తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సర్కారీ వైద్యానికి సమగ్ర చికిత్స

'అందరికీ ఆరోగ్యం' అనే హామీ ప్రకటనలకే పరిమితమవుతుందే తప్ప వాస్తవరూపం దాల్చడం లేదు. 70ఏళ్ల గణతంత్ర రాజ్యంలో ఇప్పటికీ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల కొరత వేధిస్తూనే ఉంది. సరైన వైద్యవసతులు లేక ఏటా సుమారు 5కోట్ల మందివరకు పేదరికంలోకి వెళ్తున్నారు. కరోనా మహమ్మారితో ఈ మహా సంక్షోభం మరింత బట్టబయలైంది. తెలుగురాష్ట్రాల్లో బస్తీ దవాఖానాల ద్వారా విస్తృత సేవలపై ఆశలు రేపుతున్నా.. మౌలిక వసతులు కరవయ్యాయి. భావి ధన్వంతరుల సృష్టికి, ప్రతి అంచెలోనూ రోగుల తాకిడికి తగ్గట్లు మౌలిక సదుపాయాల పరికల్పనకు- ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వెయ్యాలి!

PLAN SHOULD BE MADE TO INCREASE INFRASTRUCTURE IN GOVERNMENT HOSPITALS
సర్కారీ వైద్యానికి సమగ్ర చికిత్స

By

Published : Sep 23, 2020, 7:37 AM IST

దశాబ్దాలుగా నేతాగణం హామీలూ ప్రకటనల్లో 'అందరికీ ఆరోగ్యం' ఎంతగా మోతెక్కుతున్నా, వాస్తవంలో అది అందని భాగ్యంగా నిరూపితమవుతూనే ఉంది. సుమారు ఏడు దశాబ్దాల గణతంత్ర భారతంలో ప్రాథమిక వైద్యసేవలకైనా నోచక పల్లెపట్టులు అల్లాడుతున్నాయి. ధర్మాసుపత్రుల్లో తగిన వైద్యవసతికి దిక్కు లేక ఏటా అయిదు కోట్ల మంది వరకు పేదరికంలోకి జారిపోతున్న దుర్భర దృశ్యాన్ని కొవిడ్‌ మహా సంక్షోభం మరింతగా ప్రజ్వరిల్లజేసింది! తమ జీవితకాలంలో ఏనాడూ స్పెషలిస్ట్‌ డాక్టర్ని చూడని భారతీయులు 70కోట్లమంది దాకా ఉంటారని అంచనా. 'ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య అభియాన్‌' వంటి పథకాల పేరిట పేదలందరికీ ఉచిత వైద్యం సమకూరుతుందంటున్నా- 80శాతం మేర వైద్యులు పట్టణాలకే పరిమితం కావడం, గ్రామీణ భారతాన్ని ఏళ్లతరబడి కుంగదీస్తోంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా- ఎండీ లేదా ఎంఎస్‌ పట్టాను లక్షించిన ప్రతి పీజీ వైద్యవిద్యార్థీ మూడునెలలపాటు జిల్లా ఆస్పత్రుల్లో విధిగా సేవలందించాలని కేంద్ర ప్రభుత్వ సరికొత్త గెజెట్‌ నోటిఫికేషన్‌ నిర్దేశిస్తోంది.

దీర్ఘకాలిక కార్యచరణ చేపడితేనే..

