ప్రపంచంలోనే అత్యంత భారీ పంటల బీమా పథకాల్లో ఒకటైన 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)' 2016 ఫిబ్రవరిలో ప్రాణం పోసుకుంది. బీమా కవచంతో పంట నష్టాల నుంచి రైతుకు రక్షణ కల్పించడమే దీని ధ్యేయం. రైతులు చెల్లించే ప్రీమియం అతి తక్కువగా ఉండేలా రాయితీలు కల్పిస్తూ పథకాన్ని రూపుదిద్దారు. ఖరీఫ్‌లో వేసే పంటలకు రెండు శాతం, రబీలో పండించే ఆహార ధాన్యాలు, నూనె గింజల పంటలకు 1.5 శాతం నామమాత్రపు ప్రీమియం నిర్ణయించారు. వార్షిక వాణిజ్య పంటలకు వ్యవసాయదారులు చెల్లించాల్సిన గరిష్ఠ ప్రీమియం అయిదు శాతానికి మించి లేదు. వాస్తవ ప్రీమియం రేట్లకు రైతు చెల్లించే వాటికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని కేంద్రం, రాష్ట్రం చెరిసగం భరించాలి. ప్రతికూల వాతావరణం, చీడపీడలు, కోతల అనంతర నష్టాలు వంటి విభిన్నమైన నష్టభయాల నుంచి రక్షణ నిమిత్తం బీమా సదుపాయం లభిస్తుంది. ప్రాంతం వారీగా పంట నష్టం అంచనా వేస్తారు. ప్రధాన పంటలకు గ్రామ పంచాయతీ ప్రాంతాన్ని యూనిట్‌గా తీసుకుంటున్నారు.
రాష్ట్రాల వెనుకంజ
ఖరీఫ్, రబీ రెండింటికీ కలిపి 2017-18 ఆర్థిక సంవత్సరంలో 5 కోట్లకు పైగా వ్యవసాయదారులు పీఎంఎఫ్‌బీవై కింద నమోదయ్యారు. తొలి బీమా పథకాలు అందుబాటులోకి వచ్చిన 2015తో పోల్చితే వీరి సంఖ్య దాదాపు 40 శాతం అధికం. అయితే, రాష్ట్రాల వ్యాప్తంగా ఇదెంతవరకు పకడ్బందీగా అమలవుతోందనే అంశంపై అనుమానాలున్నాయి. మరోవైపు, కొన్ని రాష్ట్రాలు ఈ పథకం నుంచి వైదొలగుతున్నాయి. బీమా సంస్థలు అసాధారణంగా రూ.4,500 కోట్ల ప్రీమియం డిమాండు చేస్తున్నాయని చెబుతూ గుజరాత్ ఇప్పటికే తప్పుకుంది. సీఎం విజయ్ రూపాని కేంద్ర పథకం స్థానంలో ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన పథకాన్ని రాష్ట్ర నిధులతో ఏర్పాటు చేశారు. పైసా ప్రీమియం వసూలు చేయకుండా రైతులందరినీ అందులో చేర్చి 2020 ఖరీఫ్ సీజనుకు రూ.1700-1800 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించింది. పంజాబ్ అసలెన్నడూ పీఎంఎఫ్‌బీవై అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు తాము దీనినుంచి వైదొలగుతున్నట్లు ఈ ఏడాది ఆరంభంలోనే కేంద్రానికి లేఖలు పంపించాయి. పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలు తమ వంతు వాటా ప్రీమియం చెల్లించడంలో విపరీత జాప్యం చేశాయి. దీంతో రైతాంగం బీమా పరిహారం పొందే వీల్లేకుండా పోయింది. అన్ని చెల్లింపులూ సవ్యంగా ఉన్న రాష్ట్రాల్లో బీమా సంస్థలు కొర్రీలు వేస్తున్నాయి. 2019 సీజనులో కర్షకులు క్లెయిము చేసిన దాంట్లో మూడో వంతు మాత్రమే బీమాగా చెల్లించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఇలా నీరుగారిపోయి చివరకు రైతులకన్నా బీమా కంపెనీలే అధిక లబ్ధి పొందుతున్నాయన్న భావనకు దారితీసింది. ఇలాంటి పరిణామాలు- అధికభాగం కుటుంబాలకు వ్యవసాయమే ఆధారంగా ఉన్న ఈ దేశంలో పేదరికంపై పోరాడుతున్న కర్షకులకు సంపూర్ణ మద్దతు అందించాల్సిన అవసరాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే పంటల బీమా పథకం పక్కాగా అమలయ్యేలా తగిన విధానం తక్షణమే రూపొందాల్సి ఉంది.
ఎంపిక చేసిన తొమ్మిది రాష్ట్రాల్లో పంటల బీమా పథకం అమలు జరుగుతున్న తీరుపై అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) విద్యాసంస్థ కేంద్ర వ్యవసాయ, రైతాంగ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అధ్యయనం ప్రకారం- దేశవ్యాప్తంగా రైతుల్లో ఈ పథకంపై అవగాహన చాలా తక్కువగా ఉంది. అవగాహన కల్పనలో పశ్చిమ్ బంగ పంచాయతీ వ్యవస్థ ముందంజలో ఉండగా, అసోమ్‌లో బ్యాంకులు కీలక పాత్ర వహించాయి. బీమా ఏజెంట్ల పాత్ర చాలా రాష్ట్రాల్లో నామమాత్రంగా ఉంది. రాతకోతల పనికి పట్టే సమయం చాలా ఎక్కువగా ఉందని, దీన్ని తగ్గించాలని రైతులు కోరుతున్నారు. పరిహారం పెంపు, పారదర్శకత, పశుసంపదకు వాటిల్లే నష్టాన్ని చేర్చడం, పంచాయతీ వ్యవస్థకు అధిక పాత్ర కల్పన వంటి సలహా సూచనలు వారు చేశారు. నష్టం మదింపు అనంతరం ఆరు వారాల్లో పరిహారం చెల్లించేట్లయితే... పీఎంఎఫ్‌బీవై తరహా పథకానికి ఇప్పుడు వర్తింపజేసిన దానికంటే చాలా ఎక్కువగా 10 శాతం వరకు ప్రీమియం చెల్లించడానికి సాగుదారులు సిద్ధంగా ఉన్నారన్నది ఐఐఎం అధ్యయనంలో వెల్లడైన కీలకాంశం.
మార్పులు అవసరం..