దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయ పరికల్పనకు రాజ్యాంగమే పూచీపడి ఏడు దశాబ్దాలు గడిచినా- ఎండమావి న్యాయాన్ని అందుకోలేక జనావళి గుండెలవిసి పోతున్నాయి. వ్యాజ్యాలు నిజం- న్యాయం మిథ్యగా పరిస్థితులు విషమించడానికి- కర్ణుడి చావుకంటే ఎక్కువ కారణాలు పోగుపడ్డాయి. సుప్రీం న్యాయపాలిక సహా దేశవ్యాప్తంగా పాతిక హైకోర్టుల్లో న్యాయపీఠాలు పూర్తిస్థాయిలో భర్తీ కాకపోవడం వాటిలో కీలకమైనది. ఈ నెల ఒకటో తేదీ నాటికి సుప్రీంకోర్టులో నాలుగు, హైకోర్టుల్లో 1074 జడ్జి పోస్టులకు గాను 414 ఖాళీలు భర్తీకాకుండా ఉన్నాయి. జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో 24,225 మందికిగాను, 19,345 మందే విధుల్లో ఉన్నట్లు గణాంకాలు చాటుతున్నాయి. ప్రతి హైకోర్టు న్యాయమూర్తి సగటున తలసరి నాలుగున్నర వేలు; సబార్డినేట్ కోర్టులో ప్రతి జడ్జి సగటున 1300 పెండింగ్ వ్యాజ్యాలతో కుస్తీ పట్టాల్సి వస్తోందని కేంద్ర న్యాయశాఖ చెబుతోంది.
మూడు కోట్ల పైచిలుకు కేసులు పెండింగ్...
ఈ ఏడాది తొలి నాటికి తెలంగాణ హైకోర్టులో అపరిష్కృత పిటిషన్ల సంఖ్య రెండు లక్షల ఆరువేలు; నవంబరు నాటికవి మరో పద్నాలుగు వేలు పెరిగాయంటూ ఎకాయెకి 11 న్యాయ పీఠాలు ఖాళీగా ఉండటంతో సత్వర న్యాయం మరీచికని తలపిస్తోందని ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాజ్యాంగంలోని 224-ఎ అధికరణ అనుసారం ప్రధాన న్యాయమూర్తులు- రాష్ట్రపతి ఆమోదంతో విశ్రాంత న్యాయమూర్తుల సేవల్ని వినియోగించుకోగల వీలుందని, ఆ దిశగా ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరుతున్నారు. నిశితంగా చూస్తే, ఇది కేవలం తెలంగాణ సమస్య కాదు. దేశవ్యాప్తంగా మూడు కోట్ల పైచిలుకు కేసులు పెండింగ్‌లో ఉండగా, ఏటా కొత్తగా మరో రెండు కోట్లు దాఖలు అవుతుంటాయని, పెండింగ్ కొండల్ని కరిగించడానికి 320 ఏళ్లు పడుతుందని జస్టిస్ వీవీరావు స్పష్టీకరించి పదేళ్లయింది. న్యాయసంక్షోభం ఇంతగా ముదిరినా తీరైన కార్యాచరణే కొరవడింది!
70వేల మంది జడ్డిలు అవసరం..