కశ్మీర్‌పై పాకిస్థాన్‌ది ఎప్పుడూ రెండు నాల్కల ధోరణే. అంతర్జాతీయ వేదికలమీద భారత్‌పై విషం చిమ్ముతూ.. కశ్మీర్ విషయంలో అసత్యాలు, అర్ధసత్యాలు వల్లిస్తూ పాకిస్థాన్ దశాబ్దాలుగా కాలం నెట్టుకొస్తోంది. అవాస్తవాలను ప్రచారం చేసి ఏదో రకంగా ప్రపంచదేశాలను పక్కదారి పట్టించి, భారత్‌ను వాటిముందు దోషిగా నిలబెట్టాలన్న 'ఇస్లామాబాద్' ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. 'కశ్మీర్ సంఘీభావ దినం' పేరిట గడచిన 30 ఏళ్లుగా ఫిబ్రవరి 5న పాక్ ప్రభుత్వం దేశమంతటా సెలవు పాటిస్తోంది. కశ్మీరీలకు మద్దతు అంటూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి అక్కడి నాయకత్వం హడావుడి చేస్తోంది.
అలా ఆరంభమైంది..
మూడు దశాబ్దాల క్రితం పాకిస్థాన్‌లో ఎన్నికల వేళ జమాతే ఇస్లామీ అధినేత డిమాండ్ మేరకు- రాజకీయ అవసరాల దృష్ట్యా నాటి పాలక పక్షం 'సంఘీభావ దినం' ప్రారంభించింది. కశ్మీర్ పేరు చెప్పి ఏదో రకంగా ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునేందుకు పాక్ రాజకీయ పక్షాలు మొదటినుంచీ తహతహలాడుతున్నాయి. ఇస్లామాబాద్ నాయకత్వం ప్రతి కదలికనూ ఐఎస్‌ఐ వంటి నిఘా సంస్థలు శాసిస్తుంటాయన్నది బహిరంగ రహస్యం. నిఘా సంస్థల దిశానిర్దేశాల మేరకే అక్కడ 'కశ్మీర్ సంఘీభావ దినం' నిర్వహిస్తున్నారన్నదీ కాదనలేని వాస్తవం.
అహేతుక వాదనలు ప్రచారం..
భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్‌పై అంతర్జాతీయ వేదికల మీద, అనేక అబద్ధాలు వ్యాప్తి చేసేందుకు పాక్ నాయకత్వం నిర్విరామంగా ప్రయత్నిస్తోంది. కశ్మీరీలతో ఉద్వేగ, సాంస్కృతిక బంధం ముడివడి ఉన్నందువల్ల స్వయం నిర్ణయాధికార సాధనలో వారికి మద్దతుగా నిలవడం, సంఘీభావం ప్రకటించడం తమ బాధ్యతన్న ఓ అహేతుక వాదనను ఇస్లామాబాద్ నాయకత్వం ప్రచారం చేస్తోంది. నిజానికి జమ్మూ-కశ్మీర్ ప్రాంతంలోని ప్రజలు భిన్న జాతులకు, విభిన్న సాంస్కృతిక నేపథ్యాలకు చెందినవారు. ఉదాహరణకు కశ్మీర్, జమ్ము, లద్దాఖ్ ప్రజల జీవన విధానాలు వైవిధ్యభరితమైనవి. ఒకరితో మరొకరికి బొత్తిగా సంబంధంలేని సాంస్కృతిక విభిన్నతలు వారివి. నిజానికి కశ్మీరీలతో ఏమాత్రం ఉద్వేగభరిత అనుబంధం ఉన్నా- పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను మరిన్ని ముక్కలుగా విభజించి, అక్కడ చైనా ఆధిపత్యం పాదుకునేందుకు పాకిస్థానీ ప్రభుత్వం అవకాశం ఇచ్చేది కాదు. కాబట్టి.. కశ్మీరీలతో ఉద్వేగబంధం పేరిట పాక్ చెబుతున్నవన్నీ అహేతుక ప్రేలాపనలే. మరోవంక 'కశ్మీరీలకు సంఘీభావం' అంటూ ఇస్లామాబాద్ చెబుతున్నవన్నీ డొల్లమాటలే.
కశ్మీరీలను చేరదీసి..
