Data Protection Bill 2023 : వ్యక్తుల చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్, పాన్‌కార్డులు, బ్యాంక్ ఖాతాల వివరాలు, జీతభత్యాలు, ఆదాయ పన్నుల చెల్లింపులు, ఆన్‌లైన్ కొనుగోళ్ల వివరాలన్నీ నేడు అంగడి సరకులవుతున్నాయి. ప్రజల సున్నిత సమాచారాన్ని తస్కరించి సొమ్ము చేసుకుంటున్న సైబర్ నేరగాళ్ల దందాలు కొన్నేళ్లుగా వరసగా వెలుగుచూస్తున్నాయి. పౌరుల ప్రాథమిక హక్కుగా సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించిన వ్యక్తిగత గోప్యతకు అవి నిలువెల్లా తూట్లుపొడుస్తున్నాయి. దాన్ని సంరక్షించడం ద్వారా వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టగలిగే సమర్థ శాసనమేదీ స్థానికంగా ఉనికిలో లేదు. వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టం రూపకల్పనకు అయిదేళ్లుగా సాగుతున్న ప్రయత్నాలు ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు.
నిరుడు సరికొత్త 'డిజిటల్ డేటా ప్రొటెక్షన్(డీడీపీ) బిల్లు' ముసాయిదాను సిద్ధంచేసిన కేంద్రం- దానిపై సూచనలూ సలహాలను ఆహ్వానించింది. తాజాగా ఆ బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర పడటంతో రాబోయే వర్షాకాల సమావేశాల్లో అది పార్లమెంటు గడప తొక్కవచ్చు. శాసన ముసాయిదా ప్రకారం- సమాచార తస్కరణలను అడ్డుకోవడంలో విఫలమైన సంస్థలకు రూ.250 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. కానీ, జాతీయ భద్రత పేరిట సర్కారీ సంస్థలకు గంపగుత్తగా మినహాయింపులు కట్టబెట్టే నిబంధనలే తీవ్రంగా విమర్శల పాలయ్యాయి. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు 'డీడీపీ' బిల్లు దారిచూపుతుందనే భయసందేహాలూ వ్యక్తమయ్యాయి. వివాదాల పరిష్కరణకు కొలువుతీరబోయే 'డేటా పరిరక్షణ మండలి' స్వతంత్రత ఏపాటిదన్న అనుమానాలు నెలకొన్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా పెల్లుబికిన ఆందోళనలను పట్టించుకోకుండానే 'డీడీపీ' బిల్లుకు యథారీతిన చట్టరూపం ఇచ్చేందుకు కేంద్రం సంసిద్ధమవుతున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. అవే అందరినీ కలవరపాటుకు గురిచేస్తున్నాయి ఇప్పుడు!
ఇటీవలి ఒక అంతర్జాతీయ అధ్యయనం మేరకు సమాచార తస్కరణ బాధిత దేశాల్లో ఇండియాది రెండో స్థానం. దేశీయంగా ఆరోగ్యసేవలు, రిటైల్ రంగాలు అత్యధికంగా సైబర్ బందిపోట్ల బారిన పడుతున్నాయి. ఆ తరవాత ఎక్కువగా ఆర్థిక, విద్య, వృత్తి-సాంకేతిక, ప్రజాపాలన రంగాల్లోని సంస్థలూ కార్యాలయాలు డిజిటల్ దాడులకు గురవుతున్నాయి. రోగుల తాకిడి విపరీతంగా ఉండే దిల్లీ 'ఎయిమ్స్'పై హ్యాకర్లు గతేడాదిలో గురిపెట్టడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. మూడు కోట్ల మంది రైల్వే ప్రయాణికుల వివరాలూ నిరుడు డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షమయ్యాయి. దాదాపు 17కోట్ల మంది సమాచారాన్ని కాజేసి అమ్ముకొంటున్న ఉత్తర్‌ప్రదేశ్ ముఠా ఒకటి మొన్న మార్చిలో పట్టుబడింది. సుమారు 67కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలను పప్పుబెల్లాల్లా విక్రయిస్తున్న సైబర్ చోరుల గుట్టును ఆ తరవాత కొద్దిరోజులకే తెలంగాణ పోలీసు యంత్రాంగం రట్టు చేసింది.
'డిజిటల్ ఇండియా' లక్ష్యాలు పూర్తిస్థాయిలో సాకారం కావాలంటే- సైబర్ భద్రతపై జనవర్గాల్లో విశ్వాసం పెంపొందించాలి. వివిధ అవసరాలకోసం అంతర్జాల వేదికలపై తాము పంచుకునే సమాచారమేదీ దుర్వినియోగం కాదనే భరోసాను వారిలో కల్పించాలి. ఆ మేరకు సైబర్ సీమలో తమ ప్రజల గోప్యతా హక్కును పరిరక్షించేందుకు 157 దేశాలు ప్రత్యేక చట్టాలను రూపొందించుకొన్నాయి. దాదాపు 80కోట్ల అంతర్జాల వినియోగదారులకు ఆలవాలమైన ఇండియాలో అటువంటి శాసనం కొరవడటం- సైబరాసురులకు అయాచిత వరమవుతోంది. వినియోగదారుల వివరాలను విచ్చలవిడిగా సేకరిస్తున్న వివిధ యాప్‌లు, వెబ్‌సైట్లు- వాటిని సక్రమంగా భద్రపరచడంలో చేతులెత్తేస్తున్నాయి. వాటికి బాధ్యత మప్పేందుకు... తద్వారా ప్రజల ఆర్థిక, వ్యక్తిగత రక్షణకు గొడుగుపట్టేందుకు సమాచార పరిరక్షణ చట్టాన్ని సత్వరం అమలులోకి తీసుకురావాల్సిందే. ఆ క్రమంలో ప్రజాప్రయోజనాలు, న్యాయబద్ధమైన సర్కారీ బాధ్యతల సమతౌల్యాన్ని పాటించడం తప్పనిసరి. లేకపోతే, గంప లాభం చిల్లి తీసినట్లు ప్రతిపాదిత శాసన స్ఫూర్తికే గండిపడుతుంది!