స్వాతంత్య్రానంతరం మనదేశం హరిత విప్లవాన్ని సాధించింది. వరి, గోధుమ వంటి ఆహార పంటల్లో అధికోత్పత్తులతో స్వావలంబన సాధ్యమైంది. అదే సమయంలో బంగారం పండే నేలలు నిస్సారమయ్యాయి. దానితో ప్రధాన ఆహార పంటల్లో పోషకాల స్థాయి పడిపోతోంది. వ్యవసాయ పద్ధతుల్లో లోపాల కారణంగా, రైతులు ఎంతో పెట్టుబడి పెట్టి వేస్తున్న ఎరువులూ పంటకు అందడం లేదు. పైగా అవి లభ్యం కాని రూపంలోకి వెళ్లి నిల్వలు పేరుకుపోతున్నాయి. వీటన్నింటి ఫలితంగా నేలలో సేంద్రియ కర్బన శాతం ప్రమాదకరంగా తగ్గి పంటల్లో పోషకాల శాతం క్షీణించి రసాయన అవశేషాలను ఆహారంగా స్వీకరించాల్సి వస్తోంది. నేల సత్తువ క్షీణించే కొద్దీ మునుముందు మానవారోగ్యం మరింత ప్రమాదంలో పడవచ్చు.
మోతాదుకు మించి వినియోగం
మోతాదుకు మించి వేస్తున్న రసాయనాల వల్ల దిగుబడులు అటుంచి నేల చౌడుబారిపోతోంది. పౌష్టికాహార సమస్య నుంచి బయట పడేందుకు ఆహారోత్పత్తులను ఇబ్బడిముబ్బడిగా పెంచుకోగలిగాం కానీ, ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ఆహార పంటల్లో పోషకాల లభ్యత క్రమంగా పడిపోతోందని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)కి చెందిన బిదాన్‌చంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడించారు. వరి, గోధుమ, మొక్కజొన్నల్లో యాభై ఏళ్ల క్రితం ఉన్న పోషకాలు నేడు లేవని ఈ అధ్యయనం పేర్కొంది. 1960లో వరిలో జింక్ కిలోకు 27.1మి.గ్రా, ఐరన్ కిలోకు 59.8 మి.గ్రా. చొప్పున నమోదయ్యాయి. గోధుమలో ఇవి కిలోకు 33.3 మి.గ్రా, 57.6 మిల్లీ గ్రాముల చొప్పున ఉండేవి. ఇటీవల చేసిన పరిశోధనల్లో ఈ పోషకాలు తగ్గినట్టు గుర్తించారు. వరిలో జింక్ కిలోకు 20.6 మి.గ్రా, ఐరన్ కిలోకు 43.1 మిల్లీ గ్రాములకు తగ్గగా, గోధుమలోనూ ఇవి కిలోకు 23.5 మి.గ్రా, 46.4 మిల్లీ గ్రాముల మేరకే నమోదయ్యాయి. దిగుబడులు పెంచడం కోసం రసాయన ఎరువులు వేయడంపై ఉన్న శ్రద్ధ నేలల సంరక్షణపై ఉండటం లేదని ఈ అధ్యయనం నిరూపిస్తోంది. దేశంలో జింక్, ఐరన్ లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరగడానికి ఇదే కారణమని అధ్యయనం పేర్కొంది. తగినన్ని పోషకాలు ఇక్కడ కొరవడుతున్న కారణంగా అమెరికా ప్రజలు భారత్ బియ్యం కంటే థాయ్‌లాండ్ బియ్యాన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దేశీయంగా సేంద్రియ వ్యవసాయ విధానాలకు తిలోదకాలు ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం.
జింక్ పాస్ఫేట్ మొక్కలకు అందకుండా భూమిలోనే ఉండిపోతున్నందు వల్లే వరి, గోధుమల్లో జింకు లోపం తలెత్తుతోంది. అదేవిధంగా దేశంలోని నేలల్లో ఐరన్ 70 శాతం వరకు ఉంది. అదీ పంటలకు లభ్యం కాని రూపంలోనే ఉండిపోవడం వల్ల మొక్కలు గ్రహించలేక పోతున్నాయి. దిగుబడులు పెరిగేందుకు ఇష్టానుసారం ఎరువులు, రసాయనాలను చల్లేస్తుండటం వల్ల నేలలో సహజంగానే ఉండే, పంటకు మేలు చేసే సూక్ష్మజీవులూ అంతరిస్తున్నాయి. ఫలితంగా నేలలో పోషకాలు ఉన్నా అక్కరకు రావడం లేదు. దీన్ని బట్టి విత్తనం కంటే నేల సత్తువలోనే విషయం ఉందన్న సంగతిని గమనంలో ఉంచుకోవాలి. ప్రత్యామ్నాయంగా జీవ ఎరువులు వాడినా అవి పని చేయాలంటే నేలలో సేంద్రియ కర్బనం ఉండాల్సిందే. సేంద్రియ కర్బనం తగ్గడం వల్ల అత్యుత్తమ విత్తనాలను వేసినా నేలలు స్పందించే శక్తిని కోల్పోయాయి. ఫలితంగానే నేటి ఆహార పంటల్లో పోషకాల స్థాయులు పడిపోతున్నాయి. వాటిని సంరక్షించుకునే ప్రత్యామ్నాయ పద్ధతులను ఆచరించడం ఒక్కటే ఇందుకు పరిష్కారం.
సేంద్రియ సేద్యమే శరణ్యం