తాగునీటిలో పరిమితికి మించి ఉన్న ఫ్లోరైడ్ ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తోందని దేశంలో 83 ఏళ్ల కిందటే గుర్తించారు. ఇప్పటికీ ఆ మూలకం లేని నీటిని పూర్తి స్థాయిలో సరఫరా చేయడంలో ప్రభుత్వాలు విజయం సాధించలేకపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది ఈ నీటిని తాగి ఫ్లోరోసిస్ బారిన పడుతుంటే... మన దేశంలో అటువంటి బాదితులు కోటీ 17 లక్షల మంది ఉన్నారని ఫ్లోరోసిస్ నివారణ, నియంత్రణకు ఉద్దేశించిన జాతీయ కార్యక్రమం (ఎన్‌పీపీసీఎఫ్) వెల్లడించింది. కొన్నేళ్లుగా ఈ విషయంలో పరిశోధనలు, సర్వేలు, అవగాహన, సహాయ కార్యక్రమాలు చేస్తున్న ఎన్జీఓలు మాత్రం భారతదేశంలో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో ఆరు కోట్లమంది ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. ఒక మనిషికి రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచి నీరు, పోషకాహారం అందకపోవడం వల్లే 21వ శతాబ్దంలోనూ ఈ సమస్య ఉత్పన్నమవుతోంది.
డబ్ల్యూహెచ్ఓ సూచన ప్రకారం..
మన దేశ పరిస్థితుల దృష్ట్యా లీటరు తాగునీటిలో ఒక మిల్లీ గ్రాము నుంచి 1.5 మి.గ్రా. ఫ్లోరైడ్ మాత్రమే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. తమిళనాడు, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లలో కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ 29 మి.గ్రా. వరకు ఉందని అంతర్జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన సంస్థ(ఐఎస్‌ఎఫ్‌ఆర్) నివేదిక వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ ఉత్పత్తుల్లో ఇంకా ఎక్కువ ఉందని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్) తేల్చింది. అక్కడి నీరు, ఆహారం ద్వారా ఒక మనిషిలో గరిష్ఠంగా మూడు మి.గ్రా. ఉండాల్సిన ఫ్లోరైడ్ అధికస్థాయికి చేరి- శరీరానికి పోషకాలు అందకుండా చేస్తోంది. దీంతో దేశంలో ఎనిమిదేళ్లలోపు పిల్లలు 60లక్షల మంది ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నారు. మహిళలు రక్తహీనత ఎదుర్కొంటున్నారు. 40 ఏళ్లు వచ్చేసరికి ఎముకలు గుల్లబారి నడవలేకపోతున్నారు. జాతీయ పరిశోధన మండలి-2006 నివేదిక ప్రకారం ఫ్లోరైడ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా మెదడుతోపాటు అన్ని భాగాల సామర్థ్యం తగ్గిస్తోంది.
దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో..
దేశంలో 17 రాష్ట్రాల్లో, 22 జిల్లాల్లో 5,485 ఆవాసాల్లోనే ప్రస్తుతం ఫ్లోరైడ్ సమస్య ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇందులో 83శాతం గ్రామాలు రాజస్థాన్, బిహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, పంజాబ్‌లలోనే ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో ఫ్లోరిన్ ప్రభావిత ఆవాసాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ‘2015 ఏప్రిల్ నుంచి 2020 ఆగస్టు వరకు మా రాష్ట్రంలో ఒక్క ఫ్లోరోసిస్ కేసూ బయటపడలేదు’ అని గుజరాత్, తెలంగాణ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇటీవల చాటుకున్నాయి. 2015లో ఇలాగే చెప్పుకొన్న తమిళనాడు ఇప్పుడు 236 ప్రభావిత ఆవాసాలు ఉన్నాయంటోంది. ఝార్ఖండ్‌లోనూ 2015లో 10 ప్రభావిత గ్రామాలుంటే... ఇప్పుడు వాటి సంఖ్య 81కి పెరిగింది. జమ్మూకశ్మీర్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, బిహార్‌లలోనూ 2015తో పోలిస్తే ప్రస్తుతం ప్రభావిత ఆవాసాలు పెరిగాయి.