తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బాయ్​కాట్​ చైనా: ఇక నుంచైనా స్వావలంబన!

గల్వాన్​ ఘర్షణ అనంతరం చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్​ దేశవ్యాప్తంగా పెరిగింది. కొన్ని వర్తక సంఘాలు చైనా సరకుల కోసం ఆర్డరు పెట్టడం నిలిపేయగా, ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్ల నుంచి స్వచ్ఛందంగా చైనా యాప్‌లను తొలగించాలంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరందుకొంది. ఇంతవరకు నినాదప్రాయంగా ఉన్న మేక్‌ ఇన్‌ ఇండియాను సంపూర్ణ ఆచరణలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నం మొదలుపెట్టింది.

By

Published : Jun 28, 2020, 9:13 AM IST

Updated : Jun 28, 2020, 4:49 PM IST

people across india demanding to ban china products
ఇకనుంచైనా స్వావలంబన! చైనా ఉత్పత్తులపై భారత్‌లో నిరసనలు

అలనాటి విదేశీ వస్తు బహిష్కార ఉద్యమ పంథాలో నేడు దేశమంతటా చైనా వస్తు బహిష్కారానికి డిమాండ్లు ఊపందుకొంటున్నాయి. గల్వాన్‌ ఘర్షణను పురస్కరించుకుని కొన్ని వర్తక సంఘాలు చైనా సరకుల కోసం ఆర్డరు పెట్టడం నిలిపేయగా, ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్ల నుంచి స్వచ్ఛందంగా చైనా యాప్‌లను తొలగించాలంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరందుకొంది. చైనా పెట్టుబడి పెట్టిన పేటీఎం, ఓలా, మేక్‌ మై ట్రిప్‌ వంటి కంపెనీలకు గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉన్న రేటింగులను తగ్గించే పనిని చాలామంది తలకెత్తుకున్నారు. టెన్సెంట్‌, అలీబాబా, సీట్రిప్‌ వంటి భారీ చైనా కంపెనీల నిధులతో రూపొందిన యాప్‌లను స్మార్ట్‌ఫోన్ల నుంచి తొలగిస్తున్నారు. భారతీయ నిఘా సంస్థలు చైనాతో సంబంధం కలిగిన మొత్తం 53 మొబైల్‌ యాప్స్‌ మన జాతీయ భద్రతకు ప్రమాదకరమని, వాటిని నిరోధించడమో లేక వినియోగదారులకు వాటిని వాడవద్దని తెలియజెప్పడమో చేయాలని కేంద్రాన్ని కోరాయి. ఈ యాప్‌లలో జూమ్‌, టిక్‌టాక్‌, యూసీబ్రౌజర్‌, క్లీన్‌ మాస్టర్‌ వంటివి ఉన్నాయి. చైనా యాప్‌లను నిషేధించే అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది.

