బంకుల దగ్గరకు వెళితే చాలు, జేబులు భగ్గుమనేలా మండుతున్న పెట్రోధరలు దేశవ్యాప్తంగా జనసామాన్యాన్ని భీతిల్లజేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 24 విడతలుగా నిన్న మినహాయించి అంతక్రితం వరసగా 12 రోజులపాటు పెరుగుతూ పోయిన పెట్రోల్, డీజిల్ ధరల ఉరవడి మున్నెన్నడూ కనీవినీ ఎరుగనిది. నిరుడు విరుచుకుపడిన కొవిడ్ మహమ్మారి జనజీవనాన్ని దుర్భర దుఃఖభాజనం చేసిన నేపథ్యంలో- కాలూచేయీ కూడదీసుకొనే వీల్లేకుండా సామాన్యులపై పెట్రో ధరాఘాతాలు సామాజిక ఆర్థిక సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయి.
విత్తమంత్రి ధర్మసంకటం!
ధరల తగ్గింపు వినా వేరే సమాధానం ఏదీ ఎవరికీ రుచించదంటూనే తాను మహా ధర్మ సంకటాన్ని ఎదుర్కొంటున్నట్లు కేంద్ర విత్తమంత్రి నిర్మల సెలవిచ్చారు. పెట్రో ఉత్పాదనల రేట్లను అంతర్జాతీయ ధరవరలతో అనుసంధానించినందున వాటి నియంత్రణ తమ చేతుల్లో లేదంటూ రిటైల్ రేట్లను హేతుబద్ధ స్థాయికి తెచ్చేందుకు కేంద్రం రాష్ట్రాలూ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషించారు. 2017 లగాయతు పెట్రో ధరల రోజువారీ సవరణకు పచ్చజెండా ఊపిన కేంద్రం- అంతర్జాతీయ విపణి ఆటుపోట్లు అంటూ చెబుతున్నది అర్ధసత్యం. కొవిడ్ కారణంగా నిరుడు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ కుంగి చమురు పీపా ధర 20 డాలర్లకు పడిపోయినప్పుడు- ఆ మేరకు దేశీయంగా ధరలు దిగిరాకుండా అడ్డగోలుగా ఎక్సైజ్ సుంకాల్ని పెంచి సామాన్యుడికి బదిలీ కావాల్సిన లాభాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జుర్రేసుకొన్నాయన్నదే వాస్తవం. కొవిడ్ రాకముందు లీటరు పెట్రోలుపై రూ.19.98గా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని కరోనా కాలంలో రూ.32.98కి, అదే డీజిల్‌పై రూ.15.83గా ఉన్నదాన్ని రూ.31.83కు కేంద్రం పెంచేయగా- రాష్ట్రాలూ తమ హస్తలాఘవం ప్రదర్శించాయి. 89శాతం ముడిచమురు, 53శాతం గ్యాస్ కోసం దిగుమతులపై ఆధారపడక తప్పని పరిస్థితుల్లో కొద్దిపాటి సర్దుబాట్లకు సిద్ధపడే జనవాహిని నేడు ప్రశ్నిస్తోంది- కరవులో అధిక మోసాన్ని!
రామ జన్మభూమిలో ఇలా..