"2024లో భారత దేశంలో యూపీఏ-3 అధికారంలోకి రావడం సాధ్యమే. కానీ.. అలా జరగాలంటే విపక్షాలకు ఉమ్మడి వ్యూహం, అందుకు తగిన అజెండా ఉండాలి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అభ్యర్థుల్ని ఎంపిక చేసే విషయంలో విపక్ష పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలి."
--కపిల్ సిబల్, కాంగ్రెస్ మాజీ నేత
Opposition meeting in Patna : ఉమ్మడి వ్యూహం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమి విజయానికి దోహదం చేసే రెండు కీలకాంశాలు. కానీ.. ఇన్నాళ్లు ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్న విపక్షాలు.. ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగడం సాధ్యమేనా? సీట్ల పంపకంలో సర్దుకుపోయే వైఖరి ప్రదర్శించగలవా? ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే తగువు లేకుండా.. బీజేపీని ఎదుర్కోవడమే ఏకైక లక్ష్యంగా కలిసి పనిచేయగలవా? రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన ఈ ప్రశ్నలకు.. జూన్ 23న పట్నాలో జరిగే విపక్ష నేతల భేటీతో సమాధానాలు లభించే అవకాశముంది.
17 పార్టీలు.. ఒకటే లక్ష్యం!
Opposition unity Nitish Kumar : భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా నిలిచి, కేంద్రంలో అధికారంలో రావాలన్న లక్ష్యంతో దేశంలోని విపక్ష పార్టీలు ఏకతాటిపైకి వస్తున్నాయి. జూన్ 23న బిహార్ రాజధాని పట్నాలో సమరశంకాన్ని పూరించేందుకు సిద్ధమయ్యాయి. ఆ రాష్ట్రంలోని మిత్రపక్షాలైన అధికార జేడీయూ-ఆర్జేడీ కలిసి అత్యంత కీలక సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని 17 బీజేపీయేతర పార్టీలకు ఆహ్వానాలు పంపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ; బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ; దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్; తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్; సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు ఇతర చిన్న పార్టీల అగ్ర నాయకులు ఈ భేటీకి హాజరుకానున్నారు.
'కర్ణాటక' జోష్‌తో దిల్లీపై గురి!
Opposition unity Karnataka : కమలదళం జైత్రయాత్ర.. విపక్షాల్లో నైరాశ్యం.. ఎవరిదారి వారిదే అన్నట్టు పయనం.. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మారేందుకు ప్రాంతీయ పార్టీల ఆరాటం.. కొంతకాలం క్రితం జాతీయ రాజకీయాల తీరిదే. కర్ణాటక శాసనసభ ఎన్నికల తర్వాత లెక్క మారింది. కలిసి పనిచేస్తే బీజేపీని ఓడించడం సాధ్యమేనన్న వాదనకు ఊతం లభించింది. కాంగ్రెస్ లేకుండా జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయం అసాధ్యమన్న విషయం సుస్పష్టమైంది. అందుకే ఇప్పుడు అన్ని పార్టీలు ఏకతాటిపైకి వస్తున్నాయి. కర్ణాటక మేజిక్‌ను దిల్లీలోనూ పునరావృతం చేయాలని ఆశిస్తున్నాయి.
"రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోంది. తమిళనాట డీఎంకే కూటమి పార్టీలు చూపిన ఐక్యత.. దేశమంతా వ్యాపిస్తుంది. బీజేపీని ఓడించలేరని భ్రమ కల్పిస్తూ అసత్యాలతో నిర్మించిన పునాదుల్ని కదిలిస్తుంది. ఓటమి తథ్యమని బీజేపీకి అర్థమైంది. ప్రత్యర్థుల్ని రాజకీయంగా ఎదుర్కోలేక.. బీజేపీ తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలా పిరికి, అహంకారపూరిత చర్యలకు దిగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం.. నిరంకుశ బీజేపీ పతనానికి నాంది." అని ఇటీవల వ్యాఖ్యానించారు డీఎంకే అధినేత స్టాలిన్. మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
2024 opposition unity : అయితే.. "కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితం.. బీజేపీని ఓడించడం సాధ్యమనేందుకు ఓ ఉదాహరణ. అలా అని ఈ ఫలితాల ఆధారంగా 2024 ఎన్నికల గురించి మాట్లాడడం సరికాదు. లోక్‌సభ ఎన్నికలు.. పూర్తిగా భిన్నమైన అంశాల ఆధారంగా జరుగుతాయి. 2024 సమరం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కాదు.. ఆయన సిద్ధాంతాలపై జరగాలి." అంటూ ఇటీవల ఓ వార్తా సంస్థ ముఖాముఖి ద్వారా విపక్షాలను హెచ్చరించారు సీనియర్ నేత కపిల్ సిబల్.
