తెలంగాణ

telangana

ETV Bharat / opinion

దారి తప్పిన పన్ను 'పరిహారం'.. ప్రభుత్వాల మధ్య అంతరం

లాక్​డౌన్​.. సామాన్యుల నుంచి ప్రభుత్వాల వరకు అందిరికీ గడ్డు పరిస్థితిని తెచ్చింది. ఈ ఆర్థిక ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లలో 22.5 శాతం మేర తరుగుదల నమోదైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం నేరుగా చెల్లించడం సాధ్యంకాదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇది కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య దూరాన్ని పెంచే పరిణామం కానుంది.

pending  GST
దారి తప్పిన పన్ను పరిహారం

By

Published : Oct 4, 2020, 8:29 AM IST

Updated : Oct 4, 2020, 8:48 AM IST

కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్ర, రాష్ట్రాల ఆదాయాల్లో కోతపడింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లలో 22.5 శాతం మేర తరుగుదల నమోదైంది.

కష్టకాలంలో జీఎస్‌టీ పరిహారాన్ని చెల్లించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ మొత్తం రూ.2.35 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో ఈ మొత్తం నేరుగా చెల్లించడం సాధ్యంకాదని కేంద్రం స్పష్టంచేసింది. నిధుల కొరతను అధిగమించడానికి రుణాలు తెచ్చుకోవాలని చెబుతూ రాష్ట్రాలకు రెండు మార్గాలను సూచించింది.

రాష్ట్రాలకు పరిహార చెల్లింపులకంటూ కేంద్రం సెస్‌ రూపంలో సమకూర్చుకున్న మొత్తాన్ని సంబంధిత నిధికి జమ చేయకుండా కేంద్ర సంఘటిత నిధికి మళ్లించినట్లు 'కాగ్' నివేదిక కుండ బద్దలుకొట్టింది. ఆ మేరకు జీఎస్‌టీ పరిహార నిధికి 2017-19 సంవత్సరాలకు రూ.47,272 కోట్ల మొత్తం కోసుకుపోయింది. ఈ నిధుల్ని కేంద్రం పరిహార చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఇతర పనులకు వినియోగించినట్లు 'కాగ్‌' గుర్తించింది. కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య దూరాన్ని పెంచే పరిణామమిది!

ఆర్థిక వ్యవస్థకు ప్రతిబంధకం!

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు మార్గాల్లో ఒకదాని ప్రకారం రాష్ట్రాలు ఆర్బీఐ నుంచి రూ.97,000 కోట్లు రుణం తీసుకోవచ్చు. వడ్డీరేటును కేంద్ర రుణాల వడ్డీకి సమానంగా ఉంచడానికి కేంద్ర సర్కారు సహకరిస్తుంది. అలాకాని పక్షంలో కొంత వడ్డీ మొత్తాన్ని సబ్సిడీ కింద భరిస్తుంది. రాష్ట్రాలు చేసే రూ.97,000 కోట్ల రుణాన్ని రాష్ట్రాల సాధారణ రుణాలకు కలపరు. రుణ చెల్లింపులకు రాష్ట్రాలు పరిహార నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు.

2022 తర్వాత తమ పరిధిలోని వస్తువులపై సెస్‌ విధించవచ్చు. సెస్‌ ద్వారా రాబట్టిన మొత్తం ద్వారా ఈ రూ.97,000 కోట్ల అసలును, దానిపై వడ్డీని చెల్లించవచ్చు. రాష్ట్రాల వేరే ఇతర ఆదాయాలను దీనికోసం ఉపయోగించాల్సిన అవసరం లేదు.

రెండో మార్గం ప్రకారం.. మొత్తం పన్ను వసూళ్లలో వచ్చిన నష్టం రూ.2.35 లక్షల కోట్లను రాష్ట్రాలు మార్కెట్‌లో బాండ్ల జారీ ద్వారా సమకూర్చుకోవచ్చు. వడ్డీని రాష్ట్రాలే భరించాలి. ఒకటి మాత్రం సుస్పష్టం. 2022 తరవాతా సెస్‌ విధించి పన్ను రాబడిలో వచ్చిన తగ్గుదలను పూరించాలన్న ప్రభుత్వ ఆలోచన ఈ రెండు మార్గాల్లో కనిపిస్తున్నది. వీటిని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.

జీఎస్‌టీ అమలు సమయంలో అయిదేళ్లపాటు రాష్ట్ర పన్ను రాబడిలో వచ్చే నష్టాన్ని కేంద్రం భరిస్తుందన్న చట్టపరమైన హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కొవిడ్‌ పేరిట బాధ్యత నుంచి తప్పుకోవడం సమంజసం కాదంటున్నాయి. కేంద్రమే రుణాలు తీసుకుని పరిహారాన్ని చెల్లించాలటున్నాయి. అలా చేస్తే దేశంలో వడ్డీరేట్లు పెరుగుతాయన్నది కేంద్రం వాదన. ఆర్థిక వ్యవస్థకు అది ప్రతిబంధకమని అంటోంది. కేంద్రం వాదనలోనూ వాస్తవం లేకపోలేదు.

