దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంత విధంగా పతనం అంచున వేలాడుతోంది. ఈ సంక్షోభ సుడిగుండం నుంచి దాయాది దేశం ఇప్పట్లో బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. రాజకీయ అస్థిరత ఆ దేశాన్ని మరింత దయనీయ పరిస్థితుల్లోకి నెడుతోంది. తాము దివాలా స్థితిలో బతుకుతున్నామంటూ పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు.. ఆ దేశ రాజకీయ నాయకత్వ బేలతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇంత దారుణ పరిస్థితుల్లో ఉన్న పాకిస్థాన్.. గురువారం జరిగిన ఐక్యారాజ సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో కశ్మీర్ సమస్యను మరోసారి లేవనెత్తింది. దీన్ని భారత్ తప్పుపట్టింది.
వేర్పాటువాదం..కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్‌కు సరిహద్దు ప్రాంతాల్లో మరో వేర్పాటువాద సమస్య ఎదురైంది. సరిహద్దు ప్రాంతాల నుంచి గిరిజనులు వస్తున్న కారణంగా అక్కడ వేర్పాటువాద నినాదం వినిపిస్తోంది. 1971లో బంగ్లాదేశ్ కోసం, ఆ తర్వాత తూర్పు పాకిస్థాన్ కోసం వేర్పాటువాద ఉద్యమానికి మద్దతు ఇచ్చిన భారత్‌పై పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. 1980లో జరిగిన ఖలిస్థాన్ ఉద్యమానికి దాయాది దేశం మద్దతు పలికింది. సిక్కులు తమకు సొంత దేశం కావాలని చేసిన డిమాండ్ ఆధారంగా భారత్‌ను విభజించేందుకు విఫలయత్నం చేసింది పాక్. ఆ తర్వాత కశ్మీర్‌పై దృష్టి పెట్టింది. అంతకుముందు పలుమార్లు కశ్మీర్‌ను తమ దేశంలో విలీనం చేయడానికి యత్నించింది.
కశ్మీర్ సమస్యపై ఆధారపడే పార్టీలు.. అంతర్గత, బాహ్య వైరుధ్యాల వల్లే తమ దేశ ఆర్థిక వనరులు హరించుకపోయాయనే విషయాన్ని పాకిస్థాన్ పూర్తిగా మరిచిపోయింది. పాక్ ప్రభుత్వం.. తన బడ్జెట్లో ఎక్కువ భాగాన్ని సైన్యానికి ఖర్చు చేస్తోంది. ఎందుకంటే.. అఫ్ఘనిస్థాన్ వల్ల తమ సరిహద్దుల్లో గట్టి నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా దాయాది దేశంలో ఏ పార్టీ అయినా కశ్మీర్ వేర్పాటువాదులపై ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే ఏ నాయకుడూ కశ్మీర్ సమస్యపై వ్యతిరేకంగా మాట్లాడలేరు.