1977 ఫార్ములాతో ముందుకు..
Opposition meeting in Bihar : కర్ణాటక తరహాలో బీజేపీని ఓడిస్తామన్న విశ్వాసం ఓవైపు.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు వ్యత్యాసం ఉంటుందన్న విశ్లేషణలు మరోవైపు! ఇప్పుడు ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించి, వ్యూహాత్మకంగా ముందుకు సాగడమే విపక్ష కూటమి ముందున్న అసలు సవాల్. దీనితోపాటు ఆయా పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిన విషయాలు అనేకం. వాటిలో ముఖ్యమైంది.. ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు? నరేంద్ర మోదీ ప్రజాకర్షక శక్తికి సరితూగగల విపక్ష కూటమి నేత ఎవరు?
"ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు మాకు ప్రాధాన్యాంశం కాదు. 1977లోనూ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. అప్పుడు జనతా పార్టీ గెలిచింది, మోరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. 1977లో అలా జరిగినప్పుడు.. ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు? బీజేపీకి ఓ ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఇప్పుడు మాపై ఉంది. మేము అంతా కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తేనే ఆ ప్రత్యామ్నాయాన్ని అందించగలం. తర్వాత వచ్చే ఫలితమే.. భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది." అని దిల్లీలో ఇటీవల ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత శరద్ పవార్. తద్వారా.. జూన్ 23న జరిగే భేటీలో ప్రధాని అభ్యర్థిత్వంపై చర్చ ఉండబోదని తేల్చిచెప్పారు. ఈ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్న నేతలూ.. ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
మరి ఏం చర్చిస్తారు?
పట్నా సమావేశం.. విపక్ష పార్టీల ఉమ్మడి అజెండాపై ఖరారు చేయడంపై ప్రధానంగా చర్చించనుందని సమాచారం. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక రంగంలో ప్రభుత్వ వైఫల్యాలు, నోట్ల రద్దు వంటి అనాలోచిత నిర్ణయాలు, జీఎస్టీ అమలులో లోపాలపై దృష్టిపెట్టనున్నారని తెలిసింది. మతసామరస్యం, ప్రజాస్వామ్య హననం, ప్రభుత్వ సంస్థల దుర్వినియోగంపైనా కేంద్రాన్ని ఎండగట్టేలా విపక్ష కూటమి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారని సమాచారం. కులగణన.. జూన్ 23 భేటీలో మరో కీలకాంశం కానుందట. బిహార్‌లోని కొందరు బీజేపీ నేతలు కూడా కులగణనకు అనుకూలంగా మాట్లాడినందున.. ఈ వ్యవహారానికి జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టాలని విపక్ష నేతలు భావిస్తున్నారని తెలిసింది.
విపక్షాలను ఏకతాటిపై తీసుకొచ్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ తన వంతు ప్రయత్నాలు చేశారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి.. బీజేపీయేతర పార్టీల నేతలను కలిసి ఐక్యంగా పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. జూన్ 23న జరిగే భేటీ కూడా ఆయన ఆలోచన. అయితే.. ఇకపై విపక్షాల మధ్య చర్చలన్నింటిలో శరద్ పవార్ కీలక భూమిక పోషించనున్నట్లు తెలిసింది. విపక్ష కూటమి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ముసాయిదాను ఆయనే పట్నా సమావేశంలో అందరి ముందు ఉంచనున్నారని సమాచారం.
విపక్ష పార్టీల జట్టుకు రాష్ట్రాల్లో మద్దతు కూడగట్టడంపైనా జూన్ 23 భేటీలో సమాలోచనలు చేస్తారని తెలిసింది. రాష్ట్రాలకు వెళ్లి, స్థానిక నేతలతో చర్చించేందుకు సీనియర్ నాయకులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయడం.. పట్నా సమావేశం అజెండాలో ఓ అంశమట.