Plastic Effects On Pregnancy :వినియోగం ఇంతలంతలై గాలిలో నీటిలో భూమిపై ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నకొద్దీ, వాటివల్ల వాటిల్లే అనర్థాల పద్దూ విస్తరిస్తోంది. మానవ శరీరంలోకి ప్లాస్టిక్ చేరితే సంతాన సమస్యలు తలెత్తుతాయన్న జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్) తాజా అధ్యయనాంశాలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే బీపీఏ రసాయనం గర్భిణుల శరీరంలోకి చేరితే- వారికి పుట్టే మగ సంతానంలో మున్ముందు వీర్య నాణ్యత దెబ్బతింటుందన్న హెచ్చరిక- సంక్షోభ తీవ్రతను చాటుతోంది. నేడు ప్లాస్టిక్ వస్తూత్పాదనలు, వాటి మూలాన దుష్ప్రభావాలు... సర్వవ్యాప్తం. మనదేశంలో చనిపోతున్న ప్రతి ఆవు, గేదె పొట్టలో కనీసం 30 కిలోల ప్లాస్టిక్ ఉంటున్నదని లోగడ కేంద్ర మంత్రే వాపోయిన ఉదంతం- ప్రాణాంతక వ్యర్థాల ఉరవడికి నిలువుటద్దం.
Plastic Effects On Human Body :మైక్రోప్లాస్టిక్, నానో ప్లాస్టిక్స్ పెద్దయెత్తున జలచరాలనూ పొట్టన పెట్టుకుంటున్నాయి. వాటిని భుజించిన మనుషులకూ ఆరోగ్య సమస్యలెన్నో దాపురిస్తున్నాయి. ముఖ్యంగా తీరప్రాంతవాసుల ఊపిరితిత్తులు, కాలేయం, ప్లీహం, మూత్రపిండాల్లో మైక్రోప్లాస్టిక్ ఉనికి వైద్య నిపుణుల్ని బెంబేలెత్తిస్తోంది. వాటివల్ల క్యాన్సర్ల ముప్పు పెచ్చరిల్లుతుందన్న హెచ్చరికలు లోగడే వెలుగుచూశాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు గాలిలో ఉన్నా, భూగర్భ జలాల్లోకి చేరినా- మానవ దేహాల్లోకి చొచ్చుకుపోయి శరీర కణాల్ని, డీఎన్‌ఏను దెబ్బతీస్తాయని పరిశోధకులు గతంలోనే ప్రమాద ఘంటికలు మోగించారు. మానవ రక్తనాళాల్లోకి సూక్ష్మప్లాస్టిక్ ప్రవేశించిందని నిరుడు నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు నిర్ధరించారు. అవి గుండెవరకు వెళ్లాయని ఇటీవల చైనా అధ్యయనం ధ్రువీకరించింది. పిండ దశలోనే ఎదుగుదలను కుంగదీసే ప్రతినాయక పాత్రనూ ప్లాస్టిక్ వ్యర్థాలు పోషించగలవన్న ఎన్‌ఐఎన్ సరికొత్త శోధన ఫలితం- తక్షణ దిద్దుబాటు చర్యల అత్యావశ్యకతను ఉద్బోధిస్తోంది!
Plastic Effects On Human Health :ప్రస్తుతం మనం చూస్తున్న ప్లాస్టిక్ సుమారు వందేళ్లక్రితం లియో బేక్‌లాండ్ రసాయన ప్రయోగాలనుంచి ఆవిర్భవించింది. ఇప్పుడది కాఫీ కప్పులనుంచి కంప్యూటర్ల వరకు అనేకానేక రూపాల్లో సర్వత్రా ఉనికిని చాటుకుంటోంది. 2050నాటికి మహాసముద్రాల్లోని మత్స్యసంపదకన్నా ప్లాస్టిక్ వ్యర్థాల బరువే అధికంగా ఉంటుందన్న విశ్లేషణలే చెబుతాయి- అవెంతగా విక్రమించి మహాకాలుష్య పెనుముప్పును ఎలా ప్రజ్వరిల్లజేస్తున్నాయో! పాపీ చిరాయువు అనే సామెత ప్లాస్టిక్ వ్యర్థాలకూ వర్తిస్తుంది. అరటితొక్క సుమారు ఇరవై రోజుల్లోనే నేలలో కలిసిపోతుంది. చెరకు పిప్పి శిథిలం కావడానికి రెండునెలలు పడుతుంది. అదే ప్లాస్టిక్ అయితే... వెయ్యేళ్లు! ఆలోగా వ్యర్థాలు సృష్టించే వినాశనం ఇంతా అంతా కాదు. వాననీరు భూమిలో ఇంకకుండా అడ్డుకునే ప్లాస్టిక్ వ్యర్థాలే పలుచోట్ల వరదబీభత్సానికి ప్రధాన కారణమవుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో పక్షులు, తాబేళ్లు, ఎన్నో జలచరాలు తరిగిపోవడానికీ అవే పుణ్యం కట్టుకుంటున్నాయి.