తెలంగాణ

telangana

ETV Bharat / opinion

వంటనూనెల విషయంలో స్వయంసమృద్ధమయ్యేలా... - పామాయిల్​ ఉత్పత్తి పెంపు దిశగా కేంద్రం

ప్రపంచంలో ప్రస్తుతం వంటనూనెల్ని అత్యధికంగా భారతే దిగుమతి చేసుకుంటోంది. దిగుమతి పద్దులోని వంటనూనెల్లో 55శాతం పామాయిలేనంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రంగాన స్వయం సమృద్ధి సాధించడానికి రూ.11వేల కోట్ల వ్యయ ప్రతిపాదనలతో జాతీయ మిషన్‌ పట్టాలకు ఎక్కించారు. ఇప్పటిదాకా పామాయిల్‌ సాగుదారులకు హెక్టారుకు రూ.12వేల వంతున ఇస్తున్న ప్రోత్సాహకాల్ని రూ.29వేలకు పెంచుతామంటున్నారు.

edible oils
వంట నూనెలు

By

Published : Aug 20, 2021, 8:51 AM IST

ప్రపంచంలో అమెరికా తరవాత అత్యధికంగా 39.46కోట్ల ఎకరాల సేద్యయోగ్య భూములు కలిగిన దేశం మనది. అయినా ఏటా 150 లక్షల టన్నుల దాకా వంటనూనెల్ని విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. నిత్యావసరాల జాబితాలోని వంటనూనెల వార్షిక ఉత్పత్తి దేశంలో 70-80లక్షల టన్నులే. దేశీయ అవసరాలకోసం ఇక్కడ ఉత్పత్తయ్యే రాశికి రెండింతల మేర దిగుమతి చేసుకుంటున్న కారణంగా ఏటేటా రూ.65వేల కోట్ల నుంచి 75 వేల కోట్ల రూపాయల వరకు విదేశమారక ద్రవ్యాన్ని గుమ్మరించక తప్పడంలేదు.

స్వయం సమృద్ధి సాధించడానికి..

దిగుమతి పద్దులోని వంటనూనెల్లో 55శాతం పామాయిలేనంటున్న ప్రధాని మోదీ ఈ రంగాన స్వయం సమృద్ధి సాధించడానికి రూ.11వేల కోట్ల వ్యయ ప్రతిపాదనలతో జాతీయ మిషన్‌ పట్టాలకు ఎక్కించారు. ఇప్పటిదాకా పామాయిల్‌ సాగుదారులకు హెక్టారుకు రూ.12వేల వంతున ఇస్తున్న ప్రోత్సాహకాల్ని రూ.29వేలకు పెంచుతామంటున్నారు. 2025-26 నాటికి 10లక్షల హెక్టార్లు, 2029-30 నాటికి 18లక్షల హెక్టార్ల వరకు విస్తీర్ణం పెంపొందిస్తామంటున్న కేంద్రం- ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్‌ దీవులకే ప్రాధాన్యం దక్కనుందంటోంది.

మూడు నెలల క్రితం రాష్ట్రాల్లో నూనెగింజ పంటల సాగుదారులకు అధిక దిగుబడులిచ్చే వేరుశనగ, సోయాచిక్కుడు విత్తనాలను మినీకిట్ల రూపంలో ఉచితంగా అందించదలచామని కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు పామాయిల్‌ సేద్యం ఇనుమడిస్తే దేశీయంగా వంటనూనెల అవసరాలు తీరిపోతాయని ప్రభుత్వం తలపోస్తున్నట్లుంది. ఏటా 85 లక్షల టన్నుల పామాయిల్‌ దిగుమతి చేసుకుంటూ, వచ్చే అయిదేళ్లలో 11.20 లక్షల టన్నుల ముడి పామాయిల్‌ ఉత్పత్తి లక్ష్యాన్నే అద్భుతంగా చిత్రిస్తోంది! విస్తృత అవసరాల దృష్ట్యా సంప్రదాయ నూనెగింజల సాగు విస్తీర్ణాన్ని, దిగుబడిని పెంపొందించే వ్యూహాలపై ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించడం తక్షణావసరం. వంటనూనెల రంగంలో పరాధీనతను చెదరగొట్టడానికి అదే రాజమార్గం!

