తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పంటల బీమాతోనే రైతుకు భరోసా

పంటనష్టంపై రైతులకు సాయం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి పంటల బీమా యోజన పథకం కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది. రైతులకు ఉపయోగపడే ఈ పథకం అమలు చేయడానికి రాష్ట్రాలు అనాసక్తి చూపిస్తున్నాయి. మరి ఈ పథకం క్షేత్రస్థాయిలో అన్నదాతలకు ఏ విధంగా మేలు చేస్తుంది? రాష్ట్రాల వైఖరికి కారణమేంటి?

opinion, pm fasal bima yojana
బీమాతోనే రైతుకు భరోసా.

By

Published : Jan 25, 2021, 7:02 AM IST

'ప్రధానమంత్రి పంటల బీమా యోజన' (పీఎంఎఫ్‌బీవై) అమలు తీరు అస్తవ్యస్తంగా మారింది. వ్యవసాయంపైనే ఆధారపడిన పేద రైతులు ఎక్కువగా ఉన్న అరడజను రాష్ట్రాలు ఈ పథకాన్ని పక్కన పెట్టడం వ్యవసాయాభివృద్ధిపై అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను చాటుతోంది. గత వానాకాలంలో దేశవ్యాప్తంగా అధిక వర్షాలు, వరదలకు లక్షల మంది రైతులు పంటలు నష్టపోయారు. పంటల బీమా పథకం నిబంధనల ప్రకారం నష్టపోయిన రైతులకు రెండు నెలల్లోగా పరిహారం ఇవ్వాల్సి ఉన్నా అందలేదు. అసలు పథకమే అమలు చేయకుండా రైతులకు మరింత మేలు చేస్తామని చెప్పిన రాష్ట్రాల్లోనూ ఇచ్చిందేమీ లేదు. కేంద్రం తెచ్చిన పథకం సరిగా లేదంటూ అమలుకు నిరాకరించిన రాష్ట్రాలు అంతకన్నా మెరుగ్గా ఎందుకు తక్షణ సాయం చేయలేకపోతున్నాయని అడిగేవారూ లేరు.

పారదర్శకత పూజ్యం

మూడు వైపులా సముద్రాలు, మరోవైపు మంచుపర్వతాలు ఉన్న దేశంలో ఏటా ఏదో ఒక ప్రాంతంలో తుపాన్లు, కరవులు, వరదలు అనివార్యం. ప్రతి సీజన్‌లో మూడోవంతు పంటలు ఏదో ఒక విపత్తు బారిన పడటం వల్ల రైతులు నష్టపోతున్నారు. భారత్‌లో మొత్తం 36 రకాల వాతావరణ మండలాలు ఉండటం వల్ల ఏ రెండు ప్రాంతాల్లో ఒకే తరహా వాతావరణం ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లాంటి చిన్న రాష్ట్రంలోనే కోస్తా ప్రాంతంలో తుపాన్లు వస్తే మరోవైపు రాయలసీమలో వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటాయి. ఇలాంటి వైవిధ్య వాతావరణ ప్రాంతాలున్న దేశంలో విత్తు వేసినప్పటి నుంచి పంటనూర్పిళ్ల వరకూ వాతావరణం అనుకూలించి దాన్ని మార్కెట్లలో అమ్ముకోవడం రైతులకు కత్తిమీద సామే.

అంగీకరించని రాష్ట్రాలు

వాతావరణంలో ఏమాత్రం తేడా వచ్చినా పైర్లు నాశనమై అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. పంట పోయినా 'మేమున్నాం' అని భరోసా ఇచ్చే పథకాలు లేకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రారంభించిన ప్రతిష్ఠాత్మక పథకాల్లో 'పీఎంఎఫ్‌బీవై' ముఖ్యమైంది. 2022కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే పథకాల్లో ఇదొకటని కేంద్రం ప్రచారం చేసుకుంది. కానీ దేశంలో అత్యధికంగా వరి పండించే పంజాబ్‌, పశ్చిమ్‌ బంగ రాష్ట్రాల్లోనే ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించలేదు. 2018లో బిహార్‌, 2019లో పశ్చిమ్‌ బంగ, 2020 నుంచి తెలంగాణ, ఏపీ, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు పీఎంఎఫ్‌బీవై అమలు చేసేది లేదంటూ తప్పుకొన్నాయి. పంజాబ్‌ మొదటి నుంచీ ఈ పథకానికి దూరంగానే ఉంది.

పశ్చిమ్​ బంగ బాటలోనే తెలుగు రాష్ట్రాలు

పశ్చిమ్‌ బంగలో ఈ పథకమే కాకుండా రైతు బ్యాంకు ఖాతాలో ఏటా ఆరువేల రూపాయలు కేంద్రం జమచేసే 'ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి'(పీఎం కిసాన్‌) పథకాన్నీ అమలు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండో సీజన్‌ (2019 రబీ) నుంచే పీఎంఎఫ్‌బీవై అమలు ఆపేశారు. ఏపీ ప్రభుత్వం సొంతంగా పంటల బీమా పథకం అమలు చేస్తామని, పీఎంఎఫ్‌బీవైకన్నా మెరుగైన సాయం చేస్తామని ప్రకటించింది. 2020లో ముగిసిన రబీ సీజన్‌ పంటనష్టాలకూ ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. 2020 ఖరీఫ్‌ (జూన్‌ నుంచి అక్టోబరు)లోనూ అధిక వర్షాలకు పంటలు నష్టపోయిన లక్షల మంది రైతుల్లో ఎవరికెంత బీమా పరిహారం వస్తుందనేది కూడా ఏపీ సర్కారు ఇంతవరకూ ప్రకటించలేదు. అదే పీఎంఎఫ్‌బీవై అమలులో ఉంటే వర్షాలు కురిసి పంటనష్టపోతే పరిహారంలో 25 శాతం సొమ్ము రైతులకు వెంటనే ఇవ్వాలనే నిబంధన ఉంది.