'స్వదేశీ'కే ప్రభుత్వ ప్రాధాన్యం

ఇంతవరకు నినాదప్రాయంగా ఉన్న మేక్‌ ఇన్‌ ఇండియాను సంపూర్ణ ఆచరణలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నం మొదలుపెట్టింది. గవర్నమెంట్‌ ఈ-మార్కెట్‌ ప్లేస్‌ (జీఈఎం) పోర్టల్‌లో వస్తువులను విక్రయించేవారు తమ సరకు ఎక్కడ తయారైనదో స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించింది. ప్రభుత్వ విభాగాలు తమకు కావలసిన వస్తువులను జీఈఎం పోర్టల్‌ ద్వారానే కొనుగోలు చేస్తున్నాయి. ఇకపై ఈ వస్తువుల్లో ఏవి చైనాలో తయారైనవో, ఏవి భారత్‌లో తయారైనవో తెలిపే ప్రత్యేక ఫిల్టర్‌ను జీఈఎం పోర్టల్‌లో పొందుపరచారు. విదేశీ వస్తువుల్లో భారతీయ విడిభాగాలు ఉంటే ప్రత్యేక ఫిల్టర్‌ ఆ విషయం కొనుగోలుదారులకు తెలుపుతుంది. కనీసం 50 శాతం భారతీయ విడిభాగాలను వాడిన వస్తువులనే కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌ వంటి ప్రైవేట్‌ ఈ-కామర్స్‌ సైట్లలోనూ ఈ ఫిల్టర్‌ను ఏర్పరుస్తారు. ప్రస్తుతం ఈ సైట్లలో విక్రయించే వస్తువుల్లో 70 శాతం చైనాలో తయారైనవే. జీఈఎం సైట్లో వస్తువులను విక్రయించేవారు అవి ఏ దేశానికి చెందినవో స్పష్టంగా పేర్కొనకపోతే ఆ విక్రేతలను జీఈఎం నుంచి బహిష్కరిస్తామని కేంద్రం హెచ్చరించింది. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న మొత్తం వస్తువుల జాబితాను రూపొందించి, వాటిలో తమ ఉత్పత్తికి అత్యవసరమైన యంత్రాలు, విడిభాగాలు, ఇతర వస్తువులేవో తెలియజేయాల్సిందిగా భారతీయ ప్రైవేటు కంపెనీలను కేంద్రం ఆదేశించింది. అత్యవసరం కాని వస్తువులను ఆత్మ నిర్భర్‌ భారత్‌ కింద స్వదేశంలోనే తయారుచేయాలని నిశ్చయించింది. ఉదాహరణకు చవకరకం చేతి గడియారాలు, గోడ గడియారాలు, షాంపూలు, తలకు రాసుకునే క్రీములు, ఫేస్‌ పౌడర్‌, ప్రింటింగ్‌ ఇంకులు తదితరాలను పూర్తిగానో, వాటి విడిభాగాలనో చైనా నుంచి దిగుమతి చేసుకుని మన మార్కెట్‌ లో విక్రయిస్తున్నారు. వీటిని నిక్షేపంగా భారత్‌ లోనే తయారుచేసుకోవచ్ఛు చైనా నుంచి అత్యవసరం కాని వస్తువుల దిగుమతికి అనుమతి మంజూరును కస్టమ్స్‌ శాఖ ఇప్పటికే జాప్యం చేయడం- చెన్నై, ముంబయి రేవుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

సవాలుగా స్వీకరించాలి

గుండుగుత్తగా చైనా దిగుమతులను నిషేధించడాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలు అనుమతించవు. కేవలం జాతీయ భద్రత, ఆరోగ్య కారణాల రీత్యానే కొన్ని దిగుమతులను నిషేధించవచ్ఛు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్రం మూడంచెల వ్యూహం రూపొందిస్తోంది. స్వల్ప కాలంలో చైనా వస్తువుల వాడకాన్ని మాన్పించడం, మధ్య కాలంలో ఆ దిగుమతులకు ప్రత్యామ్నాయాలను ఇక్కడే తయారుచేసుకోవడం, దీర్ఘకాలంలో భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మలచడం- కేంద్ర వ్యూహంలో ముఖ్యాంశాలు. ఈ వ్యూహం ఫలించాలంటే మనకున్న చవక కార్మిక శక్తితోనే నాణ్యమైన వస్తువులను తయారుచేయగలగాలి. చైనా పరిశ్రమలు కారుచౌక ధరలపై విదేశాలకు సరకులు విక్రయిస్తున్న మాట నిజమే కానీ, దీనివల్ల వచ్చే నష్టాన్ని సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భర్తీచేస్తూ, కంపెనీలకు కొంత లాభం మిగిలేలా చూస్తోంది. అపార పరిమాణంలో వస్తూత్పత్తి సాగించడం వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గి చైనా తన సరకులను కారుచౌక ధరకు అమ్మగలుగుతోంది. దీన్ని నివారించడానికి భారత ప్రభుత్వం యాంటీ డంపింగ్‌ సుంకం, కౌంటర్‌ వెయిలింగ్‌ సుంకాలను విధించవచ్ఛు అలా చేసినప్పుడు చైనా సరకుల ధరలు పెరిగి వాటికి గిరాకీ తగ్గుతుంది. దాన్ని అవకాశంగా తీసుకుని భారతీయ కంపెనీలు తమ మార్కెట్‌ పెంచుకోవచ్ఛు ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకంలో భాగంగా ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ప్రోత్సహించడం స్వాగతించాల్సిన విషయం. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు కార్మిక చట్టాల అమలును మూడేళ్లపాటు నిలిపేసి కొత్త పరిశ్రమల స్థాపనకు ఊతమివ్వాలని నిర్ణయించాయి. కార్మిక శక్తిని అధికంగా ఉపయోగించే వస్త్రాలు, ఆహార శుద్ధి, తోలు వస్తువులు, పాదరక్షల వంటి పరిశ్రమలకు పదేళ్లపాటు పన్ను విరామం ప్రకటించాలని కేంద్ర కార్మిక శాఖ ప్రతిపాదిస్తోంది. అనేక కీలక రంగాల్లో ప్రైవేటు కంపెనీలకు ప్రవేశం కల్పించడం, కార్మిక సంస్కరణలు చేపట్టడం, చైనా నుంచి పరిశ్రమలను తరలించాలని చూస్తున్న పాశ్చాత్య కంపెనీలకు ఆకర్షణీయం కానున్నది. మొత్తం మీద ఆర్థిక రంగంలో చైనా ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి భారత్‌ కీలక చర్యలు మొదలుపెట్టింది.

