Opposition No Confidence Motion : కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోనుంది. బుధవారం ఉదయం విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. చర్చతోపాటు ఓటింగ్ అనుమతించారు. తీర్మానంపై చర్చకు తేదీని.. అన్ని పార్టీలతో చర్చించాక ప్రకటిస్తానని స్పీకర్ వెల్లడించారు.
అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి?
What Is No Confidence Motion : ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెడతాయి. కనీసం 50 మంది సభ్యుల సంతకాలతో ఈ తీర్మాన నోటీసును లోక్‌సభ స్పీకర్‌కు అందజేయాలి. తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కారణం చూపాల్సిన అవసరం లేదు. దీని గురించి రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. కానీ లోక్‌సభ నియమావళిలోని రూల్ నం.198లో దీని ప్రస్తావన ఉంది. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ పార్లమెంట్- 1950 చట్టాన్ని అనుసరించి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు.
ఎవరెవరు నోటీసులు ఇచ్చారు?
No Confidence Vote 2023 : మణిపుర్ హింస అంశంపై చర్చించేందుకు.. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు.. అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగొయ్, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ నామా నాగేశ్వరరావు విడివిడిగా స్పీకర్ కార్యాలయానికి తీర్మాన నోటీసులు ఇచ్చారు.
నోటీసులు ఎందుకిచ్చారు?
No Confidence Loksabha : మణిపుర్‌పై పార్లమెంటులో చర్చ జరిగేందుకు గల పలు మార్గాలను నేతలు పరిశీలించారని.. అవిశ్వాసం అనేది అత్యుత్తమ మార్గంగా నిర్ణయించినట్లు విపక్ష కూటమి వర్గాలు వెల్లడించాయి. అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని మాట్లాడటం సహా తమకు కూడా పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి. మంగళవారం ఉదయం సమావేశమైన విపక్షాలు ఈ విషయమై చర్చించాయి.
No Confidence Congress : స్పీకర్ ఆఫీస్‌కు తీర్మాన నోటీసులు ఇచ్చేముందు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్.. బీజేపీపై మండిపడ్డారు. పార్లమెంట్‌లో మణిపుర్ అంశంపై ప్రకటన చేసేంత ఆత్మవిశ్వాసం లేని ప్రధానిపై 'ఇండియా' ఫ్రంట్‌కు విశ్వాసం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. "పార్లమెంట్‌లో ప్రకటన చేయడంలో ప్రధానికి విశ్వాసం లేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించే వరకు మణిపుర్‌లో మహిళలపై జరిగిన దారుణంపై మౌనంగా ఉన్నారు. బ్రిజ్ భూషణ్ వ్యవహారంపై కూడా మౌనంగానే ఉన్నారు. చైనా మన భూభూగాన్ని ఆక్రమించలేదని చెప్పారు. అలాంటప్పుడు 'ఇండియా' ఎలా విశ్వసించగలదు?" అని సిబల్ ట్వీట్‌లో ప్రశ్నించారు.
స్పీకర్ ఏం చేస్తారు?
No Confidence Vote Speaker : అయితే విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులను అనుమతించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. తదుపరి అన్ని పార్టీలతో చర్చించి చర్చకు తేదీని ప్రకటించనున్నారు. తీర్మానాన్ని ఆమోదించిన రోజు నుంచి 10 రోజుల్లోపు చర్చకు తేదీని నిర్ణయించాలి. అధికార, విపక్ష పార్టీల బలాబలాల ఆధారంగా చర్చకు స్పీకర్ సమయం కేటాయిస్తారు. ముందుగా అధికార ఎంపీలు మట్లాడాక.. విపక్ష ఎంపీలు మాట్లాడుతారు.
ఎన్డీఏకే బలం.. 'ప్రభుత్వ వైఫల్యాల్ని' ఎండగట్టడమే లక్ష్యం
No Confidence Motion BJP : స్పీకర్ నిర్ణయించిన రోజున లోక్‌సభలో చర్చ జరుగుతుంది. అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. అందులో తీర్మానం నెగ్గితే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది. అయితే ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 330 మంది సభ్యుల మద్దతు ఉంది. విపక్ష కూటమి 'ఇండియా'కు 140 మంది సభ్యులున్నారు. మరో 60 మందికిపైగా ఎంపీలు ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం దాదాపు ఖాయమే అయినప్పటికీ.. కేవలం మణిపుర్ అంశంలో చర్చల కోసం ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏకు పూర్తి బలం ఉన్నా.. తమకు గద్దె దించడంకన్నా 'ప్రభుత్వ వైఫల్యాల్ని' ఎండగట్టాలన్నదే తమ లక్ష్యమని విపక్ష నేతలు చెబుతున్నారు.
మోదీ అప్పుడే ఊహించారా?
No Confidence Vote Prediction Modi : ఈ అవిశ్వాసాన్ని ప్రధాని మోదీ నాలుగేళ్ల క్రితమే ఊహించారు! ఇందుకు సంబంధించిన పాత వీడియో ఒకటి తాజాగా బయటికొచ్చింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మోదీ దీని గురించి ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ఆ సమయంలో "2023లోనూ నాపై అవిశ్వాసం తీసుకొచ్చేలా మీకు అవకాశం రావాలి. అందుకు మీరు సిద్ధమవ్వాలని కోరుకుంటున్నా" అని మోదీ అన్నారు. దీంతో అధికార పక్ష సభ్యులు నవ్వులు చిందించారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని ఎద్దేవా చేస్తూ నాడు మోదీ ఇలా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
"ఒకప్పుడు లోక్‌సభలో 400కు పైగా స్థానాలు సాధించిన కాంగ్రెస్ 2014లో దాదాపు 40 స్థానాలకు పరిమితమైంది. వారి అహంకారం వల్ల జరిగిన పరిణామం అది. కానీ, మా సేవాభావం వల్లే బీజేపీ రెండు స్థానాల నుంచి ఒంటరిగా అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగింది" అని మోదీ ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. ఈ వీడియోను దూరదర్శన్ (డీడీ న్యూస్) ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇంతకు ముందుకు ఎన్నిసార్లు?
No Confidence Motion How Many Times In India : అవిశ్వాస తీర్మానాన్ని మొదటిసారిగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంపై 1963లో జేబీ కృపలానీ ప్రవేశపెట్టారు. 62 మంది సభ్యులు తీర్మానాన్ని సమర్థించగా, 347 మంది సభ్యులు వ్యతిరేకించారు. దీంతో నెహ్రూ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
- ఇందిరాగాంధీ ప్రభుత్వంపై 15 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినప్పటికీ అవన్నీ విఫలమయ్యాయి.
- ఒకే పదవీకాలంలో (5 సంవత్సరాల వ్యవధి) పీవీ నరసింహారావు ప్రభుత్వంపై 8 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినప్పటికీ విఫలమయ్యాయి.
- 1999లో అటల్ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కేవలం ఒక్క ఓటు తేడాతో నెగ్గడం వల్ల వాజ్‌పేయీ ప్రభుత్వం అధికారానికి దూరమైంది.
- 2018లో మోదీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది.