మనిషి జీవన శైలి రోజు రోజుకూ మరింత సౌకర్యవంతంగా మారుతోంది. ఈ క్రమంలో విపణిలోకి విపరీతంగా వస్తున్న అనేక ప్లాస్టిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు కొంత కాలానికి వ్యర్థాలై గుట్టలుగా పోగుపడుతున్నాయి. అందులో పునర్వినియోగానికి పనికిరాకుండా పోతున్నవే అధికంగా ఉంటున్నాయి. భారత్‌లో చాలా పురపాలక సంఘాల్లో ఇప్పటికీ పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ప్రత్యేక డంపింగ్ యార్డుల్లేవు. అమెరికా వంటి దేశాల్లో బ్యాటరీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను విడిగా ఉంచడానికి, త్వరగా వాటిని పునర్వినియోగంలోకి తేవడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. కొవిడ్ లాక్‌డౌన్లతో గాలిలో ప్రమాదకర కార్బన్‌డయాక్సైడ్ శాతం కొంత తగ్గుముఖం పట్టిందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదే తరుణంలో ఘన, జీవ వ్యర్థాలు బాగా పేరుకుపోయాయి. దేశంలో 1990లో 2300 కోట్ల టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. 2020 నాటికి అవి 7800 కోట్ల టన్నులకు పెరిగాయి. 2050 నాటికి దాదాపు 13వేల కోట్ల టన్నులకు అవి చేరతాయని అంచనా! పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాత్కాలిక వినియోగానికి సంబంధించిన ఉత్పత్తులు విపరీతంగా మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వాటి మూలంగా పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతోంది.
ఎంత తగ్గితే అంత మేలు..
ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న ప్లాస్టిక్ వస్తువుల్లో దాదాపు సగం ఒకసారి వాడి పడేసేవే ఉంటున్నాయి. ప్లాస్టిక్ సంచిని వాడి పడేశాక, మట్టిలో కలవకుండా అది దశాబ్దాలపాటు అలాగే ఉంటుంది. నదులు, సముద్రాల్లోకి చేరి అక్కడి జీవజాలానికీ హాని చేస్తుంది. ప్యాకింగ్ కోసం తయారవుతున్న ప్లాస్టిక్‌లో పునర్వినియోగానికి అక్కరకొచ్చేది కేవలం 14శాతమేనని ప్రపంచ ఆర్థిక సంస్థ, ఎలెన్‌మ్యాక్ ఆర్థర్ ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. అందులోనూ కచ్చితంగా పునర్వినియోగంలోకి వస్తోంది కేవలం రెండు శాతమే! అలా మిగిలిపోతున్న వ్యర్థాలు సముద్రంలో, నేల మీద గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం సముద్రాల్లో 15 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడ్డాయి. వివిధ అధ్యయన నివేదికల ప్రకారం 2025 నాటికి సముద్రాల్లో ప్రతి మూడు టన్నుల చేపలకు ఒక టన్ను ప్లాస్టిక్ ఉంటుంది. 2050 నాటికి ఈ నిష్పత్తి మరింత పెరగబోతోందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పర్యావరణానికి తీవ్ర హాని చేస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని కట్టడి చేయడానికి... ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల పూర్తిగా నిషేధం విధించింది. వచ్చే ఏడాది జులై ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. నిషేధం విధివిధానాలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటికే రాష్ట్రాలకు సమాచారమిచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ విపరీతంగా పెరుగుతోంది. దాని పర్యవసానాలు కొత్త సమస్యలకు దారితీస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల మూలంగా గాలి, నేల, భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. ఎంత శ్రమించినా ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న ప్లాస్టిక్‌లో 2040 నాటికి కేవలం 42శాతాన్నే పునర్వినియోగంలోకి తేగలమని ప్రపంచ ఆర్థిక సంస్థ హెచ్చరిస్తోంది. ప్లాస్టిక్ వినియోగాన్ని ఎంత తగ్గిస్తే పుడమికి అంత మేలు జరుగుతుంది. ఆ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వైపు ప్రజలు ఇప్పుడిప్పుడే ఆకర్షితులవుతున్నారు. అమెరికాకు చెందిన కెర్నీ ఎర్త్‌డే సంస్థ ఇటీవల చేపట్టిన ఒక సర్వేలో పాల్గొన్న వారిలో 48శాతం పర్యావరణాన్ని సంరక్షించుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తులనే వినియోగిస్తామని 55శాతం తెలిపారు. మహమ్మారి సమయంలో ఇదే సంస్థ చేపట్టిన మరో సర్వే- వినియోగదారుల్లో వస్తున్న మార్పునకు అద్దంపట్టింది. పునర్వినియోగ సంచులను కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.