'చట్టసభల ద్వారానే ప్రజలకు ప్రభుత్వాలు జవాబుదారీ అవుతాయి. ఆ సభలు సమర్థంగా పనిచేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ చచ్చుబడిపోతుంది' అని పూర్వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లోగడ హెచ్చరించారు. ఆ దుస్థితిని కళ్లకు కడుతూ పార్లమెంటులో కొన్నేళ్లుగా అవాంఛనీయ సంఘటనలు జోరెత్తుతున్నాయి. తాజా వర్షాకాల సమావేశాల్లోనూ అవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. పట్టువిడుపుల్లేని ప్రతిపక్షాల ధోరణికి అధికారపక్షం పంతం తోడై- ఉభయ సభల్లో నిరసనలు, నినాదాలు హోరెత్తాయి. సభ్యుల అనుచిత ప్రవర్తనకు నొచ్చుకొన్న రాజ్యసభాధ్యక్షులు వెంకయ్యనాయుడు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రజలు ఆశించినట్లుగా సమావేశాలు జరగలేదని ఆక్షేపించిన దిగువ సభాపతి ఓం బిర్లా- 17వ లోక్‌సభ ఆరో సమావేశాలు 22శాతం ఉత్పాదకతకే పరిమితమయ్యాయని ఆవేదన వెలిబుచ్చారు.
127వ రాజ్యాంగ సవరణ బిల్లుపై మినహా లోతైన చర్చలు పూజ్యమైన వేళ- సింహభాగం బిల్లులు నిమిషాల వ్యవధిలోనే సభామోదం పొందాయి. నిర్మాణాత్మక సంవాదాలకు తాము సిద్ధంగానే ఉన్నా, ప్రతిపక్షాలే కలిసి రాలేదని కేంద్రం విమర్శనాస్త్రాలు సంధిస్తే- తాము లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా ఈ దుష్ప్రచారమేమిటని విపక్షాలు విస్మయం వ్యక్తంచేశాయి. పార్లమెంటును స్తంభింపజేయడం రాజ్యాంగానికే అవమానకరమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించగా, కీలక అంశాలపై చర్చకు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఏడు పార్టీల నేతలు నేరుగా రాష్ట్రపతికే లేఖ రాశారు. మొత్తమ్మీద మునుపటి సమావేశాలు కొవిడ్‌తో అర్ధాంతరంగా ఆగిపోతే- ఈసారి పెచ్చుమీరిన ప్రతిష్టంభనలతో షెడ్యూల్‌కు రెండు రోజుల ముందే ముగిసిపోయాయి.
మసకబారిన ప్రతిష్ట
పార్లమెంటు భేటీల ఖరీదు నిమిషానికి రెండున్నర లక్షల రూపాయలని సర్కారు గతంలో లెక్కకట్టింది. వాగ్వివాదాలు, అదుపు తప్పిన అసమ్మతి ప్రదర్శనలు, వాయిదాలతో పరిసమాప్తమైన సమావేశాలతో పెద్దయెత్తున ప్రజాధనం వృథా కావడానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రజాప్రతినిధులపై సామాన్యుల నమ్మకం వమ్ము కాకూడదంటే వారి పనితీరు అత్యుత్తమంగా ఉండాల్సిందేనని ప్రణబ్ దా ఏనాడో హితవు పలికారు. అందుకు భిన్నమైన పోకడలను పుణికిపుచ్చుకొన్న సభ్యుల తీరుతో 'ప్రజాస్వామ్య దేవాలయ' ప్రతిష్ఠే మసకబారిపోతోంది!
వ్యక్తిగత గోప్యతా హక్కును కాలరాసే నిఘా నేత్రాల తీక్ష్ణతకు అద్దంపట్టిన ప్రాజెక్టు పెగాసస్ ప్రకంపనలు పార్లమెంటును పట్టి కుదిపేశాయి. దానితో పాటు రైతు అంశాలపైనా చర్చకు పట్టుపట్టిన ప్రతిపక్షాలు- సమావేశాల్లో దాదాపుగా ప్రతి రోజునూ ఆందోళనలకే అంకితం చేశాయి. పెగాసస్‌పై ప్రధాని సమాధానం చెప్పితీరాల్సిందేనంటూ భీష్మించాయి. ఆ క్రమంలోనే ఆరుగురు తృణమూల్ సభ్యులపై రాజ్యసభలో సస్పెన్షన్ వేటుపడింది. సమావేశాల చివరలో పరిస్థితి పూర్తిగా కట్టుతప్పి- సభాధ్యక్ష స్థానంపైకి నిబంధనల పొత్తం విసిరికొట్టేంతగా వెర్రితలలు వేసింది! కొవిడ్ కల్లోల కాలంలో ఆక్సిజన్ కొరతతో ఎవరూ అసువులు బాయలేదన్న కేంద్రం ప్రకటన తీవ్ర విమర్శల పాలైంది.
ఓబీసీ జాబితా రూపకల్పనలో రాష్ట్రాల అధికారాన్ని పునరుద్ధరించడానికి ఉద్దేశించిన బిల్లును నెగ్గించడంలో పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడమే ఈ సమావేశాల్లో సానుకూలాంశం! వివాదాస్పద ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు సహా తక్కినవాటినీ గందరగోళ పరిస్థితుల నడుమ కేంద్రం తుపాను వేగంతో ఆమోదింపజేసుకుంది. దిగువ సభలో మొత్తం 20 బిల్లులు ఆమోదం పొందగా, ఎగువసభ 19 బిల్లులకు సమ్మతి తెలిపింది. సభ్యుల సమష్టి భాగస్వామ్యంతో కూడిన అర్థవంతమైన చర్చలు, స్థాయీసంఘాల సూక్ష్మస్థాయి పరిశీలనల్లోంచి పురుడు పోసుకునే చట్టాలే ప్రజాహిత శాసనాలు కాగలవు. ఈ కర్తవ్య నిర్వహణలో ప్రజాప్రతినిధుల వైఫల్యం- దేశ ప్రజాస్వామ్య సౌధాన్నే బీటలు వారుస్తుంది! తరతమ భేదాలను విడనాడి రాజకీయ పక్షాలన్నీ ఈ మేరకు రాజ్యాంగ స్ఫూర్తిని ఔదలదాల్చినప్పుడే పార్లమెంటు సమావేశాలు మన్నన పొందగలిగేది!
ఇదీ చదవండి:'ఓబీసీ బిల్లు ఆమోదం ఓ చారిత్రక ఘట్టం'