భారతే అత్యధికం..

ఆంగ్లేయుల ఏలుబడిలో ఉండగా భారత్‌ నుంచి విదేశాలకు వంటనూనెలు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ప్రపంచంలో ఇండియాయే వంటనూనెల్ని అత్యధికంగా దిగుమతి చేసుకుంటోంది. ఆ రూపేణా కోశాగారం నుంచి తరలిపోతున్న వేలకోట్ల రూపాయల మొత్తం వాస్తవంలో రైతులకే చెందాలని 'నీతిఆయోగ్‌' మేధామథనంలో వ్యాఖ్యానించిన ప్రధాని నేడు జాతీయ మిషన్‌ బడ్జెట్‌ను అయిదేళ్లలో రూ.11వేలకోట్లకే పరిమితం చేయడం విస్మయపరుస్తోంది. ఎకరా భూమిలో (60-80) పామాయిల్‌ చెట్లు 1-2 టన్నుల దిగుబడి ఇస్తాయని అంచనా. దాంతో గత 40 ఏళ్లుగా ఆయిల్‌ పామ్‌ సాగుకు పెద్దపీట వేసిన మలేసియాలో 47శాతం, ఇండొనేసియాలో 16శాతం అటవీ విస్తీర్ణం తెగ్గోసుకుపోయింది. దేశీయంగానూ భూగర్భ జలమట్టాల క్షీణత, విస్తారంగా నిషేధిత రసాయనాల వినియోగం నమోదయ్యాయి.

పెడచెవిన పెట్టడం ఆనవాయితీగా..

నూతన జాతీయ మిషన్‌ అమలులో ఈ కీలకాంశాల్నీ పరిగణించాలి. దిద్దుబాటు వ్యూహంలో నేలల ఎంపిక మరింత ముఖ్యాంశం. ఏ రకం భూముల్లో ఎటువంటి పంటలు అనుకూలమో, ఎరువుల వాడకం నీటి నిర్వహణ ఎలా ఉండాలో స్వామినాథన్‌ వంటి నిపుణులెందరు సూచించినా ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడం ఆనవాయితీగా మారింది. హెక్టారుకు 2.8 టన్నుల సోయాచిక్కుడు దిగుబడిని బ్రెజిల్‌ సాధిస్తుండగా, ఇండియాలో 1.13 టన్నులే నమోదవుతోంది. సుమారు 3.8 టన్నుల వేరుశనగ దిగుబడి అమెరికా పేరిట రికార్డవుతుంటే, దేశీయంగా అది కేవలం 1.21 టన్నులే. పొద్దుతిరుగుడు పంట సాగులో ఫ్రాన్స్‌ పొందుతున్న 2.42 టన్నుల సగటులో మూడోవంతు కన్నా తక్కువే ఇక్కడ సాధ్యపడుతోంది. ఇతోధిక దిగుబడుల సాధనకు వ్యవస్థాగత తోడ్పాటు, గింజ స్థాయి నుంచి నూనెల తయారీ వరకు భిన్న అంచెల్లో అధునాతన సాంకేతికత, సమగ్ర బీమా సహేతుక పరపతి సమర్థ మార్కెటింగ్‌ సదుపాయాల పరికల్పన... ఇవే- దేశానికి 'ఆత్మనిర్భరత' ప్రసాదించగలిగేవి!

ఇదీ చూడండి:పామాయిల్​ రైతులకు గుడ్​న్యూస్- భారీగా పెట్టుబడి సాయం

ఇదీ చూడండి:వంటనూనెల కొరతను అధిగమించడం ఎలా?

ABOUT THE AUTHOR

...view details