దేశంలో కొవిడ్ కేసులు మళ్ళీ జోరెత్తుతున్న తీరు తీవ్రంగా కలవరపరుస్తోంది. నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్ విధింపు దరిమిలా నిన్నటి నుంచీ ఇండోర్, భోపాల్, సూరత్, రాజ్‌కోట్, అహ్మదాబాద్, వడోదరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలుపరచాల్సి రావడం వైరస్ మలిదశ ఉద్ధృతిని కళ్లకు కడుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తకేసులు 28వేలకు పైబడటం- ప్రధాని మోదీ మాటల్లో, పెనుప్రమాద హెచ్చరిక! మొన్న 24 గంటల వ్యవధిలో 30 లక్షల మోతాదులకు మించి వ్యాక్సిన్ ఇవ్వడాన్ని నూతన రికార్డుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించిననాడే, పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికాంశాలు వెలుగుచూశాయి.
అక్షరాలా మహాయజ్ఞమనదగ్గ వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో మొదలై రెండు నెలలైంది. ఇప్పటికి కొవిడ్ టీకాలు వేయించుకున్నవారి సంఖ్య సుమారు మూడున్నర కోట్లు. తొలి దశ లక్ష్యంగా నిర్దేశించుకున్న 50కోట్ల మోతాదుల్లో నెరవేరింది ఏడుశాతమేనని, ఇదే వేగం ఇలాగే కొనసాగితే జనాభా అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఏడేళ్లకుపైగా పడుతుందని స్థాయీ సంఘం నివేదిక సూచిస్తోంది. టీకాలు వేయడంలో జాప్యం జరిగేకొద్దీ మరిన్ని రకాల వైరస్‌లు పుట్టుకొచ్చే ముప్పుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, దిల్లీ, గుజరాత్, కర్ణాటక, హరియాణాలలో రోజువారీ కొత్త కేసుల నమోదు వేగం భీతిల్లజేస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మలిదశ ప్రజ్వలనాన్ని క్షేత్రస్థాయి కథనాలు సూచిస్తున్నాయి. ఏపీలోని తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తక్షణం అప్రమత్తం కావాలంటూ వైద్యారోగ్య సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణలోనూ కామారెడ్డి, మంచిర్యాల, బాలానగర్ ప్రాంతాల్లో బడిపిల్లలు, ఉపాధ్యాయులకు కొవిడ్ కేసుల తాకిడి ఏమాత్రం అలసత్వమైనా అనర్థదాయకమేనని చాటుతోంది. ప్రాణావసర టీకాలూ కొన్నిచోట్ల వృథా కావడంకన్నా విషాదం ఏముంటుంది? దాన్ని అరికట్టడం సహా కరోనా పరీక్షలు, టీకా కేంద్రాలను పెంచాలన్న ప్రధానమంత్రి తాజా సూచనల స్ఫూర్తిని రాష్ట్రాలన్నీ అందిపుచ్చుకొని, వ్యాక్సినేషన్ ప్రక్రియను శీఘ్రతరం చేసేందుకు కలిసికట్టుగా కూడిరావాల్సిన సంక్లిష్ట తరుణమిది.
మందకొడిగా టీకా పంపిణీ