గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయ కార్మికుల కోసం జారీ చేసిన కనీస సిఫార్సు వేతనాల విధానాన్ని పునస్సమీక్షించేది లేదని- కేంద్ర విదేశీవ్యవహారాల శాఖ సహాయమంత్రి మురళీధరన్ ఇటీవల లోక్‌సభలో చెప్పిన సమాధానం లక్షలాది కార్మికులు, వారిపై ఆధారపడిన కుటుంబాలకు తీరని వేదన కలిగించింది. ఆరు నెలల క్రితం కేంద్రం ఏకపక్షంగా జారీ చేసిన కనీస వేతనాల ఉత్తర్వులతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్, బహరైన్ దేశాల్లో ప్రవాసులైన కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. గల్ఫ్ దేశాలు భారత్‌కు చెందిన శ్రమజీవులకు అయిదు దశాబ్దాలుగా ఉపాధి కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడ ఉపాధి లేమి, కరవు కాటకాలతో తల్లడిల్లే వారికి అక్కడ ఆసరా లభించింది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాలు ఉన్నత విద్యావంతులను ఆకర్షించగా.. ఎలాంటి విద్యార్హతలు, నైపుణ్యాలు లేకపోయినా అక్కడ పనిచేసే అవకాశం ఉండటం సానుకూలంగా మారింది. రూపాయి మారక విలువ గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఉండటంతో మంచి వేతనాలు లభిస్తాయనే ఆశతో లక్షల మంది వలస వెళ్లారు. సాధారణంగా ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లడానికి వీసా, పాస్‌పోర్టులు తప్పనిసరి. కంపెనీల తరపున వీసాలు వస్తేనే ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది. సందర్శక, పర్యాటక వీసాలను అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లోనూ కొందరు కార్మికులను గల్ఫ్‌కు పంపుతున్నారు.
తీవ్రమైన శ్రమ దోపిడి
గల్ఫ్‌లోని భారతీయ కార్మికులు ఆది నుంచి శ్రమదోపిడికి గురవుతున్నారు. చట్టాలు సైతం ఆయా దేశాల పౌరులకు ఒక రకంగా, ప్రవాసులకు మరో రకంగా ఉన్నాయి. ఏ కార్మికుడికైనా రోజువారీ లేదా నెలవారీ వేతనాలు ఇవ్వాలి. గల్ఫ్ దేశాల్లో ఇది అమలు జరగడం లేదు. ఏజెంట్లు- కంపెనీలతో కుమ్మక్కై అతి తక్కువ వేతనాలకు కార్మికులను పంపిస్తున్నారు. స్థిరమైన ఉద్యోగాలూ లభించడం లేదు. ఉద్యోగ భద్రత గగనమే. కంపెనీ వీసాలు కాకుండా.. సందర్శక వీసాలపై వచ్చిన వారికి గడువు తీరాక కష్టాలు మొదలవుతున్నాయి. కంపెనీలు స్వార్థ ప్రయోజనాల కోసం వారిని వాడుకుంటున్నాయి. వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకొని అతి తక్కువ వేతనాలు ఇస్తూ పనులు చేయించుకొంటున్నాయి. మరి కొన్ని కంపెనీలు వేతనాలివ్వడంలో నెలల తరబడి జాప్యం చేస్తున్నాయి. ఎక్కువ వేతనాలు అడిగితే వేధిస్తున్నాయి.
వీసాలు, పాస్‌పోర్ట్‌లు లేకుండా అక్రమంగా ఉన్నారంటూ- ప్రవాస భారతీయులపై పోలీసులకు ఫిర్యాదు చేసి జైళ్లకు పంపిస్తున్నాయి. పదేళ్లుగా ఏటా సగటున 12 వేల మందికి పైగా జైళ్లలోనే ఉంటున్నారు. జరిమానాలను పెద్దయెత్తున చెల్లించాల్సి వస్తోంది. పస్తులుండటం, మానసిక, శారీరక సమస్యల వల్ల ఏటా అయిదు లక్షల మందికి పైగా అనారోగ్యం, ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రతి సంవత్సరం రెండున్నర వేల మందికి పైగా భారతీయ కార్మికులు ఆయా దేశాల్లో మరణిస్తున్నారు. మొదట్లో కార్మికులు తమ కుటుంబాలకు డబ్బులను గల్ఫ్ దేశాల నుంచి పంపించే వారు. ఇప్పుడు వారికే ఇక్కడి నుంచి డబ్బు పంపాల్సిన దుస్థితి నెలకొంది. మన దేశం నుంచి కార్మికులు రుసుములు చెల్లించి, విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నా... గల్ఫ్‌లో వారి నమోదు ప్రక్రియ జరగడం లేదు. అక్కడ వారికి బీమా లేదు. పోలీసు స్టేషన్లకు వెళ్లాలంటే భయం. ఆయా దేశాల్లోని రాజధాని నగరాల్లోనే రాయబార కార్యాలయాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రాంతీయ భాషలున్న రాష్ట్రాల కార్మికులు రాయబార కార్యాలయాలకు వెళ్లితే అక్కడ భాషాసమస్యలు ఎదురవుతున్నాయి తప్ప బాధలు తీరడం లేదు.
ఉత్తర్వులపై నిరసనలు