తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రతిపక్షాలు గళమెత్తకుంటే.. ప్రమాదంలో రాజకీయ భవిష్యత్తు!

పార్లమెంటు సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కొవిడ్ ఉద్ధృతి తరవాత ఇంధన ధరలు మండిపోతున్న క్రమంలో ఈ సమావేశాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం, రఫేల్‌ కుంభకోణం, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై తాము గళమెత్తుతామని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ప్రకటించింది.

parliamnet sessions
పార్లమెంటు సమావేశాలు

By

Published : Jul 18, 2021, 7:40 AM IST

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఆసన్నమైంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. కొవిడ్‌ కారణంగా గడచిన రెండు విడతల్లో ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ భేటీలు జరిగాయి. సభ్యులందరూ దాదాపుగా టీకాలు తీసుకోవడంతో ఈసారి ఉభయసభల భేటీలు సమాంతరంగానే సాగనున్నాయి. కరోనా వ్యాప్తి భయంతో ఇంతకుముందు షెడ్యూల్‌ సమయం కంటే ముందే నిరవధిక వాయిదా పడిన సమావేశాలు ఈసారైనా పూర్తిగా జరుగుతాయా అన్నది చూడాలి.

ఆసేతుహిమాచలాన్ని వణికించిన కరోనా రెండో ఉద్ధృతి తరవాత ఇంధన ధరలు మండిపోతున్న తరుణంలో జరుగుతున్న సమావేశాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరవధిక ఉద్యమం, రఫేల్‌ కుంభకోణం, కొవిడ్‌ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం, పెట్రో ఉత్పత్తుల ధరలు, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై తాము గళమెత్తుతామని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అందుకు తగ్గట్లు మిత్రపక్షాలతో సమన్వయం చేసే బాధ్యతలను లోక్‌సభలో ప్రతిపక్షనేత అయిన అధిర్‌రంజన్‌ చౌధురికి కాకుండా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైన సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేకు అప్పగించింది.

వివాదాస్పద బిల్లులపై ముందడుగే!

జాతీయ భద్రత, ప్రజారోగ్యం, జమ్మూకశ్మీర్‌, సామాజిక మాధ్యమాల నియంత్రణకు తెచ్చిన కొత్త నిబంధనలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి విషయాల్లో అధికారపక్షాన్ని ఇరుకునపెట్టి పైచేయి సాధించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల ఫలితాల్లో భాజపా, దాని మిత్రపక్షాలను ఓడించి- కేంద్రంతో తరచూ ఏదో ఒక రూపంలో తలపడుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకెలు తాజా సమావేశాల్లో మరింత దూకుడు ప్రదర్శించే సూచనలు కనిపిస్తున్నాయి.

రాజకీయ పునరేకీకరణ

పశ్చిమ్‌ బంగ ఎన్నికల్లో భాజపా ఓటమి- దేశవ్యాప్తంగా రాజకీయ పునరేకీకరణకు బీజం వేసింది. మమతాబెనర్జీ, ఎంకే స్టాలిన్‌, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌లు కాంగ్రెస్‌తో కలిసి భాజపాకు ప్రత్యామ్నాయ వేదికను నిర్మించే పనిని ఇప్పటికే ప్రారంభించారు. ఆ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్ళేలా పార్లమెంటు సమావేశాల్లో భావసారూప్య పక్షాలన్నీ కలిసికట్టుగా మోదీ ప్రభుత్వంపై దండెత్తాలన్న కదన కుతూహలం ప్రదర్శిస్తున్నాయి. అధికార, విపక్షాల మధ్య ఈ సమావేశాల్లో సాగబోయే రాజకీయ యుద్ధం రాబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనితో ప్రస్తుత సమావేశాల్లో ప్రత్యర్థి శిబిరంమీద పైచేయి సాధించాలని ఇరువర్గాలూ భావిస్తుండటంతో సమావేశాలు వాడివేడి విమర్శలతో హోరాహోరీగా సాగవచ్చు. ఈ పరిస్థితిని ముందే గ్రహించిన ప్రధాని- ఈసారి రాజ్యసభాపక్షనేతగా వాగ్ధాటి కలిగిన పీయూష్‌ గోయల్‌ను నియమించారు. ఇదివరకు ఈ బాధ్యతలను నిర్వర్తించిన థావర్‌చంద్‌ గహ్లోత్‌ ప్రతిపక్షాలకు అంత బలంగా బదులిచ్చేవారు కారు. గుక్కతిప్పుకోకుండా గంటల తరబడి మాట్లాడగలిగిన పీయూష్‌- అధికారపక్షం వాణిని సమర్థంగా వినిపించగలరు. తమకు సంపూర్ణ ఆధిక్యం కలిగిన లోక్‌సభలో ప్రతిపక్షాలను అడ్డుకోవడం అధికారపక్షానికి పెద్ద కష్టమేమీ కాదు. రాజ్యసభలోనే వారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకావచ్చు. అరుణ్‌ జైట్లీ రాజ్యసభాపక్షనేతగా ఉన్నప్పుడు ఏ అంశంపైనైనా విపక్షాలపై భారీగా ఎదురుదాడి చేసేవారు. పీయూష్‌ గోయల్‌ సైతం ఆ స్థాయిలో రాణించాలని అధికారపక్షం ఆశిస్తోంది.

ప్రతిపక్షాలను దీటుగా..

ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు అధికారపక్షం అన్ని విధాలా సమాయత్తమవుతోంది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఇంట్లో ఇటీవల సమావేశమైన భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌ షా, ప్రహ్లాద్‌ జోషీ, భూపేందర్‌ యాదవ్‌, ధరేంద్ర ప్రధాన్‌లు ఆ మేరకు వ్యూహరచన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాల్లో కొత్తగా 17 బిల్లులను ప్రవేశపెట్టడానికి జాబితా సిద్ధంచేసింది. వాటిలో వివాదాస్పద విద్యుత్తు చట్ట సవరణ బిల్లు సైతం ఉంది. సాగుచట్టాల రద్దుకు పట్టుపడుతున్న రైతులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా దాన్ని సభ ముందుకు తీసుకురావడానికే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఈ బిల్లుపై సమావేశాల్లో దుమారం రేగే అవకాశం ఉంది. అలాగే వివాదస్పద ట్రైబ్యునల్‌ సంస్కరణల బిల్లుతో సహా సంతాన సాఫల్య కేంద్రాల నియంత్రణ, తల్లిదండ్రులు- వయోవృద్ధుల సంక్షేమం, జాతీయ రాజధాని ప్రాంతంలో గాలినాణ్యత పరిశీలన, మనుషుల అక్రమ రవాణా నియంత్రణ బిల్లులూ పార్లమెంటు ముందుకు రానున్నాయి.

అర్థవంతమైన చర్చలు అవసరం

పూర్వ సరళిని బట్టిచూస్తే పార్లమెంట్‌ సమావేశాల్లో మొదటివారం రోజులు ప్రతిపక్షాల ఆందోళనలతోనే ముగిసిపోతున్నాయి. ఆ తరవాత సమయం సరిపోలేదన్న కారణంతో అర్ధరాత్రి వరకు సభ నడిపి హడావుడిగా బిల్లులను పాస్‌ చేసేస్తున్నారు. సమయం గడిచేకొద్దీ సభలో సభ్యులు పలచబడటం, ఉన్నవారిలో ఓపిక నశించడంతో పెద్దగా చర్చ జరగకుండానే చాలా బిల్లులు పాసైపోతున్నాయి. ఈసారి ప్రతిపక్షాలు పంథా మార్చుకొని బిల్లులను కూలంకషంగా అధ్యయనం చేసి, లోపాలను ఎండగడితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. విలువైన సభాసమయాన్ని వృథాచేసి- ఆ హడావుడిలో బిల్లులను పాస్‌ చేసుకొనే అవకాశం కల్పిస్తే పరోక్షంగా ప్రభుత్వానికి ప్రయోజనం చేకూర్చినట్లే అవుతుంది.

అధికారపక్షం సైతం ఏకపక్షంగా బిల్లులను పాస్‌ చేయకుండా వివాదస్పదమైన వాటిని స్థాయీసంఘాలకు పంపించి లోతైన పరిశీలన చేయించాలి. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు తగిన అవకాశాలూ కల్పించాల్సి ఉంది. క్లిష్టమైన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇస్తేనే జవాబుదారీతనానికి పట్టం కట్టినట్టవుతుంది. అర్థవంతమైన చర్చలతో, ప్రజోపయోగ చట్టాల రూపకల్పనతో సమావేశాలు ఫలవంతమైతేనే ప్రజాస్వామ్యం వికసిస్తుంది.

ప్రతిపక్షాలపై అందరి దృష్టి

'కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన'పై గతంలో మక్కువ చూపిన ప్రధాని మోదీ, తాజాగా ఆ విధానాన్ని పక్కనపెట్టి భారీ మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పార్లమెంటు సమావేశాలకు ముందు మంత్రివర్గాన్ని మోదీ పునర్‌ వ్యవస్థీకరించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతి వేళ ప్రజల్లో ధైర్యం కల్పించడంలో కేంద్రం విఫలమైందన్న భావన దేశవ్యాప్తంగా నెలకొంది. పశ్చిమ్‌ బంగ ఎన్నికల్లో అది భాజపాకు చేటు చేసిందన్న వాదనా ఉంది. ఈ పరిస్థితుల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను తప్పించి, స్వరాష్ట్రానికి చెందిన మన్‌సుఖ్‌ మాండవ్యకు మోదీ ఆ బాధ్యతలను అప్పగించారు.

ప్రతిపక్షాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఎదురుదాడి చేసే మాండవ్య- కొవిడ్‌ వైఫల్యంపై పార్లమెంటులో విపక్షాల దాడిని దీటుగా ఎదుర్కొనగలరని ప్రధాని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు, ద్రవ్యోల్బణానికి అద్దంపట్టే వినియోగ ధరల సూచీ జూన్‌లో 6.26 శాతానికి ఎగబాకింది. టోకు ధరల సూచీ సైతం వరసగా మూడో నెల రెండంకెలను దాటి 12.07శాతానికి చేరింది. కొవిడ్‌ కారణంగా కుదేలవుతున్న సామాన్యుల తరఫున పార్లమెంటులో ప్రతిపక్షాలు ఎంత గట్టిగా ప్రభావాన్వితంగా గళమెత్తుతాయన్నది ఆసక్తికరం. ఈ పరిస్థితుల్లో ప్రజలకు విశ్వాసం కలిగించేలా ప్రతిపక్షాలు వ్యవహరించకపోతే- వాటి రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది.

- చల్లా విజయభాస్కర్‌

ABOUT THE AUTHOR

...view details