తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Modi UNGA: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఇవే కీలకం! - క్వాడ్‌

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా పర్యటనపై (Modi UNGA) సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సహా ఇతర క్వాడ్‌ దేశాధినేతలతో మోదీ కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఏఏ అంశాలు కీలకంగా మారనున్నాయో తెలుసుకుందాం.

modi unga
నరేంద్ర మోదీ

By

Published : Sep 22, 2021, 6:56 AM IST

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి అమెరికాలో (Modi UNGA) పర్యటించనున్నారు. చాలా ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొననున్నారు. 24వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వ్యక్తిగత సమావేశం జరుపుతారు. ఆ తరవాత క్వాడ్‌ దేశాధినేతల సమావేశంలో పాల్గొంటారు. 25వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. బైడెన్‌, ఇతర క్వాడ్‌ దేశాధినేతలతో ఇంతవరకు వర్చువల్‌ సమావేశాలు జరిపిన మోదీ, ఈసారి వారందరినీ ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడతారు. తాజా పర్యటనలో భాగంగా పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి.

'ఆకస్‌' అవతరణ

బైడెన్‌-మోదీ ముఖాముఖి సమావేశంలో అఫ్గానిస్థాన్‌ గురించి చర్చ జరగవచ్చు. కాబూల్‌ నుంచి అమెరికా సేనలు నిష్క్రమించిన దరిమిలా అక్కడ చైనా, పాకిస్థాన్‌, రష్యా, ఇరాన్‌ నిర్వహించబోయే పాత్రపై అగ్రనేతలు దృష్టి సారిస్తారు. అఫ్గాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించాలా లేదా అనేదీ చర్చిస్తారు. అఫ్గాన్‌లో తిష్ఠవేసిన అల్‌ఖైదా, ఐఎస్‌-కెలతోపాటు హక్కానీ గ్రూపు కార్యకలాపాల మీదా చర్చ జరుగుతుంది. తాలిబన్‌ ప్రభుత్వం మహిళలు, మానవ హక్కులపై జరుపుతున్న దాడులు ప్రముఖంగా ప్రస్తావనకు రావచ్చు. పాకిస్థాన్‌ సాయంతో తాలిబన్లను తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చైనా తలపోస్తోంది. ఆ విషయంతో పాటు హిమాలయాల్లో, దక్షిణ చైనా సముద్రంలో ఇతర దేశాల భూభాగాలను, జలాలను గుప్పిట పట్టడానికి డ్రాగన్‌ అనుసరిస్తున్న విధానాలపైనా బైడెన్‌, మోదీ చర్చించే అవకాశముంది. మరోవైపు, క్వాడ్‌ సదస్సుకు కొన్ని రోజుల ముందు బ్రిటన్‌, ఆస్ట్రేలియాలతో కలిసి 'ఆకస్‌' అనే కొత్త కూటమిని అమెరికా ప్రకటించింది. సాటి క్వాడ్‌ సభ్యదేశాలైన భారత్‌, జపాన్‌లకు అగ్రరాజ్యం ఇందులో చోటు ఇవ్వకపోవడం- రకరకాల ఊహాగానాలకు దారితీస్తోంది. ఆకస్‌ అనేది ప్రధానంగా రక్షణ కూటమి. దీనికింద అమెరికా నుంచి ఆస్ట్రేలియా అణు జలాంతర్గాములను కొనుగోలు చేస్తుంది. ఇండో పసిఫిక్‌లో పెరుగుతున్న చైనా యుద్ధ నౌకల కార్యకలాపాలను ప్రతిఘటించడానికి ఈ జలాంతర్గాములు ఉపకరిస్తాయి. బైడెన్‌కు ముందు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం క్వాడ్‌ను పూర్తిస్థాయి సైనిక కూటమిగా మార్చడానికి ప్రయత్నించినా, భారత్‌ దానికి సమ్మతించలేదు. దీంతో అమెరికా- ఆకస్‌ ఏర్పాటుతో ముందుకుసాగింది. దీనిపై చైనా రుసరుసలాడుతుండగా, భారత్‌ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఆకస్‌ వల్ల అమెరికా, ఆస్ట్రేలియాలతో తన సంబంధాలు ఏమాత్రం బలహీనపడవని, క్వాడ్‌ ప్రాముఖ్యం తగ్గదని భారత్‌ ధీమాగా ఉంది. ఏదో ఒక దేశానికి వ్యతిరేకంగా ఇతరులతో జట్టు కట్టకుండా, ఇండో పసిఫిక్‌లో అన్ని దేశాలతో సహకారం నెరపాలన్నది భారత్‌ విధానం. ఇండో పసిఫిక్‌ జలాల్లో అన్ని దేశాల నౌకలు స్వేచ్ఛగా సంచరించే వెసులుబాటు ఉండాలని, వివాదాలుంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారతదేశం భావిస్తోంది. క్వాడ్‌ దేశాధినేతల సమావేశం ఇండో పసిఫిక్‌, అఫ్గానిస్థాన్‌ సమస్యలను పరిశీలిస్తూనే చైనాపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నించవచ్చు. కొవిడ్‌ మహమ్మారి మూలాలను నిర్ధారించడంపైనా శ్రద్ధ పెడుతుంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన క్వాడ్‌ వర్చువల్‌ సమావేశంలో పేద దేశాలను కొవిడ్‌ టీకాలతో ఆదుకునే అంశం చర్చకు వచ్చింది. అమెరికా, జపాన్‌ నిధులతో భారతదేశంలో పెద్దయెత్తున అమెరికన్‌ టీకాలను ఉత్పత్తి చేసి, ఆస్ట్రేలియా రవాణా సౌకర్యాలను ఉపయోగించుకుని పేద దేశాలకు వాటిని సరఫరా చేయాలని నిశ్చయించారు.

