తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆలోచన మంచిదే కానీ.. ఉమ్మడి కార్యక్రమం అవసరం! - విపక్షాల కూటమి

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో తాజాగా సమావేశమైన 19 పార్టీలు- సమష్టి కార్యాచరణకు ఓటేశాయి. కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ సెప్టెంబరులో దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలకు పిలుపిచ్చాయి. అయితే.. అధికారమే లక్ష్యంగా పురుడుపోసుకునే కూటములతో దేశానికి ఎటువంటి మేలూ ఒనగూరదన్నది నిష్ఠుర సత్యం. ప్రజాస్వామ్య సిద్ధాంతాల ప్రాతిపదికన తమ కార్యాచరణ ఏమిటో ప్రజల ముందు ఉంచితేనే విపక్షాల ఐక్య పోరాటం అర్థవంతమవుతుంది.

oppositions
విపక్షాలు

By

Published : Aug 23, 2021, 8:15 AM IST

భావి సార్వత్రిక సమరంలో విజయమే అంతిమలక్ష్యంగా విపక్షాలు ఐక్యతారాగం ఆలపిస్తున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో తాజాగా సమావేశమైన 19 పార్టీలు- సమష్టి కార్యాచరణకు ఓటేశాయి. కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ సెప్టెంబరులో దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలకు పిలుపిచ్చాయి. బలమైన భాజపాను ఢీకొట్టాలంటే సంఘటిత పోరాటం మినహా మరో మార్గం లేదని సోనియా సూత్రీకరిస్తే, భాగస్వామ్య పక్షాల ఉమ్మడి నాయకత్వంలో సమరం సాగిద్దామని మమత ప్రతిపాదించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిందేనని శరద్‌పవార్‌ ఉద్ఘాటించగా- కూటమి పట్ల ప్రజల్లో విశ్వాసం కూడగట్టడానికి శ్రమించాలని ఉద్ధవ్‌ ఠాక్రే హితవు పలికారు.

ఆ విధానాలేమిటో ప్రకటించాలి..

నలుగురు ముఖ్యమంత్రులతో పాటు ప్రాంతీయ, జాతీయ పార్టీల కీలక నేతలు హాజరైన వర్చువల్‌ భేటీకి బీఎస్‌పీ, ఆప్‌లకు పిలుపందలేదు. ఆహ్వానం వెళ్లినా సరే, సమాజ్‌వాదీ పార్టీ సారథి అఖిలేశ్‌ గైర్హాజరయ్యారు. మోదీ వ్యతిరేకతలోంచి పురుడుపోసుకున్న మహాకూటమి లోగడే విఫలమైంది. రాజకీయ లెక్కలతో ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్లలో కూటమి కట్టిన పార్టీలకు ప్రజల నుంచి తిరస్కారమే ఎదురైంది. భాజపాను బరిలోంచి తప్పించడానికి కర్ణాటకలో అప్పటికప్పుడు జట్టుకట్టిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణం మూన్నాళ్ల ముచ్చటగా ముగిసిపోయింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కలహాల కాపురంతో మహారాష్ట్ర రాజకీయాలు తరచూ వేడెక్కుతున్నాయి. అవే పార్టీలు ఇప్పుడు మళ్ళీ పొత్తుల పాటపాడుతున్నాయి! సైద్ధాంతిక అజెండా లుప్తమైన సమష్టి సమరంతో మార్పు అసాధ్యమన్నది చరిత్ర చెబుతున్న పాఠం. జనహితమే పరమావధిగా ముందడుగు వేస్తున్నామంటున్న విపక్షాలు- దేశాభివృద్ధికి తాము అనుసరించబోయే ప్రత్యామ్నాయ విధానాలేమిటో ప్రకటించాలి. ఆ మేరకు కనీస ఉమ్మడి కార్యక్రమంతో ముందుకు రాకపోతే కూటమి రాజకీయాలు మరోసారి విఫల ప్రయోగం కాకమానవు.

