తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఇమ్రాన్​ ఖాన్​పై దాడి తర్వాత.. అస్తవ్యస్తంగా మారిన పాక్​ రాజకీయాలు!

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై దాడి అనంతరం అక్కడి రాజకీయాలు అస్తవ్యస్తంగా మారాయి. అంతర్గత అలజడులు తలెత్తిన ప్రతిసారీ భారత్‌పై నిందలు మోపడం పాక్‌కు అలవాటుగా మారింది. ఈ క్రమంలో కశ్మీర్‌ సమస్యను తిరిగి లేవనెత్తి, సరిహద్దులో ఉద్రిక్తతలు రగిలించే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

pakisthan politics became chaotic After  attack on Pakistan former Prime Minister Imran Khan
pakisthan politics became chaotic After attack on Pakistan former Prime Minister Imran Khan

By

Published : Nov 21, 2022, 7:07 AM IST

Pakisthan Politics: ఇటీవల పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై జరిగిన హత్యాయత్నం దాయాది దేశంలో ప్రకంపనలు రేపింది. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇమ్రాన్‌ లాహోర్‌ నుంచి ఇస్లామాబాద్‌ వరకూ లాంగ్‌మార్చ్‌ పేరిట సుదీర్ఘ యాత్ర చేపట్టారు. ఈ యాత్రలోనే ఆయనపై దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పుల ఘటనకు ప్రధాని షెహబాజ్‌ తదితరులు సూత్రధారులని ఇమ్రాన్‌ ఆరోపించారు. గాయాల నుంచి కోలుకున్న వెంటనే లాంగ్‌మార్చ్‌ను మరింత ఉద్ధృతంగా కొనసాగిస్తానని ప్రకటించడంతో పాక్‌ ప్రభుత్వం, సైన్యం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి.

భారత్‌పై ప్రశంసలు
ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంతో అధికారం కోల్పోయిన ఇమ్రాన్‌ రాజకీయ ప్రతీకారం తీర్చుకొనేందుకు రగిలిపోతున్నారు. షరీఫ్‌ ప్రభుత్వ చట్టబద్ధతను సవాలు చేస్తూనే, సత్వరమే ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. స్వయంగా ప్రధానే దాడి చేయించారని చెబుతూ, ప్రభుత్వాన్ని బలహీనపరచే ప్రయత్నం చేస్తున్నారు. శాంతిభద్రతల వైఫల్యానికి బాధ్యత వహించాలని సైన్యాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఇమ్రాన్‌ విమర్శలతో ప్రజల్లో ఆదరణ కోల్పోతున్నామనే ఆందోళన సైన్యంలోనూ మొదలైంది. సైనిక నిఘా విభాగం ఇటీవల అనూహ్యంగా విలేకరుల సమావేశం సైతం నిర్వహించి ఇమ్రాన్‌ ఆరోపణల్ని ఖండించింది.

ఇమ్రాన్‌ తన లాంగ్‌మార్చ్‌లో అమెరికాను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకొంది. ఇమ్రాన్‌ పార్టీ పీటీఐ చాలాకాలంగా అమెరికా వ్యతిరేక మనోభావాల్ని రేకెత్తించడాన్ని రాజకీయ ఎత్తుగడగా ఉపయోగిస్తోంది. ఆ క్రమంలో భారత్‌ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ఇమ్రాన్‌ పదేపదే ప్రశంసిస్తున్నారు. పాక్‌కు చెందిన ఓ ప్రధాన రాజకీయవేత్త అలా భారత్‌ను పొగడటం అరుదైన విషయం. 'ఈ దేశానికి ఉపయోగపడే నిర్ణయాలు దేశం లోపలే తీసుకోవాలి. రష్యా చౌకగా అందిస్తున్న ముడిచమురును భారత్‌ దిగుమతి చేసుకొంటోంది. తన ప్రయోజనాలు కాపాడుకొనే విషయంలో భారత్‌ ఏ దేశం ఒత్తిళ్లకూ లొంగదు. పాక్‌ మాత్రం అమెరికా ఒత్తిడితో అలాంటి అవకాశాలను వదులుకుంటోంది. నేను స్వేచ్ఛాయుత పాకిస్థాన్‌ను చూడాలనుకుంటున్నాను. న్యాయం గెలవాలి. ప్రజలకు భద్రత కావాలి' అంటూ సాగుతున్న ఇమ్రాన్‌ ప్రసంగాలకు మంచి స్పందన లభిస్తోంది. ఇమ్రాన్‌ లాంగ్‌మార్చ్‌ మార్గంలోని ప్రతి పట్టణంలో పదుల సంఖ్యలో బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు.

ఈ యాత్ర పునఃప్రారంభమైతే ఆటంకాలు ఎదురుకావచ్చు. ఉద్దేశపూర్వకంగా అల్లర్లు జరిగి, యాత్రలో పోలీసులు, సైన్యం జోక్యానికి దారితీసేలా పరిస్థితులు మారతాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పాక్‌లో గతంలో ఇలాంటి అల్లర్లే సైనిక జోక్యానికి దారితీసి చివరికి ప్రజాప్రభుత్వాలు కూలిపోయాయి. అధికారం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. పాక్‌ సైన్యాధిపతి కమర్‌ జావేద్‌ బాజ్వా త్వరలోనే పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తన వారసుడిని ఎంపిక చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. చట్ట ప్రకారం ప్రస్తుత సైన్యాధిపతి అందించే జాబితా నుంచి ఒకరిని తదుపరి సైన్యాధిపతిగా ప్రభుత్వం ఎంపిక చేయాలి. అయితే, కొత్త సైన్యాధిపతి ఎంపిక కోసం బాజ్వా అభిప్రాయాన్ని ప్రధాని షెహబాజ్‌ పక్కనపెట్టి ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారన్న విమర్శలు రేగాయి. దాన్ని ఆసరాగా చేసుకొని బాజ్వా కొత్త ఎత్తుగడలు వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌ రాజకీయాల్లో సైన్యం నేరుగా జోక్యం చేసుకుంటుందా అన్నదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న.

ప్రజల దృష్టి మళ్ళించేందుకు...
పాక్‌ కొన్నేళ్లుగా విదేశీ రుణభారంతో సతమతమవుతోంది. విదేశ మారక నిల్వలు అడుగంటిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం బాగాలేదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ ఇటు ప్రభుత్వంపై, అటు సైన్యంపై విరుచుకుపడుతున్నారు. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి అక్కడి మంత్రులు కశ్మీర్‌ సమస్యను లేవనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాక్‌ సైన్యం కశ్మీర్‌ సరిహద్దులో తిరుగుబాటును ప్రోత్సహించవచ్చని భారత సైన్యాధిపతి సైతం ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. పాక్‌ కుతంత్రాలను సమర్థంగా అడ్డుకొనేలా భారత్‌ అప్రమత్తతతో వ్యవహరించాలి.

ABOUT THE AUTHOR

...view details