ఉగ్రవాదంపై ఆందోళన

ఈ నెల 17న జరిగిన షాంఘై సహకార మండలి సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. పోనుపోను ఇంతలంతలవుతున్న ఉగ్రవాదం బెడద గురించి ఆయన మాట్లాడారు. అఫ్గాన్‌ పరిణామాల దరిమిలా శాంతిభద్రతలకు వాటిల్లే ముప్పు గురించి ప్రస్తావించారు. మధ్యాసియా దేశాలకు ఓడరేవులతో, ఇతరత్రా రవాణా అనుసంధానం కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. మధ్యాసియాలో అనుసంధాన ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు ఏ దేశ ప్రాదేశిక సార్వభౌమత్వానికీ భంగం కలగకుండా చూడాలని, పరస్పర సహకారంతో ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని సూచించారు. ఈ అంశాలు తాజా పర్యటనలోనూ ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. బైడెన్‌, క్వాడ్‌ అధినేతలతో సమావేశమైన తరవాత మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తారు. అక్కడా ఉగ్రవాద ముప్పు గురించి ప్రముఖంగా ప్రస్తావించవచ్చు. కొవిడ్‌ వల్ల ప్రపంచానికి ఎదురవుతున్న ఆర్థిక, సామాజిక సమస్యలను సమష్టిగా పరిష్కరించుకోవాలని పిలుపిచ్చే అవకాశమూ ఉంది. మానవాభ్యుదయం కోసం అధునాతన సాంకేతికతలను సమర్థంగా వినియోగించుకోవడంపైనా ప్రపంచ దేశాలతో ప్రధాని మోదీ తన ఆలోచనలను పంచుకోవచ్చు. ఐరాసలో, ముఖ్యంగా భద్రతా మండలి నిర్మాణంలో సంస్కరణలు తీసుకురావాలని ఆయన కోరనున్నారు. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారు అయిన భారతదేశం కొవిడ్‌ టీకాలను సాటి దేశాలతో పంచుకొంటోందని, మున్ముందు మరిన్ని టీకాలు సరఫరా చేయబోతోందని ప్రకటించవచ్చు. వాతావరణ మార్పుల నిరోధం, సుస్థిరాభివృద్ధి సాధనకు భారత్‌ చేస్తున్న కృషినీ వివరిస్తారు. అఫ్గాన్‌ పరిణామాలతో దేశ అంతర్గత భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు, దక్షిణాసియాపై పట్టు సాధించడానికి చైనా అనుసరిస్తున్న వ్యూహాల దృష్ట్యా మోదీ తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

చైనాపై చర్చలు

ముడి పదార్థాలు, పారిశ్రామికోత్పత్తుల రవాణాకు సంబంధించిన సరఫరా గొలుసులను చైనా నుంచి బయటకు తరలించే అంశంపై క్వాడ్‌ సమావేశం దృష్టి కేంద్రీకరిస్తుంది. కొవిడ్‌ వల్ల పారిశ్రామికోత్పత్తి, సముద్రం ద్వారా ఎగుమతి దిగుమతులు బాగా దెబ్బతిన్నాయి. దీంతో అన్నింటికీ డ్రాగన్‌ దిగుమతులపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో మిగిలిన ప్రపంచానికి తెలిసివచ్చింది. ఆ మేరకు చైనా నుంచి ఉత్పత్తి కార్యకలాపాలను వేరే దేశాలకు తరలించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. షింజియాంగ్‌లో మైనారిటీలపై చైనా దమననీతి సైతం ఈ సమావేశంలో చర్చకు వస్తుంది. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు, ఇస్లామిక్‌ స్టేట్‌, అల్‌ఖైదాల పట్టు పెరగడం చైనాలో ముస్లిం జనాధిక్య రాష్ట్రమైన షింజియాంగ్‌పై విస్తృత ప్రభావం చూపనుంది. ఇది డ్రాగన్‌పై ఒత్తిడి పెంచే అంశం. వాతావరణ మార్పులు, కీలక సాంకేతికతల గురించి క్వాడ్‌ కూలంకషంగా చర్చిస్తుంది. సైబర్‌ దాడులు, గూఢచర్యాలలో చైనా పాత్రను అడ్డుకొనే విషయాన్నీ పరిశీలిస్తుంది.

రచయిత- డాక్టర్ రాధా రఘురామపాత్రుని

(అంతర్జాతీయ వాణిజ్య రంగ నిపుణురాలు)

ఇదీ చూడండి:Joe Biden: సంక్షోభాలపై సమష్టి పోరుకు బైడెన్ పిలుపు

ABOUT THE AUTHOR

...view details