర్థుల విషయంలో బిహారీల అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ అభ్యర్థుల గుండెల్లో 'నోటా' భయం లేకపోలేదు. గతంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకుంది. దిగ్గజ దళితనేత రాంవిలాస్ పాస్వాన్ మరణం తరవాత ఆయన కుమారుడు చిరాగ్ పాస్వాన్ బహిరంగంగానే ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌పై ధ్వజమెత్తుతున్నారు. అధికార కూటమి విజయావకాశాలపై ఆయన ప్రభావం చూపేలా ఉన్నారు.
ఇదీ చదవండి:బిహార్ బరి: సీమాంచల్‌లో ఆధిపత్యం ఎవరిది?
నితీశ్ సంచలనం..
బిహార్‌లో ఇప్పటికే మూడు విడతలుగా ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించి, ఇప్పుడు వరసగా నాలుగోసారి ఆ కుర్చీని దక్కించుకోవడానికి నీతీశ్‌కుమార్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు నరేంద్రమోదీకి బద్ధ వ్యతిరేకిగా ఉన్న ఆయన- కేవలం మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూనే 2013లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. 2015లో బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిపి కూటమి ఏర్పరిచిన జేడీ(యూ) అధికారంలోకి వచ్చింది. రెండేళ్లకే లాలుప్రసాద్ కుటుంబసభ్యుల అవినీతిని, వారి ఆధిక్యాన్ని సహించలేక ఏకంగా ప్రభుత్వాన్నే రద్దుచేస్తూ ముఖ్యమంత్రి పదవికి నీతీశ్ రాజీనామా చేశారు.
మళ్లీ కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే భాజపా మద్దతుతో ఆయన పదవి చేపట్టడం అప్పట్లో దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించింది. ఈ పరిణామాన్ని ఆ రాష్ట్ర ప్రజలు అంత సులభంగా జీర్ణించుకోలేకపోయారు. దానికి తోడు ఇటీవలి కాలంలో బిహార్‌లో పెరిగిన నిరుద్యోగం, వెనకబాటుతనం ఓటర్లపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి.
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నాయకులు దిగజారి చేసుకుంటున్న వ్యక్తిగత విమర్శలు- చైతన్యవంతులైన ఓటర్లకు రాష్ట్ర రాజకీయాలపై విరక్తి కలిగిస్తున్నాయి. 'అన్నీ ఆ తాను ముక్కలే' అన్నట్లుగా అభ్యర్థులలో అత్యధికులపై తమ ఏవగింపును ప్రకటించేందుకు తమ చేతుల్లో ఉన్న బ్రహ్మాస్త్రం నోటాను వాళ్లు ప్రయోగిస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 243 నియోజకవర్గాల్లో కలిపి 9.50 లక్షల ఓట్లను నోటాకు వేసిన బిహారీ ఓటర్లు, అయిదేళ్ల తరవాత ఇప్పుడు మళ్లీ జరుగుతున్న ఎన్నికలలో వివిధ పార్టీల అభ్యర్థులను ఎంత మేర వ్యతిరేకిస్తారోనన్న ఆసక్తి దేశవ్యాప్తంగా ఉంది.