ఈ పథకాన్ని ఆపేసిన ఏపీ ప్రభుత్వం 25 శాతం వెంటనే ఇవ్వడం మాట దేవుడెరుగు కనీసం ఎంతమందికి ఎంత పరిహారం ఇస్తారనే మాట కూడా సీజన్‌ ముగిసిన నాలుగు నెలలైనా చెప్పలేదు. ఇక తెలంగాణలో 2020 జూన్‌లో ఖరీఫ్‌ నుంచి పీఎంఎఫ్‌బీవై అమలును రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఎందుకు ఆపేశారో కూడా చెప్పలేదు. ప్రత్యామ్నాయంగా మరో బీమా పథకాన్నీ ప్రకటించలేదు. తెలంగాణలో గత జులై-అక్టోబరు మధ్య అధిక వర్షాలతో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. పీఎంఎఫ్‌బీవై అమలులో ఉంటే వారిలో ప్రీమియం చెల్లించిన వారందరికీ పరిహారం వచ్చి ఉండేది.

నిధులు కేటాయించాలి

పీఎంఎఫ్‌బీవై అమలులో ఉన్న లోపాలను సరిచేసి కొత్త నిబంధనలు పెడుతున్నట్లు కేంద్రం ఏటా చెబుతున్నా.. పరిహారం సరిగా అందడం లేదంటూ రాష్ట్రాలు వెనక్కి జరుగుతున్నాయి. వాస్తవానికి ప్రీమియం రాయితీ సొమ్మును కట్టలేకనే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని వద్దంటున్నాయనే విమర్శలోనూ కొంత నిజం ఉంది. 2019లో ఈ పథకానికి చెల్లించాల్సిన రూ.200 కోట్ల ప్రీమియం రాయితీని తెలంగాణ ప్రభుత్వం 2021 వచ్చినా విడుదల చేయకపోవడం వల్ల రైతులకు పరిహారం ఆగిపోయింది. రైతులను విపత్తుల సమయంలో ఆదుకునే ఏకైక పథకం పంటల బీమాయే. ఈ పథకం అమలు కోసం పలు దేశాల్లో.. ఉపగ్రహ చిత్రాలతో సాగైన పంటలు, దెబ్బతిన్న విస్తీర్ణం వంటి వివరాలను రోజుల వ్యవధిలోనే గుర్తించి పరిహారాన్ని ఇస్తున్నారు.

మనదేశంలోనూ ఈ పద్ధతిని అనుసరించవచ్చు. రాష్ట్రాల బడ్జెట్లలో ఈ పథకానికి నిధులు కేటాయించాలి. బ్యాంకుల నుంచి పంటరుణం అందని, భూమి లేని కౌలురైతులకు ప్రీమియం చెల్లింపు సులభతరం చేయాలి. కరవులు, తుపాన్లు వంటి విపత్తుల వల్ల ఎక్కువగా నష్టపోయే జిల్లాల పంటలకు రాష్ట్రాలే ప్రీమియం చెల్లించి పరిహారం వచ్చేలా చూడాలి. పంట దెబ్బతిన్న రెండు నెలల్లోగా పరిహారం బాధితులకు ఇవ్వాలనే నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూసినప్పుడే పీఎంఎఫ్‌బీవై వంటి పథకాలు విజయవంతమవుతాయి. కేంద్రం అమలు చేసే పథకాలకు నిధులు సర్దుబాటు చేయలేక తప్పుకొంటున్న రాష్ట్రాలు, అంతకన్నా మెరుగైన సాయం సత్వరమే అందించాలి.

సహకరించని కంపెనీలు

పంటల బీమా పథకంపై కాగితాల్లో ఉన్న నిబంధనలకు, క్షేత్రస్థాయిలో అమలుకు ఎంతో వ్యత్యాసం ఉంటోంది. ప్రైవేటు బీమా కంపెనీలు రైతులకు సహకరించడం లేదు. పంటలు నష్టపోయిన 72 గంటల్లోగా రైతులు సమాచారమిస్తే బీమా కంపెనీల ప్రతినిధులు వచ్చి పంటలను పరిశీలించాలి. రైతులు ఫోన్‌ చేస్తే కనీస స్పందన ఉండటం లేదు. తక్షణం 25 శాతం పరిహారం ఇవ్వాలనే నిబంధనను ఏ కంపెనీ అమలు చేయడం లేదు. ప్రీమియం మాత్రం భారీగా వసూలు చేసేలా అధిక రేట్లకు టెండర్లు వేసి దక్కించుకుంటున్నాయి. భూమి లేని, బ్యాంకు నుంచి పంట రుణం తీసుకోని రైతులు నేరుగా ప్రీమియం కట్టాలంటే కనీసం దరఖాస్తులు కూడా తీసుకోకుండా కంపెనీలు సతాయిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చొప్పున ప్రీమియం రాయితీని భరించాలనే నిబంధన ఉన్నా, చాలా రాష్ట్రాలు నెలల తరబడి సొమ్ము విడుదల చేయడం లేదు.

-మంగమూరి శ్రీనివాస్‌

ఇదీ చదవండి :బలిపీఠంపై భావస్వేచ్ఛ!

ABOUT THE AUTHOR

...view details