పాక్ సైన్యం, నిఘా సంస్థలు కశ్మీరీ యువతను చేరదీసి వారిలో నిరంతరం భారత వ్యతిరేక విషబీజాలు నాటుతున్నాయి. అక్కడి యువతను దారితప్పిస్తున్నాయి. వారిని రెచ్చగొట్టి ప్రశాంత కశ్మీరంలో నిరంతరం హింసాగ్ని జ్వాలలు ఎగదోస్తున్నాయి. దశాబ్దాలుగా కశ్మీరీ యువత భవితను పణం పెట్టి హింసాద్వేషాలు రాజేస్తున్న పాకిస్థాన్‌కు కశ్మీరీలపట్ల సంఘీభావం ఉందంటే నమ్మేదెవరు? నాలుగేళ్ల క్రితం వేర్పాటుమూకలకు నాయకత్వం వహించిన బుర్హాన్ వానీ మరణాన్నీ కశ్మీర్‌లో సంక్షోభం సృష్టించేందుకే ఇస్లామాబాద్ నాయకత్వం వాడుకుంది. ఉగ్రవాద మూకలను దొడ్డిదారిన భారత్‌లోకి పంపించడం, హింసోన్మాదం రాజేసి కశ్మీర్‌లో మారణకాండ సృష్టించడం... శత్రుబంధం ఉన్నవారే తప్ప ఉద్వేగబంధం కలిగిన వారు చేయదగిన పనులు కావు.
నాడు మూగబోయిన గళం..
మిలిటరీ బాసుల అదుపాజ్ఞల్లో ఊపిరి పీల్చే అక్కడి రాజకీయ పార్టీలు ఎన్నికల నినాదంగా అక్కరకొస్తుంది అనుకున్నప్పుడు- కశ్మీర్ నినాదాన్ని బలంగా నెత్తికెత్తుకుంటాయి. దానివల్ల పెద్దగా ఓట్లు రాలవని భావిస్తే మాత్రం మౌనం దాలుస్తాయి. మిలిటరీనుంచి అరువు తెచ్చుకున్న గొంతుతో కశ్మీరీల గురించి అప్పుడప్పుడూ మాట్లాడే ఇమ్రాన్‌ఖాన్- 2008నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ ఊసే ఎత్తలేదు. ఆయన సారథ్యంలోని తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ(పీటీఐ) గళం ఆ ఎన్నికల్లో ఒక్కసారిగా మూగబోయింది. నాటి పరిస్థితుల్లో కశ్మీర్ నినాదం ఓట్లు రాల్చదని గ్రహించిన ఆ పార్టీ కశ్మీర్ మాటను పూర్తిగా పక్కనపెట్టేసింది.
కశ్మీరీలపై పాక్ నాయకగణం ఒలకబోసే ప్రేమ వాటికి కేవలం ఒక రాజకీయ అవసరం మాత్రమేనని దీన్నిబట్టి తేటతెల్లమవుతోంది. పాక్ వినిపించే ప్రతి మాట వెనకా కొంతకాలంగా చైనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పీఓకే ద్వారా 'ఆర్థిక నడవా'ను తలపెట్టిన చైనా నాయకత్వం, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆ తతంగాన్ని పూర్తి చేసేందుకు జమ్ముకశ్మీర్‌లో భారత్‌ను వీలైనంత బలహీనపరచాలని భావిస్తోంది. ఆ క్రమంలో పాక్‌ను అది పావుగా ఉపయోగించుకుంటోంది. కశ్మీర్‌ను అంతర్జాతీయ వివాదాంశంగా మార్చేందుకు కొన్ని దశాబ్దాలుగా అన్ని ప్రయత్నాలూ చేసి విఫలమైన ఇస్లామాబాద్ నాయకత్వం, ఇప్పుడు పూర్తిగా చైనా కనుసన్నల్లో వ్యవహరిస్తోంది. పాక్‌తో జతకలిసి చైనా సైతం కశ్మీర్ విషయంలో మన దేశాన్ని ఇబ్బందుల్లోకి తోసేందుకు కుట్రలు పన్నుతున్న తరుణంలో- భారత్ మరింత అప్రమత్తంగా మెలగాల్సిన అవసరం ఉంది.
- కె.ఎం.బాబు, రచయిత
ఇదీ చదవండి:చైనా దూకుడుకు కళ్లెం వేస్తాం: బైడెన్ సర్కార్