డ్రాగన్‌ పరికరాలపై సందేహాలెన్నో...

మారిన పరిస్థితుల్లో భారీ పెట్టుబడులు గుమ్మరించి భారతీయ సంస్థల్లో మెజారిటీ వాటా సంపాదించడానికి చైనా ప్రయత్నించకుండా భారత ప్రభుత్వం జాగ్రత్తపడుతోంది. అలాగని ఇప్పటికిప్పుడు చైనా పెట్టుబడులకు మంగళం పాడటం సాధ్యం కాదు. భారత్‌లో 100 కోట్ల డాలర్లకుపైగా విలువ కలిగిన యూనికార్న్‌ కంపెనీలు 30 ఉంటే, వాటిలో 18 సంస్థలు చైనా పెట్టుబడులను స్వీకరించాయి. ఈ యూనికార్న్‌లలో ఫ్లిప్‌కార్ట్‌, ఓయో, బిగ్‌ బాస్కెట్‌, ఓలా వంటి ప్రసిద్ధ కంపెనీలు ఉన్నాయి. 2008 ఆర్థిక సంక్షోభంలో అమెరికా ఆర్థికశక్తి క్షీణించిన దరిమిలా భారత్‌లోకి చైనా పెట్టుబడులు భారీయెత్తున ప్రవహించాయి. అధికారికంగా చైనా ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లు 234 కోట్ల డాలర్లకు పైమాటే. ఎఫ్‌డీఐలతో భారత్‌లో ఉత్పత్తి చేపట్టిన షావొమీ, వివో, ఓప్పో వంటి కంపెనీలు భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో 70 శాతాన్ని చేజిక్కించుకున్నాయి. ఇవి కాకుండా- 2019కు ముందు అయిదేళ్లలో భారతీయ అంకురాల్లోకి 550 కోట్ల డాలర్ల చైనా పెట్టుబడులు ప్రవహించాయని అంచనా. చైనీస్‌ స్మార్ట్‌ఫోన్లు, టెలికాం పరికరాల హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లలో ‘బ్యాక్‌డోర్స్‌’ ఉంటాయని, సంక్షోభ సమయాల్లో వాటిని ఉపయోగించి కమ్యూనికేషన్‌ యంత్రాంగాలను స్తంభింపజేసే శక్తి బీజింగ్‌కు ఉంటుందని అమెరికాతోపాటు పలు పాశ్చాత్య దేశాలు అనుమానిస్తున్నాయి. మన నిఘా సంస్థలూ ఇదే అంచనాతో ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. మున్ముందు 5జి విప్లవంతో టెలికాం రంగంలో చైనా ఆధిపత్యం ఇంతలంతలు కానుంది. 5జి పరికరాలను విక్రయించే హువావై, జడ్‌టీఈ వంటి కంపెనీలకు చైనా సైన్యంతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో వాటి నుంచి ఎటువంటి సామగ్రినీ కొనరాదని కేంద్రం బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ కంపెనీలను ఆదేశించింది. ఈ విషయంలో కలసిరావాలని ప్రైవేటు సంస్థలనూ కోరుతోంది. 3జి నుంచి 4జికి మారేందుకు చైనా పరికరాలను వాడరాదని బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ కంపెనీలను ఆదేశించిన ప్రభుత్వం, ఒక చైనా సంస్థకు ఇచ్చిన రైల్వే సిగ్నలింగ్‌ కాంట్రాక్టును రద్దు చేయనున్నది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్లను తయారుచేస్తున్న చైనా కంపెనీలపై కేంద్రం నిషేధాజ్ఞలు విధించకపోవచ్చు కానీ, ప్రభుత్వం స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలుకు చొరవ తీసుకోవడం, భారతీయ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు ప్రోత్సాహాన్ని ఇచ్చేవే.

- ఏఏవీ ప్రసాద్‌

Last Updated : Jun 28, 2020, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details