'జిల్లా రెసిడెన్సీ కార్యక్రమం(డీఆర్‌పీ)'గా వ్యవహరించే నూతన ప్రణాళిక స్ఫూర్తికి పట్టం కడితే ప్రతి జిల్లా ఆస్పత్రిలో ఏ సమయంలోనైనా 4-8 మంది పీజీ వైద్య విద్యార్థులు విధులు నిర్వర్తిస్తుంటారని, తదనుగుణంగా మెడికల్‌ కళాశాలల్లో సీట్ల పెంపుదలకూ వీలు కలుగుతుందంటున్నారు. గాలిలో దీపంలా మారిన గ్రామీణ వైద్యం కుదురుకోవడమన్నది దీంతోనే సాధ్యపడుతుందా? ఎంబీబీఎస్‌ తరవాత చదువు కొనసాగించదలచిన ప్రతి వైద్యవిద్యార్థీ కొన్నాళ్లు గ్రామాల్లో తప్పనిసరిగా సేవలందించాల్సిందేనని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు షరతు విధిస్తున్నాయి. చాలాచోట్ల ఆచరణలో నీరోడుతున్న 'గ్రామసేవ' పరిధిని దేశవ్యాప్తంగా రెండేళ్లుగా స్థిరీకరించాలని ఆమధ్య సర్వోన్నత న్యాయస్థానం గిరిగీయడం తెలిసిందే. పల్లెపట్టుల్లో ప్రాథమిక వైద్యసేవలు మెరుగుపడి, కనీసం తాలూకా స్థాయిలోనైనా స్పెషలిస్ట్‌ డాక్టర్ల సేవలు అందుబాటులోకి వస్తేనే- కోట్లమంది గ్రామీణులు తెరిపిన పడతారు. అందుకనుగుణంగా దీర్ఘకాలిక కార్యాచరణను ప్రభుత్వాలు పట్టాలకు ఎక్కించడంలో ఇక ఎంతమాత్రం జాప్యం పనికిరాదు!

పెరిగిపోతున్న వైద్య కొలువులు

సరైన వైద్యసేవలు అందని కారణంగా దేశంలో ఏటా 24 లక్షలమంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్న దయనీయ దురవస్థను పార్లమెంటరీ స్థాయీసంఘమే ధ్రువీకరించింది. రాజ్యాంగం దఖలుపరచిన 'జీవించే హక్కు' ఇలా కొల్లబోతుండటానికి, కొరతల కోమాలో అచేతనమైన ప్రజారోగ్యరంగం శాయశక్తులా పుణ్యం కట్టుకుంటోంది. స్వస్థ సేవల లభ్యత, నాణ్యతల ప్రాతిపదికన 195 దేశాల జాబితాలో భారత్‌ 145వ స్థానాన ఈసురోమంటోంది. ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు నిర్దేశిస్తుండగా- ఇండియాలో ఆ నిష్పత్తి 1:1445గా ఉన్నట్లు కేంద్రమే నిరుడు పార్లమెంట్లో ప్రకటించింది. ఏడున్నర లక్షలమందికిపైగా డాక్టర్ల కొరత ఒక్కటే కాదు- 20శాతందాకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, 30శాతం మేర సామాజిక స్వాస్థ్య కేంద్రాలకు లోటు దేశ ఆరోగ్య రంగాన్ని కృశింపజేస్తోంది. నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది ఖాళీలూ పెద్దయెత్తున పోగుపడి ఉన్నాయి.

మౌలిక వసతులేవీ?

ఏపీలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణలో బస్తీ దవాఖానాల ద్వారా విస్తృత సేవలపై ఆశలు మోసులెత్తుతున్నా- క్షేత్రస్థాయిలో మౌలిక సమస్యలు వెక్కిరిస్తున్నాయి. దేశీయంగా అల్లోపతీ డాక్టర్లలో 57శాతం వైద్యపరమైన అర్హతలు లేనివారేనని సర్కారీ గణాంకాలే చాటుతుండగా- లక్షన్నరకు పైబడిన ఉపకేంద్రాలు, సుమారు పాతికవేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు అనేక జిల్లా ఆస్పత్రుల్లో సైతం పరికరాలకు, మందులకు నిత్యక్షామం వర్ధిల్లుతోంది. ఈ దుస్థితి రాత్రికిరాత్రి, అరకొర చర్యలతో మటుమాయమయ్యేది కాదు. భావి ధన్వంతరుల సృష్టికి, ప్రతి అంచెలోనూ రోగుల తాకిడికి తగ్గట్లు మౌలిక సదుపాయాల పరికల్పనకు- ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వెయ్యాలి!

ఇదీ చదవండి:రేపు కోహ్లీతో మోదీ భేటీ.. ఫిట్​ ఇండియాపై చర్చ!

ABOUT THE AUTHOR

...view details