వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కు అని 2017లో జస్టిస్ పుట్టస్వామి కేసులో తొమ్మిది మంది సభ్యుల సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తేల్చిచెప్పింది. ఓ వ్యక్తికి సంబంధించిన ఏ అంశాన్నయినా వారికి తెలియకుండా సేకరించడం, సంభాషణలను చాటుగా వినడం ఇవన్నీ గోప్యతకు భంగం కలిగించే చర్యలే. గోప్యత అనేది ప్రస్తుతం మాటలకే పరిమితమైంది. తమ ఇష్టాయిష్టాల గురించి సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు మొదలుకొని, రైలు టికెట్ల రిజర్వేషన్ కోసం ఇచ్చే వ్యక్తిగత వివరాలు, చిరునామా వరకు అన్నీ ఇవాళ నడిబజారులో దొరికేస్తున్నాయి. క్రెడిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలు వంటి ఆర్థిక వివరాలు కూడా బహిర్గతమవడం వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. పౌరుల వ్యక్తిగత, ఆర్థిక, సామాజిక సమాచారాన్ని దుర్వినియోగం చేసే ఇలాంటి ఘటనలు ఇటీవల పెరిగిపోతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది.
అన్నీ బహిర్గతం
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోని తొమ్మిది లక్షల మంది రైలు ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు, చిరునామాలతో సహా 2019లో లీకయ్యాయి. డార్క్‌నెట్‌లో అవన్నీ ఉచితంగా అందుబాటులో పెట్టేశారు. ఎయిర్ ఇండియా ప్యాసింజర్స్ సిస్టమ్ ప్రొవైడర్ అయిన స్విట్జర్లాండ్ కంపెనీ 'సిటా' సర్వర్ నుంచి ఇటీవల ఏకంగా 45లక్షల మంది విమాన ప్రయాణికుల వివరాలు బయటికి పొక్కాయి. వారి ఊరు, పేరు, పాస్‌పోర్టు, ఫోన్ నంబర్లు, టికెట్లు కొనడానికి ఉపయోగించిన క్రెడిట్ కార్డుల వివరాలతోపాటు అన్నీ బహిర్గతమైపోయాయి. గతేడాది లాక్‌డౌన్ సమయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సర్వర్‌పై సైబర్ దాడులు జరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థ కార్యకలాపాలు ఒక రోజంతా నిలిచిపోయాయి. డొమినోస్ పిజ్జాకు చెందిన 1,317 దుకాణాల నుంచి ఏకంగా 18 కోట్ల మంది వినియోగదారుల ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు, చిరునామాలు బయటకు పొక్కాయి. దీంతో అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్లు, సందేశాలు వస్తున్నాయని వినియోగదారుల నుంచి పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రోజువారీ వ్యవహారాలను కూడా సాంకేతిక పరిజ్ఞానంతో సులువుగా చక్కబెట్టుకుంటున్న వేళ ఇలాంటి వ్యక్తిగత సమాచారం బట్టబయలవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం.
బజారులో దొరికే వస్తువైపోతే..
ఒక ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ తెలిస్తేనే సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను ఊడ్చేస్తున్న పరిస్థితుల్లో ఏకంగా క్రెడిట్‌కార్డులు, నెట్‌బ్యాంకింగ్ సమాచారం కూడా ఇలా బజారులో దొరికే వస్తువైపోతే ఇక ఆ ఖాతాలకు భద్రత ఎక్కడన్న ప్రశ్న ఉదయిస్తోంది. ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులతోపాటు కీలక వ్యక్తుల సెల్‌ఫోన్‌లో పెగాసస్ స్పైవేర్ చొప్పించి ఫోన్‌నే అధీనంలోకి తీసుకుంటున్నారన్న రచ్చ పార్లమెంటును కుదిపేసింది. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణంగా మారిందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు మరోమారు చర్చలోకి వచ్చింది. దేశంలోని పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి పరిరక్షించడమే లక్ష్యంగా వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లును కేంద్ర ప్రభుత్వం 2019లో తెరపైకి తెచ్చింది. దేశంలో లావాదేవీలు నిర్వహిస్తున్న సామాజిక మాధ్యమాలు, ఈ-కామర్స్ కంపెనీలు వినియోగదారుల సమాచారాన్ని విదేశాలకు అమ్ముకోకుండా కట్టుదిట్టం చేయాలన్నది దీని ముఖ్యోద్దేశం.