ఆ కీలకాంశాన్ని విస్మరించి..

సంకీర్ణ రాజకీయాలు సఫలీకృతం కావాలంటే పార్టీలు పట్టువిడుపులు ప్రదర్శించక తప్పదని ప్రణబ్‌ ముఖర్జీ గతంలోనే స్పష్టీకరించారు. తద్భిన్నంగా సీట్ల కోసం పోట్లాటలతో పొత్తులు విచ్ఛిన్నమైన ఘటనలు రాష్ట్రాల్లో కోకొల్లలు. క్షేత్రస్థాయిలో బలం కొడిగట్టినా పెద్దన్న పాత్రను వదులుకోవడానికి సుతరామూ ఇష్టపడని కాంగ్రెస్‌ వ్యవహారశైలి- మిత్రులకు మింగుడుపడకపోవడమూ మామూలే! తాజా భేటీలో ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌ ఆ విషయాన్నే అన్యాపదేశంగా గుర్తుచేశారు. బలమైన ప్రాంతీయ పక్షాలకే రాష్ట్రాల్లో కూటమి సారథ్య బాధ్యతలను అప్పగించాలని గళమెత్తారు. భాజపా ఏలుబడిలో దేశంలో ప్రజాస్వామ్య విలువలు కొల్లబోతున్నాయని ప్రతిపక్షాల ఉమ్మడి ప్రకటన ఆందోళన వ్యక్తంచేసింది. తాము అధికారం చలాయిస్తున్న రాష్ట్రాల్లోని పరిస్థితులను ప్రజలు తప్పక గమనిస్తుంటారన్న స్పృహే కొరవడింది. ఆ కీలకాంశాన్ని విస్మరించి జాతీయ స్థాయిలో కన్నీళ్లు ఒలకబోస్తే మాత్రం ఒరిగేదేముంటుంది?

అదా ప్రభుత్వంపై పోరాటం?

ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు కలిసికట్టుగా కదంతొక్కాయని, ఆ స్ఫూర్తిని ఇకపైనా కొనసాగించాలని సోనియా చెబుతున్నారు. రైతుల బాధల నుంచి భిన్న రంగాలపై కొవిడ్‌ దుష్ప్రభావం వరకు సమకాలీన సమస్యలపై ఉభయ సభల్లో చర్చలు సాగిందెక్కడ? ప్రతిపక్షాల మొండి వైఖరికి అధికారపక్షం మంకుపట్టు తోడై విలువైన సభాసమయం పూర్తిగా హరించుకుపోయింది. దీన్ని ప్రభుత్వంపై పోరాటంగా భావించి భుజాలు చరచుకోవడమేమిటి? ప్రజా మద్దతును కూడగట్టుకోవాలంటే- ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే స్వీయధోరణులపై పార్టీలన్నీ ఆత్మశోధనకు సిద్ధపడాల్సిందే! అధికారమే లక్ష్యంగా పురుడుపోసుకునే కూటములతో దేశానికి ఎటువంటి మేలూ ఒనగూరదన్నది నిష్ఠుర సత్యం. ప్రజాస్వామ్య సిద్ధాంతాల ప్రాతిపదికన తమ కార్యాచరణ ఏమిటో ప్రజల ముందు ఉంచితేనే విపక్షాల ఐక్య పోరాటం అర్థవంతమవుతుంది. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలకు తమవైన పరిష్కార మార్గాలను సూచించే కనీస ఉమ్మడి కార్యక్రమం రూపకల్పనలో ప్రతిపక్షాల చిత్తశుద్ధే- కొత్త కూటమికి ప్రాణవాయువుగా మారుతుంది!

ఇదీ చూడండి:'మన లక్ష్యం 2024- కలిసి ముందుకు సాగుదాం!'

ఇదీ చూడండి:2022 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్​ సమాయత్తం!

ABOUT THE AUTHOR

...view details