ఈ గండం నుంచి గట్టెక్కడానికి కేంద్రం ముందు కొన్ని మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి- హెలికాప్టర్‌ మనీ. అంటే, కొంత ద్రవ్యాన్ని ముద్రించి రాష్ట్రాలకు ఇవ్వడం. మార్కెట్‌లో ప్రభుత్వ బాండ్లు అమ్మి రుణంగా తీసుకోవడం మరో మార్గం. ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో నగదు ముద్రణ ద్వారా వ్యవస్థలోకి అదనపు నగదు చొప్పించితే, ప్రజల దగ్గర ద్రవ్యం పెరుగుతుంది. కానీ ఆ మేర వస్తుసేవల ఉత్పత్తిలో పెరుగుదల ఉండదు. కాబట్టి ధరలు పెచ్చరిల్లి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడి, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

కేంద్రమే బాండ్ల ద్వారా రూ.2.35 లక్షల కోట్లు సమకూర్చుకుంటే అది మార్కెట్‌లో ద్రవ్యాన్ని పీల్చేస్తుంది. చేతుల్లో డబ్బులు ఆడక వడ్డీరేట్లు పెచ్చరిల్లుతాయి. ప్రైవేటు రంగ వ్యయమూ నామమాత్రం అవుతుంది. దీన్ని క్రోడింగ్‌ అవుట్‌ ఎఫెక్ట్‌ అంటారు. ఈ పరిస్థితి దేశంలో ఆర్థిక కార్యకలాపాల కుదింపునకు కారణమవుతుంది. ఆర్థిక వ్యవస్థను తిరిగి అధిక వృద్ధిలో పెట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు అవరోధం ఏర్పడుతుంది. ఇది క్లిష్టమైన పరిస్థితే. అయితే జీఎస్టీ లక్ష్యాల్లో బహుళ పన్నుల వ్యవస్థను నిర్మూలించడం, పరోక్ష పన్ను వ్యవస్థను సరళీకరించడం ప్రధానమైనవి. కనుక రాష్ట్రాలు సెస్సులు విధించడం ప్రారంభిస్తే వస్తుసేవలపై వివిధ రాష్ట్రాలు వివిధ రేట్లు విధించే అవకాశం లేకపోలేదు!

కేంద్రానిదే బాధ్యత

కొవిడ్‌ వల్ల ప్రభుత్వాలకు రాబడి తగ్గి, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.7.8 లక్షల కోట్లు రుణం తెచ్చుకోవాలని అనుకున్నా కొవిడ్‌ వల్ల అది రూ.12లక్షల కోట్లకు చేరింది. దేశ మొత్తం అప్పులు 2020 మార్చినాటికే రూ.146.9 లక్షల కోట్లకు (జీడీపీలో 72.2శాతం) చేరాయి. 2020-21నాటికది 87.6 శాతానికి చేరుతుందని ఎస్‌బీఐ అంచనా వేసింది.

2020నాటికే రాష్ట్రాల అప్పులు రూ.52.6 లక్షల కోట్లకు చేరాయి. అయిదేళ్లలో కేంద్ర రుణాల్లో 10శాతం, రాష్ట్రాల రుణాల్లో 14.3శాతం పెరుగుదల ఉంది. ప్రభుత్వ వ్యయాలు తగ్గినందువల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్లో తక్కువ వృద్ధి నమోదవుతోంది. ఉదయ్‌ స్కీం వల్ల రాష్ట్రాల అప్పులు పెరిగాయి. రాష్ట్రాల నిధుల సమస్యల పరిష్కారానికి ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితిని మూడు శాతం నుంచి అయిదు శాతానికి కేంద్రం పెంచడం వల్ల రూ.4.28లక్షల కోట్ల నిధులు అందుబాటులోకి వచ్చాయి. అయితే షరతులు ఎక్కువగా ఉండటాన్ని రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. కాగ్‌ నివేదిక సైతం రాష్ట్రాల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఏమైనా జీఎస్‌టీ పరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. అందుకు కేంద్రమే చొరవ తీసుకోవాలి. సమాఖ్య స్ఫూర్తిని గౌరవించాలి!

'కరోనా ఖాతా'లోకీ నష్టాలు...

భారత రాజ్యాంగం కేంద్రానికి హెచ్చు ఆదాయ వనరులను, రాష్ట్రాలకు అధిక బాధ్యతలను కట్టబెట్టింది. జీఎస్‌టీ వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని అయిదేళ్ల పాటు కేంద్రమే పూర్తిగా భరించాలని చట్టం చెబుతోంది. ఇందుకోసం జీఎస్‌టీ పరిహార నిధి ఏర్పాటైంది.

డీమెరిట్‌ వస్తువులపై సెస్‌ విధింపు ద్వారా వచ్చే మొత్తం ఈ నిధికి దఖలు పరచాలి. 2015-16 ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికగా ఏటా పన్ను రాబడిలో 14 శాతం వృద్ధిని అంచనా వేశారు. అంచనాకు, వాస్తవ వసూళ్ల మొత్తానికి మధ్య గల వ్యత్యాసాన్ని 2022 వరకు కేంద్రమే భర్తీ చేయల్సిఉంది. ఈ వ్యత్యాసం 2020-21 సంవత్సరానికి రూ.2.35 లక్షల కోట్లుగా ఉందని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ మొత్తంలో రూ.97 వేలకోట్లు మాత్రమే జీఎస్‌టీ అమలువల్ల రాష్ట్రాలు కోల్పోయాయి. మిగిలిన రూ.1.38లక్షల కోట్లు కొవిడ్‌ మహమ్మారి (యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌) వల్ల సంభవించింది. కనుక ఈ మిగులును జీఎస్‌టీ పరిహారంతో ముడిపెట్టలేమని కేంద్రం ప్రకటించింది!

- డా. కల్లూరు శివారెడ్డి (పుణె గోఖలే ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్​లో ఆచార్యులు)

Last Updated : Oct 4, 2020, 8:48 AM IST

ABOUT THE AUTHOR

...view details