ఆగ్నేయ ఆసియాలోని మలేసియా(Malaysia Covid) రాజకీయ అస్థిరత దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి కరోనా వైరస్ (Malaysia Covid) వ్యాప్తి ఆజ్యం పోస్తోంది. జాతీయ కూటమి తరఫున ముహిద్దీన్ యాసిన్ 2020 మార్చిలో మలేసియా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు యునైటెడ్ మలయాస్ నేషనల్ ఆర్గనైజేషన్ (యూఎంఎన్‌ఓ) మద్దతు ప్రకటించింది. అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ ప్రభుత్వం తుమ్మితే ఊడే ముక్కులాగే ఉంది. పదవిని కాపాడుకోవడానికి ఏకంగా 70 మందికి కేబినెట్‌లో స్థానం కల్పించి ముహుద్దీన్ విమర్శల పాలయ్యారు. కేవలం రెండు ఓట్ల ఆధిక్యంతో బడ్జెట్‌ను ఆమోదించుకోగలిగారు.
యూఎంఎన్‌ఓ నేతల అవినీతి బాగోతాలు వెలుగులోకి వచ్చి ముహిద్దీన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి పలుమార్లు మద్దుతు ఉపసంహరిస్తున్నట్లు యూఎంఎన్‌ఓ బెదిరింపులకు దిగింది. జులైలో మద్దతును ఉపసంహరించుకొంది. దీంతో మలేసియా రాజు సుల్తాన్ అబ్దుల్లా ఉప ప్రధాని ఇస్మాయిల్‌సబ్రీ యాకూబ్‌కు దేశ పాలనా పగ్గాలు అప్పగించారు. దేశ పరిస్థితులను చూస్తుంటే యాకూబ్ పాలన ఎన్నాళ్లు సజావుగా సాగుతుందో ఎవరూ చెప్పగల పరిస్థితి లేదు.
ప్రధాని పాత్రే..
మలేసియాలో కొవిడ్ వ్యాప్తిలో(Malaysia Covid) ముహిద్దీన్ ప్రభుత్వ పాత్ర చాలా ఉంది. అధికారం చేపట్టాక కఠిన లాక్‌డౌన్‌తో(Malaysia Coronavirus Lockdown) 2020 జులై నాటికి కేసుల సంఖ్యను సున్నాకు చేర్చారు. స్వపక్ష నాయకులే సాబాహ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటూ ఉద్యమానికి దిగారు. ఫలితంగా వైరస్ మరోసారి దేశవ్యాప్తంగా పాకింది. దీంతో ముహిద్దీన్ ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో కఠిన లాక్‌డౌన్ విధించింది. అయినా కేసుల సంఖ్య తగ్గకపోగా, విపరీతంగా పెరిగింది. నెలల తరబడి వ్యాపారాలు, విద్యాసంస్థలు, ఇతర కార్యాలయాలు మూతపడటంతో విసిగిపోయిన ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలకు దిగారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గిన ముహిద్దీన్ తన ప్రభుత్వం మద్దతు కోల్పోయిందని ప్రకటించారు. అప్పటికే దేశంలో పరిస్థితి అధ్వాన స్థితికి చేరుకొంది. దాదాపు 52శాతానికి పైగా ప్రజలు రెండు డోసుల టీకాలు పూర్తి చేసుకొన్నా, మలేసియాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత 20 రోజులుగా అక్కడ రోజువారీగా 20వేల కేసులకు పైగానే నమోదవుతున్నాయి. 3.27 కోట్ల జనాభా ఉన్న మలేసియాలో ఇప్పటిదాకా 16 లక్షల మందికి పైగా వైరస్ బారిన పడగా, 22వేల మందికి పైగా కన్నుమూశారు.